
దేశంలోని కోట్లాది మంది యూపీఐ యూజర్లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే రోజుల్లో మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ లేదా నెట్‌వర్క్ సిగ్నల్ లేకపోయినా సరే యూపీఐ ద్వారా చాలా ఈజీగా పేమెంట్స్ చేయవచ్చు. తాజా రిపోర్టుల ప్రకారం.. కస్టమర్ మొబైల్, వ్యాపారి వద్ద ఉండే పాయింట్-ఆఫ్-సేల్ టెర్మినల్ రెండూ ఇంటర్నెట్‌కు కనెక్ట్ కాకపోయినా సరే ట్రాన్సాక్షన్ పూర్తి చేసేలా కొత్త సదుపాయాన్ని అభివృద్ధి చేస్తున్నారు.
ఈ సిస్టమ్‌లో నియర్-ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వ్యాపారి వద్ద ఉన్న ఆఫ్‌లైన్ పోస్ టెర్మినల్‌పై టాప్ చేయడం ద్వారా కస్టమర్లు తమ బిల్లులను చెల్లించవచ్చు. ఈ కొత్త విధానంలో ఒక్కో ట్రాన్సాక్షన్‌కు గరిష్ఠంగా రూ.2,000 వరకు పేమెంట్ చేసే వెసులుబాటు ఉంటుంది.
ఈ ఆఫ్‌లైన్ ఫీచర్‌ను ఉపయోగించుకోవడానికి కస్టమర్ ముందే ఇంటర్నెట్ ఉన్న సమయంలో తన ఫోన్‌లోని యూపీఐ లైట్ వాలెట్‌లో డబ్బులు డిపాజిట్ చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత నెట్‌వర్క్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో లేని ప్రాంతాలకు వెళ్లినప్పుడు, వాలెట్‌లోని బ్యాలెన్స్‌ను ఉపయోగించి వ్యాపారి ఆఫ్‌లైన్ పోస్ టెర్మినల్ వద్ద నేరుగా పేమెంట్ చేయవచ్చు.
మరింత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ రకమైన ట్రాన్సాక్షన్ చేయడానికి ప్రతిసారీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదని రిపోర్టు పేర్కొంది. ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్ ఉన్న ఫోన్‌ను సంబంధిత పోస్ టెర్మినల్‌పై జస్ట్ టాప్ చేస్తే చాలు, పేమెంట్ ప్రాసెస్ తక్షణమే పూర్తవుతుంది.
తరచూ సిగ్నల్స్ కట్ అయ్యే ప్రాంతాల్లో లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీ అసలు లేని చోట ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విమాన ప్రయాణాలు చేసే సమయంలో, భూగర్భ మెట్రో స్టేషన్లలో, సబ్‌వేలు లేదా రైల్వే నెట్‌వర్క్ సరిగా లేని సుదూర ప్రాంతాల్లో ప్రయాణికులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.
రిపోర్టుల ప్రకారం, 2026 నాటికి ఎన్‌పీసీఐ ప్రముఖ పోస్ టెర్మినల్ తయారీ కంపెనీల డివైజ్‌లకు అవసరమైన సర్టిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. పోస్ టెర్మినల్స్ అనేది వ్యాపారులు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ప్రీపెయిడ్ కార్డ్ లేదా మొబైల్ వాలెట్ల ద్వారా డబ్బులు స్వీకరించడానికి ఉపయోగించే హార్డ్‌వేర్ పరికరం. ఇకపై ఈ ఆఫ్‌లైన్ సిస్టమ్‌లో ఇంటర్నెట్ లేనప్పుడు పోస్ టెర్మినల్ పేమెంట్ అథరైజేషన్‌ను తాత్కాలికంగా సేవ్ చేసి ఉంచుకుంటుంది. మళ్లీ నెట్‌వర్క్ లేదా ఇంటర్నెట్ రాగానే ఆ వివరాలను వెరిఫికేషన్ కోసం మెయిన్ సర్వర్లకు పంపుతుంది. బ్యాంకులు, థర్డ్-పార్టీ యూపీఐ యాప్‌లు కూడా ఈ సదుపాయాన్ని తమ యాప్‌లలో త్వరలోనే రోల్ అవుట్ చేయనున్నాయి.
ఎన్‌పీసీఐ సెప్టెంబర్ 2023లోనే యూపీఐ లైట్ ఎక్స్ అనే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. నెట్‌వర్క్ లేనప్పుడు కూడా మనీ ట్రాన్స్‌ఫర్ చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. జనవరి 2024లో ఎన్‌పీసీఐ విడుదల చేసిన యూపీఐ లైట్ ఎక్స్ గైడ్‌లైన్స్ ప్రకారం, ఎన్‌ఎఫ్‌సీ ఉన్న రెండు ఫోన్ల మధ్య ఆఫ్‌లైన్ పర్సన్-టు-పర్సన్ (P2P) పేమెంట్స్ చేసుకోవచ్చు.
అలాగే ఎన్‌ఎఫ్‌సీ ఉన్న క్యూఆర్ కోడ్, సౌండ్‌బాక్స్ లేదా స్టిక్కర్లపై టాప్ చేసి వ్యాపారులకు పేమెంట్స్ చేయవచ్చు. అయితే, ఇప్పుడు ప్రతిపాదించిన కొత్త విధానంలో ముఖ్యమైన మార్పు 'హార్డ్‌వేర్'. వ్యాపారులు ఇప్పటికే వాడుతున్న సంప్రదాయ పోస్ టెర్మినళ్లపైనే ఎన్‌పీసీఐ సర్టిఫికేషన్‌తో ఇంటర్నెట్ లేకున్నా నేరుగా యూపీఐ పేమెంట్లను అంగీకరించవచ్చు.
కొత్తగా ప్రతిపాదించిన ఈ ఆఫ్‌లైన్ యూపీఐ సదుపాయంలో ఒక ట్రాన్సాక్షన్‌కు రూ.2,000 వరకు లిమిట్ ఉంటుంది. అయితే, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్తమాన ఆఫ్‌లైన్ డిజిటల్ పేమెంట్ నిబంధనల కంటే భిన్నంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆర్బీఐ ఉన్న ఆఫ్‌లైన్ డిజిటల్ పేమెంట్ రూల్స్ ప్రకారం ఒక సాధారణ ట్రాన్సాక్షన్‌కు గరిష్ఠ పరిమితి రూ.500 మాత్రమే. అదే సమయంలో ఒక పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్‌పై మొత్తం ఆఫ్‌లైన్ బ్యాలెన్స్ పరిమితి రూ.2,000గా ఉంది.
యూపీఐ లైట్ విషయానికి వస్తే ఒకసారి చేసే పేమెంట్‌కు రూ.1,000, వాలెట్‌లో గరిష్ఠంగా రూ.5,000 వరకు బ్యాలెన్స్ ఉంచుకోవడానికి అవకాశం ఉంది. కానీ కొత్తగా వచ్చే ఆఫ్‌లైన్ పోస్ సిస్టమ్‌కు సంబంధించి ఎన్‌పీసీఐ ఇంకా అధికారిక ఆపరేటింగ్ నిబంధనలను విడుదల చేయాల్సి ఉంది. కాబట్టి ఈ రూ.2,000 పరిమితి ఆర్బీఐ రూల్స్‌లో ఎలా అమలు అవుతుందనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
గమనించాల్సిన విషయమేమిటంటే, ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆఫ్‌లైన్ పేమెంట్ సదుపాయాన్ని ప్రారంభించడానికి కస్టమర్ ముందస్తు సమ్మతి తప్పనిసరి. ట్రాన్సాక్షన్ పూర్తయ్యాక సంస్థలు యూజర్లకు మెసేజ్ ద్వారా సమాచారం ఇవ్వాలి.