Gold Price Today: గోల్డ్ రేటు దిగొచ్చింది.. కానీ మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందా?

Published : Aug 10, 2026, 12:21 PM IST

Gold Price Today: గతవారం బంగారం ధరలు భారీగా పెరగడంతో పసిడి కొనుగోలుదారుల్లో ఆందోళన నెలకొంది. కొద్దిరోజుల్లోనే మేలిమి బంగారం ధర రూ.6 వేల మేర ఎగబాకడం మార్కెట్‌లో కలకలం రేపింది. ధరలు ఇలాగే మరింత పెరుగుతాయా? అనే సందేహం కొనుగోలుదారుల్లో వ్యక్తమైంది.

PREV
15
వెండి ధరలో మార్పు లేదు

అయితే కొత్తగా బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నవారు తొందరపడకుండా తమ ప్రాంతంలోని జువెలరీ షాపుల్లో ఉన్న రిటైల్ రేట్లను ఒకసారి పరిశీలించడం మంచిది. ముఖ్యంగా పెట్టుబడి కోసం లేదా పండుగలు, శుభకార్యాల కోసం ఆభరణాలు కొనేవారు ధరల్లో రోజువారీ మార్పులను గమనించాలి.

ఆగస్టు 10, 2026 సోమవారం వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కిలో స్వచ్ఛమైన వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది.

25
బంగారం ధరలకు బ్రేక్

ఇక బంగారం విషయానికి వస్తే.. గత కొన్ని రోజులుగా వరుసగా పెరిగిన ధరలకు సోమవారం కొంత విరామం లభించింది. ఆగస్టు 9తో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.380 మేర తగ్గింది. దీంతో హైదరాబాద్ సహా పైన పేర్కొన్న ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.1,51,970గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా మార్పు చూపించింది. 10 గ్రాముల ధర రూ.350 మేర తగ్గి రూ.1,39,300 స్థాయిలో కొనసాగుతోంది. అయితే నగల ధరలపై మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులు ప్రభావం చూపుతాయని కొనుగోలుదారులు గుర్తుంచుకోవాలి.

35
బంగారం ధరలకు అంతర్జాతీయ పరిణామాల ప్రభావం

ప్రపంచ మార్కెట్లలో జరుగుతున్న పరిణామాలు పసిడి ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, చమురు ధరల్లో హెచ్చుతగ్గులు, అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడిదారుల కదలికలు బంగారం రేట్లను ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభానికి ముగింపు పలికేందుకు మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. సుదీర్ఘంగా కొనసాగుతున్న ఘర్షణల వల్ల అమెరికాపై ఆర్థిక, రాజకీయ ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్‌తో చర్చలకు ప్రాధాన్యం పెరిగినట్లు తెలుస్తోంది.

45
హర్మూజ్‌పైనే కీలక చర్చలు

అమెరికా-ఇరాన్ మధ్య ప్రధాన వివాదాల్లో హర్మూజ్ జలసంధి కూడా ఒకటిగా మారింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గంలో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయంగా చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఇంధన ధరలు పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది.

ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని తిరిగి పూర్తిస్థాయిలో తెరవడం ద్వారా ఇరాన్‌తో ఒప్పందానికి వెళ్లే అంశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. గతంలో పట్టుబట్టిన అణు ఒప్పంద అంశాన్ని పక్కన పెట్టి, ముందుగా యుద్ధానికి ముగింపు పలికే దిశగా అడుగులు వేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

అయితే ఇరాన్ మాత్రం అమెరికా విధించిన ఆంక్షలను తొలగించడంతో పాటు పశ్చిమాసియా నుంచి అమెరికా సైనిక బలగాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యుద్ధానికి శాశ్వత ముగింపు వచ్చే వరకు హర్మూజ్‌ను పూర్తిగా తెరవడం సాధ్యం కాదనే వైఖరిని టెహ్రాన్ ప్రదర్శిస్తోంది.

55
అమెరికాకు ఇరాన్ హెచ్చరిక

మరోవైపు ఇరాన్ కూడా తన వైఖరిని స్పష్టం చేసింది. అమెరికా సిబ్బంది తమ దేశంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ బ్రిగేడియర్ జనరల్ అలీ జహన్‌షాహీ హెచ్చరించారు. అమెరికా నుంచి వచ్చే ఏ చర్యకైనా తగిన స్థాయిలో ప్రతిస్పందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఎలా మలుపు తిరుగుతాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ పరిణామాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్, చమురు ధరలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ ఎలా మారుతాయన్నదే రానున్న రోజుల్లో బంగారం ధరల దిశను నిర్ణయించే అవకాశం ఉంది. అందుకే పసిడి కొనుగోలుదారులు రేట్లను ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories