FD కంటే ఎక్కువ వడ్డీ కావాలా? పోస్టాఫీస్‌ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి

First Published | Nov 16, 2024, 6:24 PM IST

రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలనుకుంటే పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్ మీకు మంచి ఆప్షన్. ఈ పథకాల్లో రిటర్న్స్ కి హామీ ఉంటుంది. అనేక పోస్టాఫీస్ పథకాలు మీకు ఫిక్స్‌డ్  డిపాజిట్ల(FD) కంటే ఎక్కువ వడ్డీని కూడా అందిస్తాయి. అలాంటి బెటర్ పథకాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం రండి. 

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారు. సురక్షితమైన పొదుపు విషయానికి వస్తే చాలా మంది స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెడుతుంటారు. ఇలాంటి చిన్న పొదుపు పథకాలకు పోస్టాఫీస్ కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. పోస్ట్ ఆఫీస్ లో చిన్న పొదుపు పథకాలు ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే ఎక్కువ వడ్డీని ఇస్తాయి. అంతే కాకుండా ఈ స్కీమ్స్ లో పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. మార్కెట్ ఒడిదొడుకులు ఈ పథకాలపై ఎలాంటి ప్రభావం చూపలేవు. మీరు గాని రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ పథకాలు మీకు మంచి ఆప్షన్ అవుతుంది. 

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS)

SCSS పథకం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ కోసం  ఏర్పాటు చేశారు. అంటే 60 ఏళ్లు పైబడిన వారు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పథకంలో పెట్టుబడిదారుడు ఒకేసారి మొత్తం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో గరిష్టంగా రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం ఇన్ కమ్ టాక్స్ చట్టంలోని 80C సెక్షన్ కింద పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అంటే మీరు గాని ఈ పథకంలో పెట్టుబడి పెడితే టాక్స్ కన్సషన్ లభిస్తుంది. 

ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి ప్రస్తుతం 8.2 % వడ్డీ రేటు ఇస్తున్నారు. ఈ పథకం గడువు 5 సంవత్సరాలు. అంటే 5 సంవత్సరాలకు ఒకేసారి పెట్టుబడి పెట్టాలి. అంతేకాకుండా అయిదేళ్ల తర్వాత మీరు కావాలంటే ఈ మరో అయిదేళ్లు ఈ పథకాన్ని పొడిగించవచ్చు.


కిసాన్ వికాస్ పత్ర

కిసాన్ వికాస్ పత్ర అనేది పొదుపు సర్టిఫికెట్. ఇది హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. అయితే ఈ పథకంలో పెట్టుబడి పెట్టనవారికి పన్ను రాయితీలు లభించవు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి మాక్సిమం లిమిట్ ఏమీ లేదు. 

కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ లో పెట్టుబడి పెట్టిన వారికి 7.5% వార్షిక సమ్మేళన వడ్డీ రేటు లభిస్తుంది. గడువు 115 నెలలు. అంటే 9 సంవత్సరాల 7 నెలలకు ఈ వడ్డీ లభిస్తుంది. 

పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (MIS)

పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకంలో (MIS) సంవత్సరానికి కనీసం రూ.1500 పెట్టుబడి పెట్టాలి. మాక్సిమం రూ.9 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి మొత్తంపై ఆర్జించిన రాబడి పన్నుకు లోబడి ఉంటుంది.

ఈ పథకానికి వడ్డీ రేటు 7.4% గా ఉంది. ఈ వడ్డీ ప్రతి నెల అందుతుంది. ఈ పథకం గడువు కూడా 5 సంవత్సరాలు. అవసరమైతే పొడిగించే అవకాశం కూడా ఉంది.

జాతీయ పొదుపు సర్టిఫికెట్లు

జాతీయ పొదుపు సర్టిఫికెట్లు సెక్యూరిటీ ఇస్తూనే మంచి రిటర్న్స్ అందిస్తాయి. ఇది కూడా 5 సంవత్సరాల టైమ్ పీరియడ్ ఉన్న స్కీమ్. ఈ పథకంలో పెట్టుబడిపై వడ్డీ స్కీమ్ గడువు ముగిసినప్పుడే చెల్లిస్తారు. జాతీయ పొదుపు సర్టిఫికెట్లలో కనీసం 1000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. గరిష్ట పెట్టుబడికి ఎలాంటి లిమిట్ లేదు.

ఈ పథకంలో కూడా పెట్టుబడి పెట్టిన వారికి టాక్స్ మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. 7.7 శాతం వార్షిక సమ్మేళన వడ్డీ రేటు కూడా లభిస్తుంది. ఈ పథకం గడువు 5 సంవత్సరాలు.

మహిళా సమ్మాన్ పొదుపు సర్టిఫికెట్

మహిళా సమ్మాన్ పొదుపు సర్టిఫికెట్ భారతీయ మహిళలలో బాగా ఫేమస్ అయ్యింది. మహిళలు మాత్రమే ఇందులో చేరవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టినా ఎలాంటి పన్ను ప్రయోజనం కలగదు.

7.5% వార్షిక సమ్మేళన వడ్డీ రేటుతో ఈ పథకం రిటర్న్స్ ఇస్తుంది. ఈ స్కీమ్ గడువు 2 సంవత్సరాలు.

Latest Videos

click me!