
2026లో భారతీయ స్టాక్ మార్కెట్ పనితీరు అత్యంత బలంగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న సానుకూల పరిస్థితులు, బలమైన దేశీయ డిమాండ్, సానుకూల వర్షపాతం కారణంగా మార్కెట్ పుంజుకుంటుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ తాజాగా విడుదల చేసిన రిపోర్టు ప్రకారం, 2026లో భారత స్టాక్ మార్కెట్ స్థితిగతులు పెట్టుబడిదారులకు ఆశాజనకంగా ఉండనున్నాయి.
బజాజ్ ఫిన్‌సర్వ్ రిపోర్టు ప్రకారం, 2026లో మార్కెట్ దూకుడుకు అనేక కీలక అంశాలు దోహదపడనున్నాయి. ముఖ్యంగా దేశీయ డిమాండ్ బలంగా ఉండటం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, మంచి పంటల దిగుబడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయనున్నాయి. అంతేకాకుండా, బంగారం ధరలు పెరగడం వల్ల ప్రజల సంపద విలువ పెరిగి, అది వినియోగానికి దారితీస్తుందని రిపోర్టు పేర్కొంది. అంటే బంగారం రేట్లు పెరిగినప్పుడు, ప్రజల వద్ద ఉన్న ఆ బంగారం విలువ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది
మరోవైపు, ప్రభుత్వం తీసుకునే పన్ను సంబంధిత నిర్ణయాలు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అవలంబించే సరళీకృత వడ్డీ రేట్ల విధానాలు కార్పొరేట్ కంపెనీల ఆదాయాలను మెరుగుపరుస్తాయని అంచనా. ఈ పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థలో క్రమంగా, కానీ బలమైన రికవరీని తీసుకువస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ అంశాలన్నీ కలిసి 2026లో సెన్సెక్స్, నిఫ్టీల జోరును పెంచే అవకాశం ఉంది.
రాబోయే కాలంలో ఏయే రంగాలు మంచి పనితీరును కనబరుస్తాయనే విషయంపై కూడా ఈ రిపోర్టు స్పష్టత ఇచ్చింది. దేశీయ మార్కెట్‌తో ప్రత్యక్ష సంబంధం ఉన్న రంగాలు, ముఖ్యంగా ఆటోమొబైల్, వినియోగం ఆధారిత పరిశ్రమలు గణనీయమైన వృద్ధిని సాధించే అవకాశం ఉంది.
అంతర్జాతీయ వాణిజ్యంలో పన్నులు, టారిఫ్‌ల విషయంలో నెలకొన్న అనిశ్చితి తగ్గుముఖం పట్టడం, రూపాయి విలువ స్థిరంగా ఉండటం వంటి కారణాల వల్ల ఎగుమతుల రంగం కూడా పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఎగుమతి ఆధారిత రంగాలు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, 2026లో మెరుగైన ఫలితాలను సాధించవచ్చని రిపోర్టు విశ్లేషించింది.
గడిచిన 2025 సంవత్సరం మార్కెట్‌కు మిశ్రమ ఫలితాలను అందించింది. గ్లోబల్ ట్రేడ్ టారిఫ్‌లలో మార్పులు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడిదారులు (FIIs) తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం వంటి కారణాల వల్ల మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. అయినప్పటికీ, బలమైన దేశీయ ఆర్థిక పరిస్థితుల కారణంగా భారతీయ మార్కెట్ నిలదొక్కుకోగలిగింది.
ముఖ్యంగా లార్జ్-క్యాప్ షేర్లు మార్కెట్‌కు స్థిరత్వాన్ని అందించాయి. ఇదే సమయంలో మిడ్-క్యాప్ షేర్లు సుమారు 5 శాతం రిటర్న్స్ ఇవ్వగా, స్మాల్-క్యాప్ షేర్లు మాత్రం నిరాశపరిచాయి. స్మాల్-క్యాప్ ఇండెక్స్ దాదాపు 8 శాతం మేర పతనమైంది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బలమైన బ్యాలెన్స్ షీట్లు, నమ్మకమైన ఆదాయ వనరులు ఉన్న కంపెనీల వైపు మొగ్గు చూపారు.
2025 సెప్టెంబర్ తర్వాత మార్కెట్‌లో జరిగిన పరిణామాలను గమనిస్తే, ప్రతి రెండు మూడు నెలలకు ఒక్కో సెక్టార్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా ఆటో సెక్టార్ సుమారు 21.7 శాతం వృద్ధితో టాప్ లో నిలిచింది. పన్ను రాయితీలు, సుంకాల తగ్గింపు, పండుగ సీజన్ డిమాండ్ కారణంగా కన్సంప్షన్ సెక్టార్ కూడా లాభపడింది.
అయితే, ఎగుమతి ఆధారిత రంగాలు మాత్రం వెనుకబడిపోయాయి. ఐటీ సర్వీసెస్ సెక్టార్‌పై టారిఫ్ అనిశ్చితి ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇతర అంతర్జాతీయ కారణాల వల్ల ఐటీ రంగం సుమారు 13.7 శాతం మేర నష్టపోయింది. 2026లో ఈ పరిస్థితులు మారి, ఎగుమతులు పుంజుకుంటాయని ఆశించవచ్చు.
రిపోర్టుల ప్రకారం, 2025లో నిఫ్టీ 50 సూచీ దాదాపు 9 శాతం రిటర్న్స్ అందించింది. అయితే ఏడాది పొడవునా మార్కెట్‌లో భయం, ఆందోళనలు కొనసాగాయి. మార్కెట్ రిస్క్‌ను సూచించే ఇండియా విక్స్ (India VIX) జనవరి నుంచి మే మధ్య కాలంలో ఆరుసార్లు 20 పాయింట్ల మార్కును దాటింది. ఏప్రిల్‌లో ఇది గరిష్ఠంగా 22.79 స్థాయికి చేరుకోవడం గమనార్హం.
మరోవైపు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ విడుదల చేసిన తాజా రిపోర్టులో కూడా ఇదే రకమైన సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేసింది. భారత ఆర్థిక వ్యవస్థలో మెరుగుదల, కంపెనీల ఆదాయాలు పెరిగే అవకాశం, విదేశీ పెట్టుబడిదారుల (FIIs) పునరాగమనం వంటి అంశాలు 2026 నాటికి షేర్ మార్కెట్‌ను మరింత బలోపేతం చేస్తాయని ఆ రిపోర్టు పేర్కొంది. మొత్తంమీద, 2026 భారతీయ ఈక్విటీ మార్కెట్‌కు ఒక బలమైన సంవత్సరంగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.