Real estate: భారత రియల్ ఎస్టేట్ రంగంలో వింత పరిస్థితి నెలకొంది. మధ్యతరగతి ప్రజలు ఇళ్లు కొనలేకపోతుండగా, డెవలపర్లు మాత్రం లగ్జరీ టవర్లను నిర్మిస్తున్నారు. అసలు సమస్య ఎక్కడుంది.? నిపుణులు ఏం చెబుతున్నారంటే.?
2020 నుండి 2025 మధ్య భారత్‌లో ఇళ్ల ధరలు ప్రతి ఏడాది సగటున 10 శాతం పెరిగాయి. కానీ అదే సమయంలో ఉద్యోగుల జీతాలు కేవలం 5 శాతం మాత్రమే పెరిగాయని గణంకాలు చెబుతున్నాయి. ఈ అసమాన పెరుగుదలతో సాధారణ కుటుంబాలకు ఇల్లు కొనడం దాదాపు అసాధ్యంగా మారింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఒక సాధారణ ఫ్లాట్ కొనాలంటే ఇప్పుడు ఒక వ్యక్తి తన ఆదాయం మొత్తం 15 సంవత్సరాల పాటు వెచ్చించాల్సి వస్తోంది. ఇక మరింత తక్కువ ఆదాయం ఉన్న వారిలో ఇది ఏకంగా 100 ఏళ్లు పట్టొచ్చని అంచనా వేస్తున్నారు.
25
అదృశ్యమవుతోన్న అందుబాటు ధరలో ఇల్లు
ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో చవక ఇళ్లు దొరకడం దాదాపు అసాధ్యంగా మారింది. హైదరాబాద్‌లో చవక ఇళ్ల లభ్యత 70% తగ్గింది. ముంబైలో 60% తగ్గింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే 50 శాతం తగ్గింది. దీని అర్థం బిల్డర్లు మధ్యతరగతి కోసం కాకుండా కేవలం ధనికుల కోసమే ఇల్ల నిర్మాణం చేపడుతున్నట్లు స్పష్టమవుతోంది.
35
లగ్జరీ టవర్లదే హవా
ప్రస్తుతం మార్కెట్లో కొత్తగా అమ్ముడవుతోన్న ఇళ్లలో 62 శాతం కోటి రూపాయలకు పైగా ఉన్నవే కావడం గమనార్హం. ఇవి సాధారణ ఉద్యోగులు లేదా మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా మారుతోంది. బిల్డర్లు అల్ట్రా ప్రీమియం, సిగ్నేచర్ రెసిడెన్స్ వంటి పేర్లతో హై ఎండ్ ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెడుతున్నారు.
ఈ లగ్జరీ ఫ్లాట్లు ప్రధానంగా NRIలు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, భారత్‌లో నివసిస్తున్న మిలియనీర్లు కొనుగోలు చేస్తున్నారు. 2024లో భారత రియల్ ఎస్టేట్‌లో $8.9 బిలియన్ల పెట్టుబడులు వస్తే వీటిలో 63 శాతం విదేశీ పెట్టుబడిదారులే కావడం గమనార్హం.
55
అమ్మకాలు తగ్గినా, ధరలు మాత్రం..
2024లో అమ్మకాల సంఖ్య 20–25% తగ్గినా, ఇళ్ల ధరల్లో పెద్దగా తగ్గుదల లేదు. ఎందుకంటే ఈ ఇళ్లు కొనేవారు ధనవంతులు.. వీరు ఇళ్లను త్వరగా అమ్మేయాల్సిన అవసరం లేదు. దీంతో మార్కెట్‌లో క్రయవిక్రయాల్లో స్థిరత్వం ఏర్పడింది. కానీ చవక ఇళ్ల కొరత పెరిగిపోతోంది. ఇది భవిష్యత్తులో పట్టణాల్లో గృహ సంక్షోభానికి దారితీయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.