పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్. దీన్ని ఆదాయపు పన్ను శాఖ ఇస్తుంది. ఇది 10 అంకెలను కలిగిన నంబర్.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ పాన్ కార్డ్ వివరాలను పర్యవేక్షిస్తుంది. ఇది గుర్తింపు ధ్రువీకరణగా పనిచేస్తుంది. బ్యాంక్ అకౌంట్ తెరవడానికి, స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడానికి, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి, బంగారం, ఆస్తులు కొనడానికి పాన్ కార్డ్ చాలా అవసరం. మీ పాన్ కార్డును అప్ డేట్ చేయకపోతే ఈ పనులేవీ మీరు చేయలేరు.
బ్యాంకు రిలేటెడ్ పనులకు..
బ్యాంక్ అకౌంట్ తెరవడానికి పాన్ కార్డ్ చాలా అవసరం. ఇది అప్ డేట్ అయి లేకపోతే అంటే పాన్ వివరాల్లో తేడాలు ఉంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేరు. సేవింగ్స్, కరెంట్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలన్నా కూడా అప్‌డేటెడ్ పాన్ కార్డ్ అవసరం. అంతేకాకుండా లోన్ లేదా క్రెడిట్ కార్డ్‌కు అప్లై చేసేటప్పుడు, బ్యాంక్ అప్‌డేటెడ్ పాన్ కార్డ్ అడుగుతుంది.
స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడానికి...
స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడానికి అప్డేడ్ చేసిన పాన్ కార్డు ఉండాలి. అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి కూడా పాన్ కార్డ్ తప్పనిసరి. ఇది పెట్టుబడి, మూలధన లాభాన్ని ట్రాక్ చేస్తుంది. దీని వల్ల స్టాక్ మార్కెట్ లో మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. అంతేకాకుండా డెట్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేయాలన్నా పాన్ కార్డు కావాలి.
బంగారం కొనాలన్నా అప్డేటెడ్ పాన్ కావాలి
గోల్డ్, బంగారు నగలు కొనాలంటే అప్డేట్ చేసిన పాన్ కార్డు ఇవ్వాలి. అంటే చిన్న చిన్న వస్తువులు కొంటే అవసరం లేదు కాని.. రూ.2 లక్షలకు పైగా బంగారం కొనాలంటే పాన్ కార్డ్ కావాలి. దీని వల్ల పన్ను మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. చాలా మంది బంగారంపై ఇన్వెస్ట్ చేశామని చెప్పి ట్యాక్సులు ఎగ్గొడుతుంటారు. అందుకే బంగారం కొనేటప్పుడు కచ్చితంగా పాన్ కార్డు అడుగుతారు.
ఇది కూడా చదవండి రిస్క్ లేకుండా ఎక్కువ లాభాలు కావాలంటే బంగారంపై ఇన్వెస్ట్ చేయండి. ఇవిగో టిప్స్
ఆస్తి కొనాలన్నా పాన్ కార్డు ఉండాలి
రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి కొనాలంటే పాన్ కార్డ్ ఇవ్వాలి. ఇంటిని కొనేటప్పుడు కూడా పాన్ కార్డు తప్పనిసరిగా ఇవ్వాలి. ఆస్తి అమ్మితే అమ్మకం పత్రం(సేల్ డీడ్) లో పాన్ కార్డ్ వివరాలు పేర్కొనాలి. పాన్ వివరాలు సమర్పిస్తేనే మూలధన లాభాన్ని ట్రాక్ చేయడం సాధ్యపడుతుంది.
హోమ్ లోన్ తీసుకునేటప్పుడు బ్యాంక్ పాన్ కార్డ్ వివరాలు ఇవ్వడం తప్పనిసరి. అద్దె ఒప్పందానికి కూడా పాన్ కార్డ్ అవసరం. ఇక్కడ పాన్ కార్డు వివరాలు అప్ డేట్ అయి ఉండాలి. వాటిల్లో తప్పులు, తేడాలు ఉంటే మీ పనులు రిజక్ట్ అవుతాయి.