
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, బడ్జెట్ కంటే ముందే, జనవరి 29న ఆర్థిక మంత్రి ఎకనామిక్ సర్వేను సభ ముందు ఉంచనున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎకనామిక్ సర్వే అనేది అత్యంత కీలకమైన ఎకనామిక్ రిపోర్టు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరును తెలిపే వార్షిక రిపోర్ట్ కార్డ్ లాంటిది. సాధారణంగా ప్రతి సంవత్సరం బడ్జెట్‌కు ఒక రోజు ముందు దీనిని పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఉదాహరణకు, 2025లో ఎకనామిక్ సర్వేను జనవరి 31న ప్రవేశపెట్టగా, బడ్జెట్ ఫిబ్రవరి 1న వచ్చింది. కానీ ఈసారి రెండు రోజుల ముందే సర్వేను ప్రవేశపెడుతుండటం గమనార్హం.
ఈ నేపథ్యంలో ఎకనామిక్ సర్వే అంటే ఏమిటి? దీనిని ఎవరు తయారు చేస్తారు? ఇందులో ఏ అంశాలు ఉంటాయి? సామాన్యులకు ఇది ఎందుకు ముఖ్యం అనే విషయాలు గమనిస్తే..
ఎకనామిక్ సర్వే ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు ఎలా ఉందో పూర్తి చిత్రాన్ని ఆవిష్కరిస్తారు. కేవలం గత గణాంకాలే కాకుండా, రాబోయే సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక అంచనాలు, తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇందులో ఉంటాయి. అయితే, ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన సూచనలను పాటించాలా వద్దా అనేది పూర్తిగా ప్రభుత్వం ఇష్టం. ఈ సూచనలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ, దేశంలో విధాన రూపకల్పనలో ఎకనామిక్ సర్వే చాలా కీలక పాత్ర పోషిస్తుంది.
దీని చరిత్రను గమనిస్తే, భారతదేశంలో మొట్టమొదటి ఎకనామిక్ సర్వేను 1950-51లో కేంద్ర బడ్జెట్‌తో పాటే ప్రవేశపెట్టారు. 1964 వరకు ఇదే పద్ధతి కొనసాగింది. ఆ తర్వాత, 1964 నుండి దీనిని బడ్జెట్ నుండి వేరు చేశారు. అప్పటి నుండి బడ్జెట్ సమావేశాలకు ముందే దీనిని ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. దీనిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఎకనామిక్ డివిజన్ రూపొందిస్తుంది.
ఎకనామిక్ సర్వే తయారీ బాధ్యతను ప్రధాన ఆర్థిక సలహాదారు పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం భారతదేశ ప్రధాన ఆర్థిక సలహాదారుగా వి. అనంత నాగేశ్వరన్ ఈ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని బృందం ఈ కీలక పత్రాన్ని రూపొందిస్తుంది. ఈ సర్వే హిందీ, ఇంగ్లీష్ రెండు భాషలలోనూ అందుబాటులో ఉంటుంది.
సుమారు 300 నుండి 400 పేజీల వరకు ఉండే ఈ సమగ్ర పత్రం కేవలం అక్షరాలతోనే కాకుండా.. అనేక రకాల చార్ట్‌లు, గ్రాఫ్‌లు, గణాంక డేటాతో నిండి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలోని సంక్లిష్టమైన అంశాలను అర్థం చేసుకోవడానికి ఈ గ్రాఫ్‌లు సహాయపడతాయి.
ఎకనామిక్ సర్వే అనేది ఒక్కరోజులో తయారయ్యే రిపోర్టు కాదు. దీని తయారీ ప్రక్రియ ఏడాది పొడవునా కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ విభాగాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO), సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) వంటి సంస్థల నుండి డేటాను సేకరిస్తారు.
ప్రధాన ఆర్థిక సలహాదారు, వారి బృందం ఈ డేటాను నిశితంగా విశ్లేషిస్తుంది. గత ఒక సంవత్సరంలో దేశం సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, అంతర్జాతీయ పరిణామాల ప్రభావం, భారతదేశ ఆర్థిక బలాలు వంటి అంశాలపై ఈ విశ్లేషణ కేంద్రీకృతమై ఉంటుంది. సాధారణంగా సర్వే రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో ఆర్థిక వ్యవస్థ సమగ్ర స్వరూపం ఉంటే, రెండవ భాగంలో సెక్టార్ల వారీగా లోతైన విశ్లేషణ ఉంటుంది.
ఎకనామిక్ సర్వేలో దేశ స్థూల దేశీయ ఉత్పత్తి (GDP), వృద్ధి రేటు ప్రధాన అంశాలుగా ఉంటాయి. ఇందులో వాస్తవ జీడీపీ వృద్ధి, వివిధ రంగాల వారీగా వృద్ధి వివరాలు ఉంటాయి. కేవలం వృద్ధి మాత్రమే కాకుండా, ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణం గురించిన చర్చ కూడా ఇందులో ఉంటుంది.
దేశంలో ఉపాధి అవకాశాలు, లేబర్ మార్కెట్ పరిస్థితులను కూడా సర్వే ప్రస్తావిస్తుంది. వ్యవసాయం, తయారీ రంగం, సేవలు, మౌలిక సదుపాయాలు, బ్యాంకింగ్, డిజిటల్ ఎకానమీ వంటి వివిధ రంగాల పనితీరుపై చర్చ ఉంటుంది. అంతేకాకుండా, ఆర్థిక సంస్కరణలు, వికసిత్ భారత్ @ 2047 లక్ష్యానికి సంబంధించిన రోడ్‌మ్యాప్ కూడా ఇందులో ఉంటుంది.
బడ్జెట్‌కు ముందు వచ్చే ఎకనామిక్ సర్వే, ప్రభుత్వానికి గత ఏడాదిలోని లోపాలను, బలాలను తెలియజేస్తుంది. బడ్జెట్‌లో ప్రకటించే అనేక పథకాలు, నిర్ణయాలు సర్వేలో ఇచ్చిన సూచనలపై ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వం, ఆర్బీఐ, పెట్టుబడిదారులు, కంపెనీలు, ఆర్థికవేత్తలు తమ భవిష్యత్ నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సర్వేను ఒక ప్రామాణికంగా తీసుకుంటారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా దీనిని నిశితంగా గమనిస్తాయి. ఇది భారతదేశ క్రెడిట్ రేటింగ్, పెట్టుబడుల ఆకర్షణపై ప్రభావం చూపుతుంది.
సామాన్యుల విషయానికి వస్తే.. ఎకనామిక్ సర్వే కేవలం అంకెల గారడీ కాదు. ఇది మన జేబుపై పడే ప్రభావాన్ని సూచిస్తుంది.
• ఉదాహరణకు, గ్రామీణ డిమాండ్ బలంగా ఉందని సర్వే చెబితే, ఎఫ్‌ఎంసిజి (FMCG) కంపెనీలు మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది.
• ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉందని సర్వే తేల్చితే, రాబోయే రోజుల్లో ఆర్బీఐ రెపో రేటును పెంచవచ్చు. దీనివల్ల రుణాలు ఖరీదైనవిగా మారతాయి.
• ఉపాధి గణాంకాలు మెరుగ్గా ఉంటే, రాబోయే రోజుల్లో ఉద్యోగాలు సులభంగా దొరికే అవకాశం ఉందని అర్థం చేసుకోవచ్చు.