రోజూ బంగారం రేటు ఎవరు నిర్ణయిస్తారు? లక్షలు దాటుతున్న గోల్డ్ అసలు లెక్క ఇదే !

Published : Oct 20, 2025, 03:35 PM IST

Who Decides Gold Rate : బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకప్పుడు వందలు వేలు.. ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర లక్షలకు చేరింది. అయితే, ప్రతి రోజు భారత్ లో బంగారం రేటు ఎవరు నిర్ణయిస్తారు? వివిధ ప్రాంతాలకు ఎందుకు మారుతుంది? ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
బంగారం ధరల కొత్త రికార్డులు

భారత్ లో బంగారం ధరలు కొత్త రికార్డులు సాధిస్తున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర ₹1.30 లక్షలు దాటింది. రాబోయే రోజుల్లో రెండు లక్షల మార్కుకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ భారీ పెరుగుదలతో మధ్యతరగతి కుటుంబాలు బంగారం కొనుగోళ్లను నిలిపివేస్తున్నాయి. ధంతేరాస్, దీపావళి పండుగల ముందు ఈ పెరుగుదల బంగారం అమ్మకాలపై కాస్త ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, బంగారం ధరల పెరుగుదల ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. హైదరాబాద్‌లో సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,30,690 గా ఉంది. ఆదివారం ధర ₹1,30,860 గా నమోదైంది.

25
రోజూ బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు?

బంగారం ధరను నిర్ణయించే ఒక వ్యక్తి లేదా ప్రభుత్వ సంస్థ లేదు. పెట్రోల్, డీజిల్‌ల మాదిరిగానే బంగారం, వెండి ధరలు కూడా ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలను లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (London Bullion Market Association - LBMA) రోజుకు రెండు సార్లు వెల్లడిస్తుంది. అంటే ఉదయం 10:30 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 3:00 గంటలకు మరోసారి బంగారం ధరలను ప్రకటిస్తుంది. భారత్ లో మాత్రం ఈ ధరలను ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం విడుదల చేస్తుంది.

ఈ ధరలను నిర్ణయించే సమయంలో గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్, డాలర్-రూపాయి మారకం విలువ, దిగుమతి పన్నులు (ఇంపోర్ట్ ఫీజులు), స్థానిక డిమాండ్-సరఫరా పరిస్థితులు వంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటారు.

35
ఆర్బీఐ (RBI) లేదా ప్రభుత్వం బంగారం రేటు నిర్ణయిస్తుందా?

చాలామంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లేదా కేంద్ర ప్రభుత్వం బంగారం ధరను నిర్ణయిస్తుందని అనుకుంటారు. కానీ ఇది తప్పు. ఆర్బీఐ గాని, ప్రభుత్వం గాని బంగారం రేటును నిర్ణయించదు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బంగారం మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ ధరలు, రూపాయి-డాలర్ మారకం విలువ, స్థానిక డిమాండ్ వంటి అంశాలను పరిశీలించి ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) రోజువారీ ధరలను విడుదల చేస్తుంది. అంటే భారత్ లో బంగారం ధరలను నిర్ణయించేది ఐబీజేఏ.

45
బంగారం స్పాట్ రేట్ అంటే ఏమిటి? వివిధ ప్రాంతాలకు గోల్డ్ రేటు ఎందుకు మారుతుంది?

మార్కెట్లో రోజువారీ కొనుగోలు, అమ్మకాలకు ఉపయోగించే ధరను “స్పాట్ రేట్” అంటారు. ఇది 24 గంటలూ మారుతూ ఉంటుంది. దేశంలోని ప్రతి నగరంలో ఒకే రేటు ఉండదు. స్థానిక జ్యువెలర్స్ అసోసియేషన్లు మార్కెట్ తెరుచుకున్న వెంటనే తమ ప్రాంతానికి సంబంధించిన రేటును నిర్ణయిస్తాయి.

వారు ఐబీజేఏ రేటుకు తోడు పన్నులు, లెవీలు, వ్యయాలు వంటి అంశాలను కలిపి స్థానిక ధరల జాబితాను విడుదల చేస్తారు. అలాగే బంగారం శుద్ధత (క్యారెట్) ఆధారంగా కూడా ధరల్లో తేడాలు ఉంటాయి. అందుకే వివిధ ప్రాంతాల్లో వేరువేరుగా గోల్డ్ రేటు ఉంటుంది.

55
బంగారం ధరలు : ఎంసీఎక్స్ (MCX), బులియన్ మార్కెట్ ఏమిటి?

భారత్ లో ఎంసీఎక్స్ ( MCX - Multi Commodity Exchange) అనేది అతిపెద్ద కమోడిటీ ఎక్స్ఛేంజ్. ఇది 2003లో ముంబైలో స్థాపించారు. ఇక్కడ బంగారం, వెండి, చమురు, వ్యవసాయ ఉత్పత్తుల ఫ్యూచర్ ట్రేడింగ్ జరుగుతుంది. 1 కిలో, 100 గ్రాములు, 8 గ్రాములు, 1 గ్రాము పరిమాణాల్లో ట్రేడింగ్ జరుగుతుంది.

బులియన్ మార్కెట్ అనేది బంగారం, వెండి వంటి విలువైన లోహాల వ్యాపార కేంద్రం. ఈ మార్కెట్‌లో ధరలు ప్రపంచ డిమాండ్, సరఫరా, ప్రభుత్వ విధానాలు, గ్లోబల్ ఎకానమీ ఆధారంగా మారుతుంటాయి. ప్రతిరోజూ మారే బంగారం ధర వెనుక గణాంకాలు, గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు, రూపాయి విలువ కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories