చేపలు పెంచడం వల్ల ఇంట్లో శుభం జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. సంపద కూడా పెరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మామూలుగా ఇవి ఇంటి అందాన్ని పెంచడమే కాదు, సానుకూల శక్తిని కూడా వ్యాపింపజేస్తాయట. అయితే సరైన చేపల ఎంపిక ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంశం. వాస్తు ప్రకారం చేపల ఎంపిక ప్రతికూల శక్తిని తగ్గిస్తుందట. అందుకే ఏ చేపలు పడితే ఆ చేపలు పెంచకుండా గోల్డ్ ఫిష్, అరోవానా, నల్ల చేపలు పెంచడం శుభప్రదమని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
గోల్డ్ ఫిష్
సాధారణంగా చేపలను చూడటం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, మనసు ప్రశాంతంగా ఉంటుందని మానసిక వైద్యులు చెబుతున్నారు. గోల్డ్ ఫిష్ ను వాస్తు శాస్త్రంలో చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది సంపదను పెంచుతుందట. అదృష్టం కలిగేలా చేస్తుందట. అంతేకాకుండా సానుకూల శక్తిని ఇంటిలో క్రియేట్ చేస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే గోల్డ్ ఫిష్ ఉన్న నీరు శుభ్రంగా ఉండాలి. అక్వేరియం చాలా నీట్ గా ఉండేలా చూసుకోవాలి.
అరోవానా చేప
అరోవానాని చేప పెంచడం వల్ల డబ్బు రెట్టింపు అవుతుందట. ప్రొఫెషన్ లో ఉన్నతి సాధించడానికి సహాయపడుతుందట. ఈ చేపను అక్వేరియం లో పెట్టి ఇంట్లో లేదా ఆఫీసులో ఉంచితే ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఈ చేపను డ్రాగన్ ఫిష్ అని కూడా అంటారు.
నల్ల చేప
వాస్తు ప్రకారం నల్ల చేప ప్రతికూల శక్తిని బయటకు పంపించేస్తుంది. ఈ చేపను ఇంట్లో పెంచినా, ఆఫీసులు, షాపులు, మాల్స్ ఇలా ఎక్కడ పెంచినా అక్కడ అవసరాలను బట్టి పాజిటివ్ శక్తిని పెంచుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇది కుటుంబ సభ్యులను దృష్టి దోషం నుండి కూడా కాపాడుతుందట.
అక్వేరియంలో ఎన్ని చేపలు ఉంచాలి?
అక్వేరియంలో 9 చేపలు ఉంచడం శుభప్రదం. 8 గోల్డ్ ఫిష్, 1 నల్ల చేప ఉంచితే శుభం, దృష్టి దోషం నుండి రక్షణ లభిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
అక్వేరియం ఏ దిక్కులో ఉంచాలి
ఇంటిలో అక్వేరియంని ఈశాన్యంలో ఉంచడం మీకు మీ కుటుంబ శ్రేయస్సుకు సహాయపడుతుంది. చేపలు నీటిలో నిరంతరం కదులుతూ ఉంటాయి. దీనివల్ల ఇంట్లో శక్తి ప్రవాహం సానుకూలంగా మారుతుంది. అయితే అక్వేరియంలను వంటగది, బాత్రూం దగ్గర ఉంచకూడదు. అక్వేరియం నీరు శుభ్రంగా ఉండాలి. మురికి నీరు అలాగే ఉంటే, అందులోనే చేపలు పెరుగుతుంటే అవి ప్రతికూల శక్తిని పెంచుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.