Recharge Plans: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు కీలక మార్పు చేసింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్‌లలో కొన్నింటిని తొలగించింది. ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్ లో ఈ ప్లాన్ కనిపించడం లేదు.
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కేటగిరీలో రూ.299 ప్లాన్ చాలాకాలంగా వినియోగదారులకు అందుబాటులో ఉంది. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్యాక్‌లో రోజుకు 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభించేవి. వీటితోపాటు ఫ్రీ హెలో ట్యూన్స్, పెర్‌ప్లెక్సిటీ ప్రో ఏఐ సబ్‌స్క్రిప్షన్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉండేవి. అయితే తాజాగా ఈ ప్యాక్‌ను ఎయిర్‌టెల్ జాబితా నుంచి తొలగించింది. దీంతో రూ. 300లోపు నెలవారీ రీఛార్జ్ కోసం చూసే కస్టమర్లకు ఉన్న ఒక ముఖ్యమైన ఆప్షన్ లేకుండా పోయింది.
24
రూ.349 ప్లాన్ వైపు కస్టమర్లు
రూ.299 ప్లాన్ స్థానంలో ప్రస్తుతం రూ.349 రీఛార్జ్ ప్యాక్ ప్రధాన ఆప్షన్‌గా మారింది. ఈ ప్లాన్ కూడా 28 రోజుల పాటు కొనసాగుతుంది. అయితే రూ.299 ప్యాక్‌తో పోలిస్తే ఇందులో డేటా ప్రయోజనం ఎక్కువగా ఉంది. రోజుకు 2జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు అందుతాయి. అదనంగా ఆరు నెలల యాపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, ఉచిత హెలో ట్యూన్స్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అంటే రూ.50 అదనంగా చెల్లిస్తే డేటా ప్రయోజనం రెట్టింపు అవుతుంది. అయితే డేటా అవసరం తక్కువగా ఉన్న వారికి ఈ అదనపు ఖర్చు భారంగా అనిపించే అవకాశం ఉంది.
34
రూ.579, రూ.619 ప్యాక్‌లు కూడా..
రూ.299 ప్లాన్‌తో పాటు మరో రెండు రీఛార్జ్ ప్యాక్‌లను కూడా ఎయిర్‌టెల్ తొలగించినట్లు తెలుస్తోంది. రూ.579 ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5జీబీ డేటాను అందించేది. మరోవైపు రూ.619 ప్యాక్ 60 రోజుల వ్యాలిడిటీతో అదే రోజువారీ 1.5జీబీ డేటా ప్రయోజనాన్ని అందించేది. ఈ రెండు ప్లాన్‌లు కూడా ప్రస్తుతం ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు. తొలుత కొన్ని టెలికాం సర్కిళ్లలో పరిమితమైన ఈ మార్పు.. ఇప్పుడు ఇతర ప్రాంతాలకూ విస్తరించినట్లు సమాచారం.
రూ.299 ప్లాన్ తొలగిపోయినప్పటికీ ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఇతర ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ డేటాతో కాలింగ్ అవసరమయ్యే వారికి రూ.219 ప్యాక్ అందుబాటులో ఉంది. 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో మొత్తం 3జీబీ డేటా పొందవచ్చు. మరోవైపు తరచూ రీఛార్జ్ చేసుకోవడం ఇష్టం లేని వారికి ఏడాది వ్యాలిడిటీతో రూ.2,249 ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో 365 రోజుల వ్యాలిడిటీ, మొత్తం 30జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ప్లాన్‌ల లభ్యత సర్కిల్‌ను బట్టి మారే అవకాశం ఉండటంతో రీఛార్జ్ చేసే ముందు ఎయిర్‌టెల్ అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్‌లో తాజా వివరాలను పరిశీలించడం మంచిది.