భారతదేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి 2016లో అప్పటి వరకు చెలామణిలో ఉన్న 1000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పెద్ద నోట్ల రద్దు సమయంలోనే దేశంలో కొత్తగా 2,000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2,000 రూపాయల నోట్లు చెలామణిలో ఉండగా 2018-19 సంవత్సరాల్లో రూ.2,000 నోట్ల ముద్రణను రిజర్వ్ బ్యాంక్ నిలిపివేసింది. నల్ల ధనానికి అడ్డుకట్ట వేయలేకపోవడంతో 2000 నోట్లను కూడా వెనక్కు తీసుకోవాలని కేంద్రం భావించింది.
రూ.2,000 నోట్ల ఉపసంహరణ
దీని తర్వాత 2023 మే 19 నుండి రూ.2,000 నోటును ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఆ తర్వాత ఈ నోట్లను ప్రజల నుండి ఉపసంహరించుకునే ప్రక్రియ కొనసాగుతోంది. అంటే ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లను బ్యాంక్ ఖాతాలో జమ చేయడం లేదా బ్యాంకుల్లో మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ సూచించింది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు బ్యాంకులకు క్యూలు కట్టి మరీ 2000 నోట్లను మార్చుకున్నారు.
ఎంత ఉపసంహరించారు?
దీని ప్రకారం ప్రజలు తమ వద్ద ఉన్న 2,000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో జమ చేశారు. అయితే పూర్తి స్థాయిలో వెనక్కు రాలేదు. అందుకే ప్రజల నుండి ఎన్ని 2000 రూపాయల నోట్లు వెనక్కు వచ్చాయి? ఇంకా ఎన్ని నోట్లు చెలామణిలో ఉన్నాయి? ఇలాంటి సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు ప్రకటనల ద్వారా తెలియజేస్తూనే ఉంది.
2024 డిసెంబర్ 21 నాటికి 98.12 శాతం 2,000 రూపాయల నోట్లు ఉపసంహరించినట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇంకా రూ.6691 కోట్ల విలువైన 2,000 రూపాయల నోట్లు ప్రజల వద్ద ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మిగిలిన 2,000 రూపాయల నోట్లను కూడా ప్రజల నుండి పూర్తిగా వెనక్కు తీసుకుంటామని తెలిపింది.
ఎలా జమ చేయాలి?
మీ దగ్గర కూడా ఇంకా రూ.2,000 నోట్లు ఉన్నట్లయితే వాటిని అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం నగరాల్లోని RBI కార్యాలయాల్లో జమ చేయవచ్చని RBI తెలిపింది.
అంతేకాకుండా మీ సమీపంలోని ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి RBI అకౌంట్ లో జమ చేయవచ్చని అధికారులు ప్రకటించారు. భారతదేశంలోని ఏదైనా పోస్ట్ ఆఫీస్ నుండి RBI కార్యాలయాలకు పోస్ట్ ద్వారా రూ.2,000 నోట్లను పంపవచ్చని కూడా తెలియజేసింది.
ఇది కూడా చదవండి:
https://telugu.asianetnews.com/gallery/business/rbi-clarifies-rumors-about-new-5000-rupee-note-in-india-sns-speqzc