లోన్ సెటిల్‌మెంట్ అంటే ఏంటి.? త‌క్కువ డ‌బ్బు చెల్లించినా బ్యాంకులు ఎందుకు ఒప్పుకుంటాయి?

Published : Sep 03, 2026, 10:05 PM IST

Loan Settlement: లోన్ చెల్లించ‌లేని ప‌రిస్థితుల్లో బ్యాంకులు కొంత తక్కువ మొత్తాన్ని తీసుకుని లోన్ అకౌంట్‌ను క్లోజ్ చేసేందుకు అంగీకరిస్తాయి. దీనినే లోన్ సెటిల్‌మెంట్ లేదా వన్‌టైమ్ సెటిల్‌మెంట్ అంటారు. బ్యాంకులు ఈ విధానానికి ఎందుకు ఒప్పుకుంటాయో తెలుసా.

PREV
15
లోన్ సెటిల్‌మెంట్ అంటే ఏంటి?

లోన్ తీసుకున్న వ్యక్తి చెల్లించాల్సిన మొత్తం బకాయిలో కొంత భాగాన్ని మాత్రమే తీసుకుని రుణాన్ని ముగించేందుకు బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ అంగీకరించడాన్ని లోన్ సెటిల్‌మెంట్ అంటారు. ఇందులో అసలు రుణం, వడ్డీ, పెనాల్టీలు లేదా ఇతర ఛార్జీలలో కొంత మొత్తాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి బ్యాంకులో రూ.10 లక్షల బకాయి ఉందనుకుందాం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతను మొత్తం చెల్లించే పరిస్థితిలో లేకపోతే, బ్యాంకు పరిస్థితులను పరిశీలించి రూ.6 లేదా రూ.7 లక్షలకు సెటిల్ చేసుకునేందుకు అంగీకరించవచ్చు. నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించిన తర్వాత ఖాతాను సెటిల్ చేసినట్లుగా నమోదు చేస్తారు. అయితే ఇది లోన్ పూర్తిగా క్లియర్ చేయడం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పూర్తి బకాయిని చెల్లిస్తే 'క్లోజ్డ్'గా నమోదు అవుతుంది. సెటిల్‌మెంట్‌లో మాత్రం 'సెటిల్డ్'గా కనిపించే అవకాశం ఉంటుంది.

25
బ్యాంకులు తక్కువ మొత్తాన్ని ఎందుకు తీసుకుంటాయి?

మొదటి చూపులో భారీ బకాయి ఉన్నప్పుడు అందులో కొంత మొత్తాన్ని వదులుకోవడం బ్యాంకుకు నష్టంలా కనిపిస్తుంది. కానీ బ్యాంకులు దీర్ఘకాలిక రికవరీ ప్రక్రియను కూడా లెక్కలోకి తీసుకుంటాయి. రుణగ్రహీత నుంచి మొత్తం డబ్బు తిరిగి వచ్చే అవకాశం లేకపోతే, ఏళ్ల తరబడి కోర్టులు, నోటీసులు, రికవరీ ప్రక్రియల కోసం ప్రయత్నించడం కంటే ప్రస్తుతం కొంత మొత్తమైనా వసూలు చేసుకోవడం మంచిదని భావించవచ్చు. అంటే రూ.10 లక్షలు బకాయి ఉండి, మొత్తం రికవరీ అవుతుందనే హామీ లేకపోతే.. ప్రస్తుతం రూ.6 లక్షలు వస్తున్నాయంటే బ్యాంకు ఆ ప్రతిపాదనను పరిశీలించే అవకాశం ఉంటుంది.

35
ఎన్‌పీఏ భయం, కోర్టు ఖర్చులే ప్రధాన కారణాలు

సాధారణంగా రుణగ్రహీత నిర్ణీత గడువులో వాయిదాలు చెల్లించకపోతే ఆ ఖాతా నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ (NPA)గా మారే అవకాశం ఉంటుంది. ఒకసారి రుణం మొండి బకాయిగా మారితే దాన్ని తిరిగి వసూలు చేయడం మరింత కష్టంగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో బ్యాంకులకు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి ఏళ్ల తరబడి రికవరీ కోసం ప్రయత్నించడం, రెండోది కొంత మొత్తాన్ని వెంటనే తీసుకుని ఖాతాను పరిష్కరించడం. కోర్టు కేసులు, న్యాయవాదుల ఫీజులు, రికవరీ ఏజెన్సీల ఖర్చులు, నోటీసులు వంటి ప్రక్రియలకు సమయం, డబ్బు రెండూ అవసరం అవుతాయి. సెటిల్‌మెంట్ ద్వారా కొంత మొత్తమైనా త్వరగా రికవర్ చేసుకోవచ్చని బ్యాంకులు భావిస్తాయి. అదే సమయంలో తమ బ్యాడ్ లోన్ల భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు.

45
ఆర్థిక ఇబ్బందులను కూడా బ్యాంకులు పరిశీలిస్తాయి

రుణగ్రహీత నిజంగా తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉన్నాడా లేదా అనేది కూడా సెటిల్‌మెంట్ సమయంలో కీలకంగా మారుతుంది. ఉద్యోగం కోల్పోవడం, వ్యాపారంలో భారీ నష్టాలు రావడం, ఆదాయం పూర్తిగా తగ్గిపోవడం వంటి పరిస్థితుల కారణంగా కొందరు మొత్తం రుణాన్ని చెల్లించలేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో రుణగ్రహీత ఆర్థిక పరిస్థితిని పరిశీలించిన తర్వాత బ్యాంకు కొంత తగ్గింపుతో సెటిల్‌మెంట్‌కు అంగీకరించే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికీ సెటిల్‌మెంట్ అవకాశం ఉంటుందని భావించకూడదు. రుణం రకం, బకాయి మొత్తం, చెల్లింపుల చరిత్ర, రుణగ్రహీత ఆర్థిక పరిస్థితి వంటి అంశాలను బట్టి బ్యాంకు నిర్ణయం తీసుకుంటుంది.

55
లోన్ సెటిల్‌మెంట్ తర్వాత ఎలాంటి సమస్యలు వస్తాయి?

లోన్ సెటిల్‌మెంట్ ద్వారా తక్షణ ఆర్థిక ఒత్తిడి తగ్గినప్పటికీ, భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడవచ్చు. క్రెడిట్ రిపోర్టులో రుణం పూర్తిగా చెల్లించినట్లు కాకుండా 'సెటిల్డ్'గా నమోదు కావచ్చు. దీన్ని భవిష్యత్తులో ఇతర బ్యాంకులు రుణం ఇచ్చే సమయంలో ప్రతికూల అంశంగా పరిగణించే అవకాశం ఉంటుంది. దీని వల్ల కొత్త పర్సనల్ లోన్ పొందడం కష్టమవచ్చు. హోమ్ లోన్, వెహికల్ లోన్‌కు ఇబ్బందులు ఎదురుకావచ్చు. క్రెడిట్ కార్డు పొందడం కష్టమయ్యే అవకాశం ఉంటుంది. క్రెడిట్ లిమిట్ పెంపు రిజ‌క్ట్ అవ్వొచ్చు. కొత్త రుణంపై అధిక వడ్డీ రేటు విధించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, రుణానికి కో-బారోవర్ లేదా గ్యారంటర్ ఉన్నట్లయితే వారికి కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఖాతాను ఎలా రిపోర్ట్ చేశారు, బ్యాంకు ఎలాంటి చర్యలు తీసుకుంది అనే అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories