కేంద్ర ప్రభుత్వం ఇప్పుటికే రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అందిస్తోంది. దీని ద్వారా ఎంతో మంది రైతులు లబ్ధిపొందుతున్నారు. ఇప్పుడు ఈ పథకంతో పాటు పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన అనే కొత్త పెన్షన్ స్కీమ్ ని కూడా తీసుకొచ్చింది. ఇదివరకే పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో రిజిస్టర్ చేసుకున్న రైతులు ఎలాంటి అదనపు ప్రక్రియ లేకుండానే ఈ పెన్షన్ పథకంలో చేరవచ్చు. ఈ పెన్షన్ పథకంలో చేరిన రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన అంటే ఏంటి?
ఇది చిన్న, సన్నకారు రైతుల కోసం నడుపుతున్న పెన్షన్ స్కీమ్. ఈ పథకంలో చేరిన రైతుకు 60 ఏళ్ల వయసు తర్వాత నెలకు రూ.3000 పెన్షన్ అందుతుంది. అంటే ఏడాదికి రూ.36,000 పెన్షన్ అందుతుంది. ఇది జీవితకాలం లభిస్తుంది. ఈ స్కీమ్ లో ఉన్న ప్రత్యేకత ఇదే. రైతుల వృద్ధాప్యంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా జీవనం సాగించాలన్న సంకల్పంతో ఈ పథకం రూపొందించారు.
ఎవరు అప్లై చేసుకోవచ్చు?
పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన పెన్షన్ స్కీమ్ లో చేరాలనుకున్న రైతుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రైతు ప్రతి నెలా తన వయసును బట్టి రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాలి. రైతు ఎంతైతే కడతారో ప్రభుత్వం కూడా అంతే మొత్తం జమ చేస్తుంది.
మీరు పీఎం కిసాన్ స్కీమ్‌లో ఉంటే లాభమేంటి?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో చేరిన రైతులు ఈ పెన్షన్ స్కీమ్ లో చేరడానికి ఎలాంటి అదనపు డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. అన్ని డాక్యుమెంట్లు ఇదివరకే సబ్మిట్ చేసి ఉంటారు కనుక ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. పెన్షన్ స్కీమ్‌లో రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. సభ్యత్వ రుసుము కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది.
ఉదాహరణకు ఒక రైతు 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే నెలకు రూ.55 చెల్లిస్తే చాలు. అదే రైతు 40 ఏళ్ల వయసులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే నెలకు రూ.200 కట్టాలి. ఈ మొత్తం ఏడాదికి రూ.660 నుంచి రూ.2400 మధ్య ఉంటుంది.