నిన్న దేశరాజధాని దిల్లీ సహా ఇతర అన్ని నగరాల్లో బంగారం ధర చుక్కలు తాకింది. పది గ్రాముల 24 క్యారెట్ ధర ఏకంగా రూ.1,650రూపాయలు పెరిగి, రూ.98,100 గా నమోదైంది. మన హైదరాబాద్లో మాత్రం కాస్త తక్కువగా రూ.97,700 ధర పలికింది.
ఇంకోవైపు వెండి సైతం పసిడితో పోటీ పడుతోంది. ఒక్కరోజులోనే రూ.1,900 పెరిగింది. ఇప్పుడు కేజీ వెండి ధర రూ.99,400. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు ధర 3,318 గరిష్ఠం నమోదైంది. ఈ జోరు చూస్తే బంగారం కంటే ముందే వెండినే రూ.లక్ష మార్కును దాటేలా ఉంది.
అమెరికా, చైనాల మధ్య ఇంకా వార్ టారిఫ్ ఘర్షణ ముదిరేలా కనిపిస్తుండటం, స్టాక్ మార్కెట్లలో భారీ క్షీణత, డాలర్ ఇండెక్స్ సన్నగిల్లుతుండటం, అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న సంకేతాలు.. వెరసి పసిడి పరుగు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే నేడో, రేపో.. బంగారం రూ.లక్ష రూపాయలు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం కొనుక్కోవాలనుకుంటున్న సామాన్యులకు బంగారం అందనంత ధరలో ఉంటూ చుక్కలు చూపిస్తోంది.