Viral News: ఆన్‌లైన్ గ్రాసరీ డెలివరీ సంస్థ జెప్టో పేరుతో ఓ జాబ్ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టులో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారికి ఉండాల్సిన అర్హతలు చర్చకు కారణంగా మారాయి. దీనిపై ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
జెప్టోకు సంబంధించిన ఓ ఇంటర్న్‌షిప్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టులో బీటెక్, బీబీఏ, బీసీఏ, బీకామ్ (Hons) చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఇంటర్న్‌షిప్ వ్యవధి మూడు నెలలు కాగా, నెలకు రూ.20 వేల స్టైపెండ్ ఇస్తారని పోస్టులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పోస్టులో ఉన్న కొన్ని అర్హతలు ఇప్పుడు చర్చకు కారణమయ్యాయి.
24
20 కిలోల బరువు ఎత్తాలన్న షరతు ఎందుకు?
జాబ్ పోస్టులోని ‘స్కిల్స్ రిక్వర్డ్’ విభాగంలో అభ్యర్థులు 20 కిలోల వరకు బరువును ఎత్తగలగాలి అని పేర్కొన్నట్లు పోస్టులో కనిపిస్తోంది. అలాగే వేగంగా జరిగే పని వాతావరణంలో 10 నుంచి 12 గంటల పాటు నిలబడి పనిచేయగల సామర్థ్యం ఉండాలని కూడా ఉంది. ఈ పోస్టును చూసిన కొందరు సోషల్ మీడియా యూజర్లు ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా టెక్నికల్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్ అని చెబుతూ, ఇలాంటి శారీరక సామర్థ్యాలను ఎందుకు అర్హతగా పెట్టారనే చర్చ మొదలైంది.
34
సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందన
ఈ జాబ్ పోస్టుపై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. కొందరు సరదాగా స్పందిస్తూ.. “ఇక ఇంటర్న్‌షిప్ కోసం జిమ్‌కు వెళ్లడం కూడా అవసరమేనా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ పోస్టు నిజమైనదేనా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫేక్ పోస్టు కావచ్చని, AI ద్వారా రూపొందించిన చిత్రం కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు మాత్రం ఇది సాధారణ టెక్నికల్ ఇంటర్న్‌షిప్ కాకుండా, డార్క్ స్టోర్ మేనేజర్ వంటి ఉద్యోగానికి సంబంధించిన పోస్టు అయి ఉండొచ్చని చెబుతున్నారు. అలాంటి ఉద్యోగాల్లో స్టోర్‌లోని వస్తువులను తరలించాల్సి రావడంతో బరువు ఎత్తే అవసరం ఉండొచ్చని అంటున్నారు.
వైరల్ అవుతున్న ఈ జాబ్ పోస్టులోని స్క్రీన్‌షాట్ నిజమైనదేనా? లేదా నకిలీదా? అనే దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు. ఈ విషయంపై జెప్టో నుంచి అధికారిక వివరణ కూడా వెలువడినట్లు సమాచారం లేదు. అందువల్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టును పూర్తిగా నిజమని నిర్ధారించడం సరైంది కాదు. అయితే 20 కిలోల బరువు ఎత్తడం, 10–12 గంటలు నిలబడి పనిచేయడం వంటి నిబంధనలు ఉన్నాయని చెబుతున్న ఈ పోస్టు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది.