
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) టెర్మినల్స్ ద్వారా నగదు విత్‌డ్రా చేసే నిబంధనలన్నింటినీ ఒకే మాస్టర్ డైరెక్షన్‌లోకి తీసుకొచ్చింది. 2008 నుంచి 2022 మధ్య జారీ చేసిన 17 పాత సర్క్యులర్లను ఆర్బీఐ రద్దు చేసింది. ఈ కొత్త ఆదేశాలు తక్షణమే అమలులోకి వచ్చాయి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, అధీకృత పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు, సిస్టమ్ పార్టిసిపెంట్స్ అందరికీ ఈ రూల్స్ వర్తిస్తాయి.
నెలలో మీరు ఇప్పటివరకు ఎన్ని ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్లు వాడారో బ్యాంకులు కచ్చితంగా అలర్ట్ చేయాలి. ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత చేసే ట్రాన్సాక్షన్లపై ఎంత ఛార్జీ పడుతుందో కూడా కస్టమర్లకు ముందే చెప్పాలని ఆర్బీఐ ఆదేశించింది. "నెలలో కస్టమర్ ఇప్పటికే వాడుకున్న ఉచిత ట్రాన్సాక్షన్ల సంఖ్య గురించి, ఆ తర్వాత చేసే లావాదేవీలపై పడే ఛార్జీల గురించి కస్టమర్లను హెచ్చరించే లేదా సమాచారం ఇచ్చే వ్యవస్థను బ్యాంకులు ఏర్పాటు చేయాలి" అని ఆర్బీఐ స్పష్టం చేసింది.
అలాగే ఒక ఏటీఎం మెట్రో ప్రాంతంలో ఉందా లేదా నాన్ మెట్రో ప్రాంతంలో ఉందా అనేది స్క్రీన్ మెసేజ్, స్టిక్కర్ లేదా పోస్టర్ ద్వారా స్పష్టంగా చూపించాలి. వివాదాలు రాకుండా ఉండటానికి బ్యాంకులు తమ డేటాబేస్‌లో ఏటీఎం లొకేషన్ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచాలి.
ప్రస్తుతం ఉన్న ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్ లిమిట్లలో ఎలాంటి మార్పు లేదు. సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు తమ సొంత బ్యాంక్ ఏటీఎంలలో నెలకు 5 ఫ్రీ ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. ఇందులో ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు రెండూ ఉంటాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అయితే మెట్రో నగరాల్లో 3, నాన్ మెట్రో ప్రాంతాల్లో 5 ఫ్రీ ట్రాన్సాక్షన్లు లభిస్తాయి.
ఈ రెండు కేటగిరీలను కలిపి వాడినా మొత్తం ఫ్రీ లిమిట్ 5 దాటకూడదు. బ్యాంకులు తమ ఇష్టానుసారం ఎక్కువ ఫ్రీ ట్రాన్సాక్షన్లు కూడా ఇవ్వొచ్చు. లిమిట్ దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్‌కు గరిష్ఠంగా రూ. 23, దానికి అదనంగా వర్తించే పన్నులు మాత్రమే వసూలు చేయాలి. ఈ ఛార్జీల కోసం బ్యాంకులు బోర్డు ఆమోదించిన పాలసీని రూపొందించుకోవాలి.
టెక్నికల్ సమస్యల వల్ల ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే దాన్ని వ్యాలిడ్ ట్రాన్సాక్షన్‌గా లెక్కించరు. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, కమ్యూనికేషన్ లోపాలు లేదా ఏటీఎంలో క్యాష్ లేకపోవడం వల్ల ఫెయిల్ అయినా ఫ్రీ లిమిట్ కట్ అవ్వదు. బ్యాంక్ లేదా సర్వీస్ ప్రొవైడర్ వల్ల జరిగే డిక్లైన్లు, తప్పుడు పిన్, వ్యాలిడేషన్ సమస్యలను కూడా ఇందులో నుంచి మినహాయించారు. కాబట్టి, వాటిపై ఎలాంటి ఛార్జీలు విధించకూడదు అని ఆదేశాల్లో పేర్కొన్నారు. గరిష్ఠ నగదు విత్‌డ్రా లిమిట్, ఫ్రీ ట్రాన్సాక్షన్లు, ఛార్జీల వివరాలను ఏటీఎంల వద్ద ఇంగ్లీష్, హిందీ, స్థానిక భాషలో ప్రదర్శించాలి.
పీఓఎస్ టెర్మినల్స్ వద్ద డెబిట్ కార్డులు, ఫుల్ కేవైసీ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్, యూపీఐ ద్వారా నగదు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును ఈ కొత్త రూల్స్‌లో చేర్చారు. ఒక ట్రాన్సాక్షన్‌లో గరిష్ఠంగా రూ. 2,000, నెల మొత్తంలో అన్ని లొకేషన్లలో కలిపి గరిష్ఠంగా రూ. 10,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ కస్టమర్లపై ఛార్జీ వేస్తే అది ట్రాన్సాక్షన్ మొత్తంలో 1 శాతానికి మించకూడదు.
కస్టమర్ దుకాణంలో ఏదైనా వస్తువు కొన్నా కొనకపోయినా ఈ క్యాష్ విత్‌డ్రా సదుపాయం అందుబాటులో ఉండాలి. షాపింగ్‌తో పాటు క్యాష్ తీసుకుంటే, విత్‌డ్రా చేసిన క్యాష్ మొత్తాన్ని రశీదుపై ప్రత్యేకంగా చూపించాలి. బ్యాంకులు బోర్డు ఆమోదించిన పాలసీ ప్రకారం, వ్యాపారుల వివరాలను సరిచూసి ఈ సేవను అందించాలి.
అలాగే ఏటీఎంలలో యూపీఐ ద్వారా కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా నిబంధనలను కూడా ఆర్బీఐ కొనసాగించింది. ఇందులో యూపీఐ ద్వారా కస్టమర్ అథరైజేషన్ జరుగుతుంది, నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ లేదా ఏటీఎం నెట్‌వర్క్‌ల ద్వారా సెటిల్‌మెంట్ పూర్తవుతుంది.
రద్దు చేసిన 17 సర్క్యులర్లు ప్రధానంగా ఏటీఎం కస్టమర్ ఛార్జీలు, ఫ్రీ లిమిట్స్, ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ రికన్సిలియేషన్, పీఓఎస్ క్యాష్ విత్‌డ్రా, వ్యాపారుల వద్ద యూపీఐ క్యాష్ విత్‌డ్రా, కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాకు సంబంధించినవి. కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారం కోసం బ్యాంకులు, పీపీఐ సంస్థలు ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్, 2026ను అనుసరించాలి. అలాగే ఫెయిల్ అయిన ట్రాన్సాక్షన్ల పరిష్కార సమయం, కస్టమర్లకు పరిహారం చెల్లింపుపై ప్రస్తుతం ఉన్న నిబంధనలు యథాతథంగా అమలవుతాయి.