Union Budget : బంగారం ధరలు తగ్గుతాయా? నిర్మలా సీతారామన్ ప్లాన్ ఇదేనా?

Published : Jan 28, 2026, 10:38 PM IST

Union Budget 2026 : బంగారం ధరల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ 2026పై భారీ అంచనాలు ఉన్నాయి. దిగుమతి సుంకం, స్మగ్లింగ్ కట్టడిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తి నెలకొంది.

PREV
16
సీతారామన్ మ్యాజిక్ చేస్తారా? బంగారం ధర దిగివస్తుందా? బడ్జెట్ చెప్పే గుడ్ న్యూస్ ఏంటి?

కేంద్ర బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఆకాశాన్నంటుతున్న బంగారం ధరల నేపథ్యంలో, దిగుమతి సుంకాలపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు వినియోగదారులకు కీలకం కానున్నాయి. 2025లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. సురక్షితమైన పెట్టుబడిగా ఉన్న డిమాండ్, అమెరికా వడ్డీ రేట్ల కోత, బలహీనపడిన డాలర్ కారణంగా 1979 తర్వాత బంగారం రికార్డుల మోత మోగిస్తోంది.

ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో బంగారం దిగుమతి సుంకాలు, ధరల నియంత్రణపై ఎటువంటి ప్రకటనలు ఉంటాయోనని మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. గత ఏడాది ప్రపంచ అనిశ్చితి మధ్య మార్కెట్లు ఊగిసలాడినా, బంగారం మాత్రం రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. 2025లో అంతర్జాతీయంగా బంగారం ధరలు ఏకంగా 67% పెరిగి, డిసెంబర్ 26న ఔన్సు ధర 4,549.7 డాలర్ల గరిష్ఠ స్థాయిని తాకింది.

బుధవారం హైదరాబాద్ లో 10 గ్రాముకు 24 క్యారెట్ల బంగారం ధర ₹1,67,080 గా ఉంది. భారతీయుల వద్ద సుమారు 34,600 టన్నుల బంగారం (విలువ దాదాపు $3.8 ట్రిలియన్లు) ఉందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ఇది అమెరికా, జర్మనీ, చైనా వంటి దేశాల సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం బంగారం కంటే ఎక్కువ కావడం గమనార్హం.

26
కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు.. స్మగ్లింగ్‌కు చెక్ పడుతుందా?

జూలై 2024లో ప్రభుత్వం బంగారంపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని 15% నుండి 6%కి తగ్గించింది. దీనివల్ల మొదట్లో స్మగ్లింగ్ తగ్గినట్లు కనిపించినా, ఇటీవల కాలంలో అది మళ్లీ పెరిగిందని కస్టమ్స్, డిఆర్ఐ (DRI) అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో, ఒక్క కిలో బంగారం స్మగ్లింగ్ చేస్తే దాదాపు రూ.11.5 లక్షల వరకు లాభం వస్తోందని అంచనా. 6% దిగుమతి సుంకం, 3% అమ్మకపు పన్నును ఎగ్గొట్టడం ద్వారా స్మగ్లర్లు భారీగా లాభపడుతున్నారు. ముంబైకి చెందిన ఓ బులియన్ డీలర్ ప్రకారం, స్మగ్లర్లకు ఇది అత్యంత లాభదాయకమైన సమయంగా మారింది. పరిశ్రమ వర్గాల నుండి కస్టమ్స్ డ్యూటీని 3 శాతానికి తగ్గించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

36
బంగారం ధరలపై ప్రభావం, డిమాండ్

బంగారం ధరలు ప్రస్తుతం గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఐసిఆర్ఎ (ICRA) అంచనాల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరంలో ఆభరణాల అమ్మకాల పరిమాణం 20% కంటే ఎక్కువగా తగ్గే అవకాశం ఉంది. జూలై 2024లో 9% సుంకం తగ్గింపు వల్ల దేశీయ ధరలు 5% తగ్గాయి, తద్వారా ఆభరణాల డిమాండ్ పెరిగింది.

కానీ, అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో ఆ ఊరట ఎంతోకాలం నిలవలేదు. దేశీయంగా బంగారం ధరలు 40% పెరిగాయి. సుంకం తగ్గింపులు ధరలను కొద్దిగా తగ్గించినా, అంతర్జాతీయ మార్కెట్ స్థిరపడకపోతే వాటి ప్రభావం స్వల్పకాలికంగానే ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సుంకం తగ్గింపు కంటే అంతర్జాతీయ ధోరణులే బంగారం ధరలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.

46
ఆభరణాల పరిశ్రమ వర్గాల డిమాండ్లు

బంగారం ధరలు ఎక్కువగా ఉండటంతో, పరిశ్రమను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న 6% దిగుమతి సుంకాన్ని సమీక్షించడంతో పాటు, కారీగర్లకు వృత్తిపరమైన శిక్షణ, సాంకేతికత వినియోగం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. అలాగే, బంగారం, వెండి, ప్లాటినం వంటి లోహాలపై దిగుమతి సుంకాన్ని హేతుబద్ధీకరించడం ఈ బడ్జెట్‌లో కీలకమని సూచిస్తున్నారు. తక్కువ సుంకాలు తయారీ ఖర్చులను తగ్గించి, ఎగుమతిదారులకు మేలు చేస్తాయని, అలాగే కస్టమ్స్ క్లియరెన్స్‌లను వేగవంతం చేయాలని అభిప్రాయపడుతున్నారు.

56
బడ్జెట్‌లో సుంకం కోత ఉంటుందా?

పరిశ్రమ డిమాండ్ ఎలా ఉన్నా, 2026 బడ్జెట్‌లో బంగారంపై భారీగా పన్ను తగ్గింపులు ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరెంట్ ఖాతా లోటు ప్రభుత్వానికి సవాలుగా ఉన్నందున, సుంకాలలో పెద్ద మార్పులు చేసే అవకాశం తక్కువని నిపుణులు పేర్కొంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే బంగారం దిగుమతుల పరిమాణం 5% తగ్గినా, పెరిగిన ధరల వల్ల వాటి విలువ 25% పెరిగిందని గుర్తుచేస్తున్నారు.

66
ఇన్వెస్టర్ల ఆశలు: డిజిటల్ గోల్డ్, ఎస్‌జీబీ (SGB)

బంగారం ధరలు రికార్డు స్థాయిలో, తులం రూ.1.67 లక్షల వద్ద ట్రేడ్ అవుతుండటంతో, సామాన్యులు ఆభరణాలు కొనడం కష్టంగా మారింది. దీంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. భౌతిక బంగారం కొనుగోలు చేయడం కంటే గతంలోని సావరీన్ గోల్డ్ బాండ్ల (SGB) వంటి పథకాలు మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఎస్‌జీబీ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా పెట్టుబడిదారులకు మేలు జరుగుతుందని, ఇది భౌతిక బంగారం నిల్వ సమస్యలను తగ్గిస్తుందని అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్ 2026లో డిజిటల్ గోల్డ్‌పై స్పష్టమైన నిబంధనలు రావాలని ఇన్వెస్టర్లు కోరుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories