మార్కె ట్లో బంగారం కొనుగోలు విషయంలో స్తబ్దత నెలకొంది. నాలుగైదు రోజులుగా వరుసగా ధర తగ్గుతోంది. అయినా ఇప్పటికీ ఆల్ టైం రికార్డు ధరకి దగ్గర్లోనే ఉంది. ఏప్రిల్ 14వ తేదీ నాటికి 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 95,660 పలుకుతోంది. 22క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరరూ. 87,690. ఒక కిలో వెండి ధరరూ. 1,01,900 ఉంది.
కొద్దిరోజులతో పోల్చి చూస్తే ధరలు దాదాపు వెయ్యి రూపాయలకు పైగానే తగ్గింది. అయితే పెరిగినదానితో పోలిస్తే ఇది మరీ ఎక్కువేం కాదు. ధర ఇప్పటికీ ఆల్ టైం కి దగ్గర్లోనే ఉంది. రెండు వారాల్లో పసిడి ధరలు రూ.10వేలకు పైగా పెరిగిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులే బంగారం ధర అత్యంత వేగంగా పెరగడానికి కారణం. ప్రస్తుత అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర 3200 డాలర్లపైనే ఉంది. బంగారం ధర భారీగా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా మార్కెట్లో డాలర్ బలం క్షీణించడం ఒక కారణమని చెప్పవచ్చు.
ఇతర ప్రధాన కరెన్సీలతో పోల్చి చూస్తే డాలర్ విలువ తగ్గుతుండటంతో పెట్టుబడిదారులు బంగారం వైపు చూస్తున్నారు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలించేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అమెరికా-చైనా టారిఫ్ వార్ ఇంకా ముదిరే ప్రమాదం ఉండటంతో ప్రపంచ మార్కెట్లు పడుతున్నాయి. దాంతో సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకొని జనం అందులో పెట్టుబడి పెడుతున్నారు.
భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా, లేదా పెరుగుతాయా అనే ప్రశ్నకు ఎవరి దగ్గరా కచ్చితమైన సమాధానం లేదు. అంతర్జాతీయ ట్రేడ్ వార్ ఇంకా ముదిరితే మాత్రం పసిడి ధర మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆ పరిస్థితులు ఏమాాత్రం తెరిపినిచ్చినా భారీగా పడే అవకాశం ఉంది. మార్నింగ్ స్టార్ అనే అమెరికన్ సంస్థ అంచనాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాలపై వేసిన సుంకాలను 90 రోజుల పాటు వాయిదా వేయడంతో ట్రేడ్ వార్ తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ పరిస్థతి ఇలాగే కొనసాగితే గోల్డ్ ధర ఆల్ టైం హై నుంచి 40శాతం క్షీణిస్తుందని ఆ సంస్థ చెబుతోంది. ఈ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు ప్లాన్ చేసుకోవచ్చు.