NPCI: యూపీఐ పేమెంట్స్ ఎంత పెరిగినా ఇప్పటికీ డబ్బులు విత్‌డ్రా చేసే వారు ఉన్నారు. అయితే డబ్బులు విత్‌డ్రా చేయడానికి కూడా ఇకపై యూపీఐ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
స్మార్ట్‌ఫోన్ ద్వారా నగదు ఉపసంహరణను మరింత సులభతరం చేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా బిజినెస్ కరస్పాండెంట్ (BC) అవుట్‌లెట్‌లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా ప్రజలు నేరుగా UPI ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. దీని కోసం NPCI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతిని కోరింది.
25
ప్రస్తుతం ఉన్న పరిమితులు
ప్రస్తుతం UPI ఆధారిత నగదు ఉపసంహరణ సౌకర్యం కొన్ని ATMలు, ఎంపిక చేసిన దుకాణాలలో మాత్రమే అందుబాటులో ఉంది. పట్టణాల్లో ప్రతి లావాదేవీకి రూ. 1,000 పరిమితి ఉంది. అలాగే గ్రామాల్లో అయితే రూ. 2,000 వరకు ఉపసంహరించుకోవచ్చు. కొత్త ప్రతిపాదన ప్రకారం, BC అవుట్‌లెట్‌లలో ఒక్కో లావాదేవీకి రూ. 10,000 వరకు డబ్బు తీసుకునే అవకాశం ఇవ్వనున్నారు.
35
బిజినెస్ కరస్పాండెంట్ అవుట్‌లెట్ అంటే ఏంటి?
బ్యాంకు బ్రాంచ్‌లు లేదా ATMలు లేని ప్రాంతాల్లో బ్యాంకుల తరఫున సేవలు అందించే స్థానిక ప్రతినిధులనే బిజినెస్ కరస్పాండెంట్లు అంటారు. వీరు దుకాణదారులు, NGOలు లేదా వ్యక్తులు కావచ్చు. ఇంతకుముందు ఆధార్ ఆధారిత గుర్తింపు లేదా డెబిట్ కార్డుల ద్వారా ప్రజలు వీరి ద్వారా డబ్బు ఉపసంహరించేవారు.
కొత్త వ్యవస్థలో ప్రతి BC అవుట్‌లెట్‌కి UPI QR కోడ్ ఇస్తారు. కస్టమర్లు తమ మొబైల్‌లోని ఏదైనా UPI యాప్‌తో కోడ్‌ను స్కాన్ చేసి, కావలసిన మొత్తాన్ని నగదుగా పొందగలరు. ఇది మైక్రో ATMల కంటే సులభం, ఎందుకంటే ఇకపై డెబిట్ కార్డు లేదా వేలిముద్ర కూడా అవసరం ఉండదు.
55
ఎవరికి ఉపయోగపడుతుంది.?
* వేలిముద్ర ద్వారా డబ్బులు తీసుకోవడంలో ఇబ్బందులు పడుతోన్న వారికి.
* డెబిట్ కార్డు వాడటంలో సౌలభ్యం లేని వారికి.
* చిన్న గ్రామాలు, పట్టణాల్లో ATMలు లేని చోట నివసించే వారికి.
* ఈ కొత్త సౌకర్యం ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది కస్టమర్లు సులభంగా నగదు పొందగలుగుతారు.