వడ్డీ లేకుండా రూ.5 లక్షల రుణం: మీరు అర్హులేనా?

First Published Oct 22, 2024, 3:35 PM IST

వడ్డీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణం అందించేందుకు మోడీ ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. ఈ రుణం పొందడానికి దరఖాస్తు చేసుకోవడం చాలా సులభమే అయినప్పటికీ చాలా మందికి ఈ పథకం గురించి తెలియక ఎవరూ ఉపయోగించుకోవడం లేదు. ఆ పథకం ఏమిటి? దానికి ఎలా అప్లై చేయాలి? లోన్ ఎలా పొందాలి? ఇలాంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

మహిళా సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. మహిళలు ఆర్థికంగా సంపాదించడం చాలా ముఖ్యమని మోదీ ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. అప్పుడే మన దేశం ముందుకు సాగుతుందని భావిస్తోంది. అందుకే మహిళలకు వివిధ రకాల నైపుణ్యాలను నేర్పించి, ఉపాధి కల్పించేందుకు ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా కొన్ని పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు ఎంతో అండగా ఉంటున్నాయి. అలాంటి పథకాలలో ఒకటి లఖ్‌పతి దీదీ పథకం. దీని ద్వారా మహిళలు వడ్డీ లేని రుణాలను పొందవచ్చు. ఈ పథకం అమలులోనే ఉన్నప్పటికీ ప్రచారం లేక చాలామందికి దీని గురించి తెలియక ఉపయోగించుకోవడం లేదు. 

మహిళలను లక్షాధికారులను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2023లో లఖ్‌పతి దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ అమలు చేస్తోంది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే 2 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే మధ్యంతర బడ్జెట్‌లో దాదాపు 3 కోట్ల మంది మహిళలకు రుణాలను అందించాలని టార్గెంట్ పెట్టుకున్నారు. అయితే ఈ పథకానికి ప్రచారం లేకపోవడం వల్ల పెద్దగా ఎవరికీ దీని గురించి తెలియడం లేదు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం ప్రచారం కల్పించే దిశగా ఆలోచనలు చేస్తోంది. గత సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ లఖ్ పతి దీదీ పథకాన్ని ప్రారంభించారు.

Latest Videos


ఈ పథకం ద్వారా 5 లక్షల రూపాయల వరకు వ్యాపార రుణం వడ్డీ లేకుండా పొందవచ్చు. మహిళలకు వ్యాపార శిక్షణ కూడా అందిస్తారు. దీనికి అర్హత సాధించాలంటే మహిళలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉండాలి. 18 నుంచి 50 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నవారు లఖ్‌పతి దీదీ పథకానికి అర్హులు. 

ఈ పథకం ద్వారా మహిళలకు ఎల్‌ఈడీ బల్బుల తయారీలో శిక్షణ ఇస్తారు. పశుపోషణ, పుట్టగొడుగుల పెంపకం వంటి వివిధ రకాల శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. తర్వాత వారికి ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్‌, ఆన్‌లైన్ వ్యాపారం, బిజినెస్‌కు సంబంధించిన శిక్షణను కూడా అందిస్తారు. ఈ స్కీమ్‌ ద్వారా మహిళలు ఆదాయ వనరుల్ని కల్పించుకునేందుకు, పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మీరు ఈ స్కీమ్‌ ద్వారా రుణాన్ని పొందాలనుకుంటే మీ జిల్లాలోని మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యాలయాన్ని సందర్శించాలి. అక్కడ లఖ్‌పతి దీదీ పథకం ఫారమ్​ తీసుకుని వివరాలన్నీ నింపాలి. తర్వాత కావాల్సిన డాక్యుమెంట్లను జత చేసి సంబంధిత అధికారులకు అందజేయాలి. మీ దరఖాస్తు ఫారమ్​ను అధికారులు పరిశీలించి అన్ని అర్హతలు ఉంటే వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేస్తారు.

మీరు ఈ స్కీమ్ లో చేరడానికి మీ ఆధార్​ కార్డు, బ్యాంక్​ పాస్​బుక్​, SHG సభ్యత్వ కార్డు, కులధ్రువీకరణ పత్రం, ఫోన్​ నెంబర్​, పాస్​ ఫొటో జత చేసి అప్లికేషన్ ఫారమ్ లో కావాల్సిన వివరాలన్నీ నమోదు చేయాలి. 

సొంత వ్యాపారం ప్రారంభించాలన్న తపనతో ఉన్న మహిళలకు ఈ లఖ్ పతి దీదీ పథకం మంచి అవకాశం. వడ్డీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణం అంటే ఎంతో పెద్ద సాయం. అయితే మహిళలు స్వయం సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారు మాత్రమే ఈ స్కీమ్ లో రుణం పొందడానికి అర్హులు. అందువల్ల మీరు ఇంకా ఏ సంఘంలోనూ చేరకపోతే వెంటనే ఒక గ్రూప్ లో సభ్యులుగా చేరి మీ వ్యాపార ఆలోచనలను మెరుగు పరచుకోండి. దేశ వ్యాప్తంగా మొత్తం 3 కోట్ల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం ధ్యేయంగా పనిచేస్తోంది. అందువల్ల మీరు కచ్చితంగా ఈ రుణం పొందడానికి అర్హులవుతారు. ఈ రుణం పొందడానికి, బృందం ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. నిర్ణీత సమయంలోపు రుణం మంజూరవుతుంది.

click me!