UPI: యూపీఐ పేమెంట్స్‌ ఇక ఫ్రీ కాదా? మోదీ సర్కార్ కీలక నిర్ణయం

Published : Jul 17, 2026, 01:47 PM IST

UPI MDR Fee: పెద్ద వ్యాపారుల యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ రుసుమును తిరిగి విధించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో యూపీఐ పేమెంట్స్‌ ఇక ఫ్రీ కాదా? అనే చర్చ మొదలైంది. అసలు సంగతేంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
ఉచిత యూపీఐ రోజులు ముగిసినట్లేనా?

మనం రోజువారీ జీవితంలో టీ కొట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతిదానికీ యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించడం సాధారణం అయిపోయింది. జేబులో పర్స్ లేకపోయినా మొబైల్ ఉంటే చాలు అనే స్థాయికి డిజిటల్ పేమెంట్స్ చేరిపోయాయి. అయితే, ఇప్పటివరకు పూర్తి ఉచితంగా సాగిన ఈ సేవలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన మార్పుకు శ్రీకారం చుట్టే ఆలోచనలో ఉంది. పెద్ద మర్చంట్ల లావాదేవీలపై మళ్లీ మర్చంట్ డిస్కౌంట్ రేట్ అంటే కొంత రుసుమును తిరిగి తీసుకురావాలని చూస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే డిజిటల్ చెల్లింపుల రంగంలో ఇదొక పెద్ద సంచలనంగా మారనుంది.

25
ఎవరిపై ఈ ప్రభావం పడబోతోంది?

ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం.. అందరిపైనా ఈ చార్జీల భారం పడదు. కేవలం పెద్ద వ్యాపారులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ ఎండీఆర్ రుసుమును విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సంవత్సరానికి ₹1 కోటి నుంచి ₹1.5 కోట్ల లోపు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న పెద్ద మర్చంట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అది కూడా కేవలం ₹2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలకే ఈ రుసుము వర్తింపజేయాలని చూస్తున్నారు. చిన్న వ్యాపారులు, సామాన్య వినియోగదారులపై ఎలాంటి భారం పడదని, వారు ఎప్పటిలాగే ఉచితంగా యూపీఐ సేవలను వాడుకోవచ్చని ఆర్థిక వర్గాల సమాచారం.

35
అసలు ఈ ఎండీఆర్ గొడవేంటి?

మర్చంట్ డిస్కౌంట్ రేట్ అంటే.. ఒక కస్టమర్ డిజిటల్ పద్ధతిలో పేమెంట్ చేసినప్పుడు, ఆ లావాదేవీని ప్రాసెస్ చేయడానికి, దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను నిర్వహించడానికి బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు అంటే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటివి వ్యాపారి నుంచి వసూలు చేసే రుసుము. దేశంలో డిజిటల్ చెల్లింపులను విపరీతంగా పెంచేందుకు వీలుగా 2020 జనవరి నుంచి యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం ఈ ఎండీఆర్ రుసుమును పూర్తిగా రద్దు చేసింది. దీంతో యూపీఐ వాడకం రాకెట్ వేగంతో పెరిగింది.

45
బ్యాంకుల నుంచి వచ్చిన ఒత్తిడి ఏంటి?

ఎండీఆర్ రద్దు చేయడం వల్ల సామాన్యులకు లాభం చేకూరినప్పటికీ, బ్యాంకులు, పేమెంట్ కంపెనీలపై తీవ్ర ఆర్థిక భారం పడింది. ఉచితంగా కోట్ల కొద్దీ ట్రాన్సాక్షన్లను ప్రాసెస్ చేయడం తమకు నష్టాలను మిగులుస్తోందని వారు చాలా కాలంగా ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు కూడా తమ ఖర్చులకు సరిపోవడం లేదని వాపోయారు.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గణాంకాల ప్రకారం.. ఆర్థిక సంవత్సరం 2017లో కేవలం 2 కోట్లగా ఉన్న వార్షిక యూపీఐ లావాదేవీలు, ఆర్థిక సంవత్సరం 2026 నాటికి ఏకంగా 24,200 కోట్లకు చేరాయి. వీటి మొత్తం విలువ ₹314 లక్షల కోట్లు. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న లావాదేవీల నిర్వహణ ఖర్చులను తట్టుకోవడానికే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది.

55
ప్రభుత్వం ఎంత చార్జ్ చేయాలనుకుంటోంది?

తాజా రిపోర్టుల ప్రకారం, ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. ప్రభుత్వం ఎండీఆర్‌ను 5 నుంచి 7 బేసిస్ పాయింట్లుగా (0.05% నుండి 0.07%) నిర్ణయించే అవకాశం ఉంది. గతంలో పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెద్ద మర్చంట్లపై 0.30% ఎండీఆర్ విధించాలని సిఫార్సు చేసింది. అయితే ప్రభుత్వం మాత్రం వ్యాపారులపై మరీ అంత భారం వేయకుండా తక్కువ శాతాన్నే పరిశీలిస్తోంది.

దేశంలోని దాదాపు 90 శాతం మంది చిన్న వ్యాపారులు చిన్న సంస్థల కేటగిరీ కిందకే వస్తారు కాబట్టి వారికి ఈ చార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. దీనిపై త్వరలోనే ఉన్నత స్థాయిలో చర్చలు జరిపి ప్రభుత్వం అంతిమ నిర్ణయం తీసుకోనుంది.

Read more Photos on
click me!

Recommended Stories