సంపాదించిన మొత్తంలో ఎంతో కొంత సేవ్ చేయాలని ప్రతీ ఒక్కరూ ఆలోచిస్తారు. కొందరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మరికొందరు చిట్టీలు వేస్తారు. అయితే వీటిలో ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. అయితే ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ పొందేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. పోస్టాఫీస్‌లో అందిస్తున్న బెస్ట్ స్కీమ్స్‌లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి.
ఇందులో నచ్చినంత పొదుపు చేసుకోవచ్చు. నెల నెలా పొదుపు చేస్తూ వెళ్లొచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఐదేళ్ల మెచ్యూరిటీ తర్వాత మీరు పెట్టుబడిగా పెట్టిన దాంతో పాటు వడ్డీ కలిపి వస్తుంది. అయితే ఈ పథకాన్ని మరో ఐదేళ్లు కూడా పెంచుకోవచ్చు. అంటే మొత్తం 10 ఏళ్ల వరకు ఇందులో పెట్టుబడి పెడుతూ వెళ్లొచ్చు.
రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో రూ. 100 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్టంగా ఎంతైనా సేవింగ్ చేసుకోచ్చు. ఒక ఏడాది పాటు పెట్టుబడి పెడితే ఆ తర్వాత పెట్టుబడి పెట్టిన మొత్తంలో 50 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. అయితే ఇందుకు 8.5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు నెలకు రూ. 5 వేలు పొదుపు చేస్తూ వెళితే పదేళ్లకు మీ చేతికి ఎంత వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతీ నెల రూ. 5 వేలు పొదుపు చేస్తే.. ఐదేళ్లలో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం రూ. 3 లక్షలు అవుతుంది. దీనికి వడ్డీ రూపంలో రూ. 56,830 జమ చేస్తారు. ఇలా మొత్తం రూ. 3,56,830 అవుతుంది. అయితే మరో ఐదేళ్లు పొడగిస్తే 10 ఏళ్లకు అసలు రూ. 6 లక్షలు అవుతుంది. వడ్డీతో కలుపుకుంటే పదేళ్లలో రూ. 8.5 లక్షలు చేతికి వస్తాయి. ఇలా నెలకు కేవలం రూ. 5 వేలు పొదుపు చేస్తూ రూ. 8.5 లక్షలు పొందొచ్చన్నమాట.
మరిన్ని లాభాలు
మీ డబ్బుకు భద్రతతో పాటు నమ్మకమైన రిటర్న్స్ మాత్రమే కాకుండా ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో మరో లాభం కూడా ఉంది. అదే వడ్డీపై టీడీఎస్. ఐటీఆర్ క్లెయిమ్ చేసిన తర్వాత ఆదాయం ప్రకారం తిరిగి చెల్లిస్తారు. ఆర్డీపై వచ్చే వడ్డీపై 10 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. RD పై వడ్డీ రూ. 10 వేల కంటే ఎక్కువ ఉంటే.. TDS తీసి వేస్తారు.