Petrol Diesel Rates: హోర్ముజ్ జలసంధి ప్లాన్స్ పై అనిశ్చితితో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఈ ప్రభావంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పై ప్రభావం పడుతోంది. హోర్ముజ్ సంక్షోభంతో ఇండియాలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా మారబోతున్నాయి?
క్రూడ్ ఆయిల్ ధరకు మళ్లీ రెక్కలు.. మన దగ్గర పెట్రోల్, డీజిల్ రేట్ల సంగతేంటి?
అమెరికా, ఇరాన్ మధ్య దాదాపు ఆరు నెలలుగా సాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇటీవల ఒమన్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాల నడుమ చర్చలు జరుగుతున్నాయనే వార్తలు రాగానే, గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు కాస్త తగ్గాయి. అయితే, ఈ హెచ్చుతగ్గుల మధ్య వారంలో మొదటి రోజే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పైకి లేచాయి. దీనికి ప్రధాన కారణం ప్రసిద్ధ 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' ను తిరిగి తెరిచే విషయంలో ఉన్న అయోమయమే.
ఇరాన్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కొత్త సముద్ర మార్గాన్ని ఖరారు చేసేందుకు ఒమన్‌తో ఒప్పందం చివరి దశలో ఉంది. కానీ, అమెరికా ముందుగా తమ మిగిలిన షరతులను నెరవేర్చాలని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ పరిణామాల మధ్య అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 91 సెంట్లు అంటే 1.09 శాతం పెరిగి బ్యారెల్‌కు 84.46 డాలర్లకు చేరుకుంది. అలాగే, అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ కూడా 61 సెంట్లు అంటే 0.78 శాతం పెరిగి బ్యారెల్‌కు 78.79 డాలర్లుగా నమోదైంది.
25
గత వారంలో 7 శాతానికి పైగా తగ్గిన ధరలు
గత వారం ఇరాన్, ఒమన్ మధ్య ఒప్పందం కుదిరిందనే వార్తల తర్వాత ఆయిల్ ధరలు ఏకంగా 7 శాతానికి పైగా పడిపోయాయి. ఆ సమయంలో హోర్ముజ్ జలసంధి త్వరలోనే తెరుచుకుంటుందని అంతా భావించారు. సాధారణంగా, యుద్ధ పరిస్థితులకు ముందు ప్రపంచవ్యాప్త చమురు అవసరాలలో దాదాపు 20 శాతం ముడి చమురు ఈ హోర్ముజ్ మార్గం ద్వారానే రవాణా అయ్యేది. అయితే, ఆ తర్వాత ఇరాన్ ఇచ్చిన ఒక కొత్త ప్రకటన మార్కెట్ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. జూన్ దాడి వల్ల జరిగిన నష్టానికి అమెరికా పరిహారం చెల్లించడంతో పాటు, తమ మిగిలిన షరతులన్నింటినీ పాటిస్తేనే హోర్ముజ్‌ను తెరుస్తామని ఇరాన్ కుండబద్దలు కొట్టింది.
35
ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గడం లేదు
ప్రస్తుతం మార్కెట్ విశ్లేషకులు, వ్యాపారులు కేవలం ప్రకటనలను నమ్మడం లేదు. ట్యాంకర్ల అసలు రాకపోకలు ప్రారంభం కావడం లేదా అధికారిక ఒప్పందం జరగడం వంటి బలమైన ఆధారాల కోసం వారు ఎదురుచూస్తున్నారు. మరోవైపు, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మాట్లాడూ, జూన్‌లో జరిగిన తాత్కాలిక ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘిస్తున్నంత వరకు వాషింగ్టన్‌తో ఎలాంటి చర్చలు ఉండవని స్పష్టం చేశారు. దీనికి తోడు, యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరామ్‌కోకు చెందిన జాతాన్ రిఫైనరీపై దాడి చేసినట్లు ప్రకటించారు. సౌదీ అరేబియా ఇటీవల టర్కీ, పాకిస్తాన్‌లతో రక్షణ ఒప్పందంపై సంతకం చేసిన సరిగ్గా రెండు రోజులకే ఈ దాడి జరగడం గమనార్హం.
గ్లోబల్ మార్కెట్‌లో ఇటీవల తగ్గిన ఆయిల్ ధరలు మళ్లీ పుంజుకోవడం ప్రారంభించాయి. అయితే, గత వారం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఓవరాల్‌గా ధరలలో తగ్గుదలే కనిపించింది. దీంతో అంతర్జాతీయంగా తగ్గిన ధరల ప్రయోజనం భారతదేశంలో సామాన్య ప్రజలకు అందుతుందా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై కేంద్ర పెట్రోలియం మంత్రి స్పందిస్తూ, మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగకుండా స్థిరంగా ఉంచగలిగామని ముందే స్పష్టం చేశారు.
55
భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈ పరిణామాల మధ్య సోమవారం ఉదయం దేశీయ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. ధరలను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 102.12 వద్ద నిలకడగా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ. 95.20 వద్ద కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను భారతీయ చమురు కంపెనీలు నిశితంగా గమనిస్తున్నాయి.