Lottery: అదృష్టం కూడా డిస్కౌంట్‌లో వస్తుంది, దురదృష్టం మాత్రం బోనస్‌తో వస్తుంది. ఇది ఓ సినిమాలోని డైలాగ్. అయితే అదృష్టం డిస్కౌంట్‌లో వస్తుందని చెప్పడానికి బెస్ట్ ఉదాహరణ లాటరీలు. లాటరీలో కోటి గెలిస్తే చేతికి ఎంత వస్తుందో తెలుసా.?
లాటరీ గెలవాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఒక్క టికెట్‌తో జీవితం మారిపోతుందన్న ఆశ చాలామందిలో ఉంటుంది. కోటి రూపాయల లాటరీ తగిలితే వెంటనే కోటీశ్వర్లు అయిపోయమని అనుకుంటారు. కానీ వాస్తవం కొంచెం భిన్నంగా ఉంటుంది. లాటరీ గెలిచిన మొత్తం డబ్బు నేరుగా ఖాతాలోకి వస్తుందా అంటే సమాధానం కాదని చెప్పాలి. అందులో నుంచి పెద్ద మొత్తంలో ట్యాక్స్ కట్ అవుతుంది.
25
లాటరీపై టాక్స్ ఎందుకు పడుతుంది?
భారతదేశంలో సంపాదించే దాదాపు ప్రతి ఆదాయం ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది. లాటరీ, గేమ్ షోలు, గుర్రపు పందేలు, కార్డ్స్ ఆటలు, క్రాస్‌వర్డ్ పోటీలు ఇలా గెలిచిన డబ్బు కూడా ఆదాయంగానే పరిగణిస్తారు. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం 1961 ప్రకారం లాటరీ ద్వారా వచ్చిన డబ్బు పన్ను చెల్లించాల్సిన ఆదాయమే. అందుకే లాటరీ గెలిచిన వెంటనే ట్యాక్స్ వర్తిస్తుంది.
35
లాటరీ గెలిచిన డబ్బుపై ఎంత శాతం పన్ను కట్ అవుతుంది?
ఇతర ఆదాయాలపై స్లాబ్ ప్రకారం టాక్స్ ఉంటే, లాటరీ గెలుపుపై మాత్రం ఫిక్స్‌డ్ రేట్ ఉంటుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని 115BB సెక్షన్ ప్రకారం లాటరీ గెలుపుపై నేరుగా 30 శాతం పన్ను విధిస్తారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు. దీనితో పాటు సర్‌చార్జ్, ఎడ్యుకేషన్ సెస్, హయ్యర్ ఎడ్యుకేషన్ సెస్ కూడా వర్తిస్తాయి.
ఒక వ్యక్తి లాటరీలో రూ. 1 కోటి గెలిస్తే మొదట 30 శాతం టాక్స్ కట్ అవుతుంది. అంటే రూ. 30 లక్షలు. ఆపై 10 శాతం సర్‌చార్జ్ వర్తిస్తుంది. విద్యా సెస్ కూడా కలుస్తుంది. ఈ మొత్తం కలిపితే సుమారు రూ. 33 లక్షల వరకు ట్యాక్స్ కట్ అవుతుంది. అంటే కోటి రూపాయల లాటరీ గెలిచినా చేతికి వచ్చే మొత్తం సుమారు రూ. 67 లక్షలే.
55
లాటరీ గెలిస్తే గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు
లాటరీ గెలుపుపై ఎలాంటి బేసిక్ ఎగ్జెంప్షన్ ఉండదు. ఇతర ఆదాయాల్లా టాక్స్ తగ్గించుకునే అవకాశం కూడా లేదు. గెలిచిన మొత్తంలో నుంచే టాక్స్ కట్ చేసి మిగిలిన డబ్బు మాత్రమే విజేతకు అందుతుంది. అందుకే లాటరీ గెలిచిన వెంటనే ఖర్చుల ప్రణాళిక వేసుకునే ముందు టాక్స్ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. లేకపోతే ఆశించిన మొత్తానికి వాస్తవంగా చేతికి వచ్చిన డబ్బుకు పెద్ద తేడా కనిపిస్తుంది.
గమనిక:
ఈ సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న పన్ను నిబంధనలు ఆధారంగా ఇవ్వడమైంది. ట్యాక్స్ రేట్లు, నిబంధనలు మారే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన లెక్కల కోసం టాక్స్ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.