ప్రస్తుతం చాలా మంది మైండ్ సెట్ మారుతోంది. డబ్బులు పొదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం SIPల ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి ద్వారా అధిక లాభాలు వస్తాయని ఆలోచిస్తున్నారు. అయితే ఇందులో ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. అయితే ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ పొందే ఒక మంచి పథకం అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్ అందిస్తోన్న ఈ పథకంతో కోటీ రూపాయాలు సేవ్ చేయొచ్చు.
పోస్టాఫీస్ అందిస్తోన్న సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఇది సాధ్యమే. ఈ పథకంలో నెలకు రూ. 12,500 డిపాజిట్ చేస్తూ వెళ్తే.. 21 సంవత్సరాల తర్వాత 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు. ఈ పథకం వడ్డీ రేటు, డిపాజిట్ వ్యవధితో పాటు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వడ్డీ రేటు 8.0% (2024-25 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికానికి)
వ్యవధి: 15 సంవత్సరాల వరకు డిపాజిట్లు మరియు 21 సంవత్సరాల వరకు పథకం మెచ్యూరిటీ ఉంటుంది.
ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల భవిష్యత్తు కోసం తీసుకొచ్చింది.
రూ. కోటి ఎలా పొందాలంటే..
సుకన్య సమృద్ధి యోజనలో రూ. కోటి పొందాలంటే మీరు ప్రతీ నెలా నిర్దిష్ట మొత్తాన్ని డిపాజిట్ చేస్తూ ఉండాలి. సుకన్య సమృద్ధి యోజనలో ప్రస్తుత వడ్డీ రేటు 8%గా ఉంది. ఇలా మీరు 15 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే, మీరు ప్రతి నెలా దాదాపు రూ. 12,500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
మీరు 15 సంవత్సరాల పాటు నిరంతరం డబ్బును డిపాజిట్ చేస్తే, మీ మొత్తం 12,500 x 12 x 15 = రూ. 22,50,000 అవుతుంది. ఇలా వరుసగా 15 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 12,500 డిపాజిట్ చేయడం ద్వారా మీ కుమార్తెకు 21 ఏళ్లు వచ్చే సమయానికి రూ. కోటి అవుతుంది.
మరికొన్ని విషయాలు..
వడ్డీ రేట్లు కాలానుగుణంగా మార్పులకు లోబడి ఉంటాయి. ఇది మొత్తంలో స్వల్ప వ్యత్యాసాలకు దారితీయవచ్చు. పథకం నిబంధనల ప్రకారం, గరిష్ట వార్షిక పెట్టుబడి పరిమితిని రూ. 1,50,000గా నిర్ణయించారు.
సుకన్య సమృద్ధి యోజన ప్రయోజనాలు..
సుకన్య సమృద్ధి యోజన సహాయంతో, మీరు దీర్ఘకాలిక పెట్టుబడులలో చక్రవడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు, దీని వల్ల మీ చిన్న నెలవారీ పొదుపు పెద్ద మొత్తంగా మారుతుంది. ఈ పథకాన్ని కుమార్తె చదువుకు పెళ్లి ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు.