Jio Platforms: జియో రాక‌తో దేశంలో జ‌రిగిన అద్భుతాలు ఇవే.. ఈ రంగాల్లో స‌మూల మార్పులు

Published : Sep 03, 2026, 05:07 PM IST

Jio Platforms: భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన జియో ప్రారంభమై పదేళ్లు పూర్తవుతోంది. 2016 సెప్టెంబర్‌లో ప్రారంభమైన జియో.. మొబైల్ డేటాను సామాన్యులకు అందుబాటులోకి వ‌చ్చిన జియో ఎన్నో రంగాల్లో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు కార‌ణ‌మైంది

PREV
15
డేటా విప్లవంతో మారిన భారత టెలికాం రంగం

జియో 2016లో పూర్తిగా ఇంటర్నెట్ ఆధారిత నెట్‌వర్క్‌తో సేవలను ప్రారంభించింది. సంప్రదాయ వాయిస్ నెట్‌వర్క్‌కు బదులుగా డేటా కనెక్షన్ ద్వారానే కాల్స్ అందించే సాంకేతికతను ఉపయోగించింది. ప్రారంభమైన కేవలం 180 రోజుల్లోనే 10 కోట్ల మంది 4జీ వినియోగదారులను చేరుకోవడం జియో సాధించిన అరుదైన ఘనతగా నిలిచింది. జియో రాకముందు భారత్‌లో కాల్స్, డేటాకు వేర్వేరుగా ఛార్జీలు ఉండేవి. జియో ఉచిత వాయిస్ కాల్స్ అందిస్తూ డేటాను అత్యంత తక్కువ ధరలకు అందుబాటులోకి తెచ్చింది. జియో ప్రారంభమైన సమయంలో ఒక జీబీ డేటా ధర సుమారు రూ.228 ఉండగా, ప్రస్తుతం అది రూ.8 కంటే తక్కువకు చేరింది. ఇదే సమయంలో దేశంలో ఇంటర్నెట్ వేగం కూడా గణనీయంగా పెరిగింది. గతంలో సగటు డౌన్‌లోడ్ స్పీడ్ 2.5 Mbps వరకు ఉండగా, ప్రస్తుతం 68 Mbpsకు పైగా చేరింది. జియో వైర్‌లెస్ నెట్‌వర్క్ ప్రస్తుతం దేశ జనాభాలో 99 శాతానికి పైగా ప్రజలకు అందుబాటులో ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని మొత్తం వైర్‌లెస్ డేటా ట్రాఫిక్‌లో దాదాపు 60 శాతం జియో నెట్‌వర్క్ ద్వారానే జరిగింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల వాటా సుమారు 46 శాతంగా ఉంది. చైనా మినహా ప్రపంచంలో అత్యధిక మొబైల్ డేటా ట్రాఫిక్‌ను నిర్వహిస్తున్న నెట్‌వర్క్‌గా జియో నిలిచింది.

25
ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్.. జియో ఫైబర్ నుంచి ఎయిర్‌ఫైబర్ వరకు

మొబైల్ ఇంటర్నెట్‌లో విప్లవం తీసుకొచ్చిన జియో.. ఆ తర్వాత హౌజ్‌ బ్రాడ్‌బ్యాండ్ రంగంపైనా దృష్టి పెట్టింది. 2019లో జియో ఫైబర్‌ను ప్రారంభించి హైస్పీడ్ ఇంటర్నెట్‌ను ఇళ్లకు అందించింది. అనంతరం 2024 ఆర్థిక సంవత్సరంలో జియో ఎయిర్‌ఫైబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో ఎయిర్‌ఫైబర్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇంటి వరకు కేబుల్ వేయాల్సిన అవసరం లేకుండానే వైర్‌లెస్ టెక్నాలజీ ద్వారా గరిష్ఠంగా 1 Gbps వేగంతో ఇంటర్నెట్ అందించగలగడం.

దీంతో ఒకే రోజులో ఇంటికి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఏర్పడింది. 2026 మార్చి నాటికి జియో ద్వారా 2.7 కోట్లకు పైగా ఇళ్లు బ్రాడ్‌బ్యాండ్ సేవలు పొందుతున్నాయి. రెండేళ్ల క్రితం ఈ సంఖ్య సుమారు 1.1 కోట్లుగా ఉండేది. జియో ఎయిర్‌ఫైబర్ ద్వారా మాత్రమే దాదాపు 1.3 కోట్ల కనెక్షన్లు అందాయి. ప్రస్తుతం భారత్‌లో అతిపెద్ద ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్‌గా జియో నిలిచింది. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశంలో కొత్తగా వచ్చిన ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లలో మూడింట రెండొంతులకుపైగా జియో ఖాతాలోకే వెళ్లాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా భారీగా కొత్త కనెక్షన్లు వచ్చాయి.

35
టీవీ నుంచి కంప్యూటర్ వరకు.. ఒకే ప్లాట్‌ఫామ్‌లో ఎన్నో సేవలు

జియో కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ అందించే సంస్థగా పరిమితం కాలేదు. ఆ కనెక్షన్ ద్వారా ప్రజలు ఉపయోగించే అనేక డిజిటల్ సేవలను కూడా అభివృద్ధి చేసింది. జియో సెట్‌టాప్ బాక్స్ ద్వారా సాధారణ టెలివిజన్‌ను ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా, గేమింగ్ పరికరంగా, కంప్యూటర్‌గా మార్చే అవకాశం కల్పిస్తోంది. జియో టీవీ ప్లస్‌లో వెయ్యికి పైగా డిజిటల్ ఛానళ్లు, 15 స్ట్రీమింగ్ సేవలు ఒకే ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయి. భారతీయ భాషల్లో లైవ్, ఆన్‌డిమాండ్ కంటెంట్‌ను సులభంగా వెతికే సదుపాయం కూడా ఉంది. గేమింగ్ ప్రియుల కోసం జియో గేమ్స్ ద్వారా 3,400కు పైగా గేమ్స్ అందిస్తోంది. ప్రత్యేక గేమింగ్ కన్సోల్ లేకుండానే వీటిని వినియోగించుకోవచ్చు.

మరోవైపు జియో పీసీ ద్వారా టెలివిజన్ స్క్రీన్‌పైనే పూర్తి స్థాయి కంప్యూటర్‌ను ఉపయోగించే అవకాశం కల్పిస్తోంది. మైజియో యాప్ ద్వారా వినియోగదారులు ఎంటర్‌టైన్‌మెంట్, క్లౌడ్ స్టోరేజ్, షాపింగ్, ఆర్థిక సేవలు వంటి అనేక సదుపాయాలను పొందుతున్నారు. 2024లో ప్రారంభమైన జియో ఏఐ క్లౌడ్ ద్వారా ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను స్టోర్ చేయడమే కాకుండా ఏఐ సాయంతో వాటిని సులభంగా నిర్వహించుకోవచ్చు. 2026 మార్చితో ముగిసిన త్రైమాసికంలో జియో వినియోగదారుడు సగటున నెలకు 42 జీబీకి పైగా డేటా వినియోగించాడు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ డేటా వినియోగ దేశంగా ఎదిగింది.

45
యువత కోసం జియో భారత్.. ఏఐని అందరికీ చేరువ చేసే ప్రయత్నం

భారత్‌లో యువత అవసరాలకు అనుగుణంగా డిజిటల్ సేవలు వేగంగా మారుతున్నాయి. వినోదం, విద్య, ఆన్‌లైన్ చెల్లింపులు, గేమింగ్, ఉద్యోగం.. అన్నీ చేతిలో ఉన్న మొబైల్ ద్వారానే జరగాలని కొత్త తరం భావిస్తోంది. జియో మొబైల్ వినియోగదారుల్లో దాదాపు సగం మంది 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు వారే.

ఇప్పటికీ దేశంలో 26 కోట్లకు పైగా ప్రజలు 2జీ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి వారిని డిజిటల్ ప్రపంచంలోకి తీసుకురావడానికి జియో భారత్ ఫోన్‌ను రూపొందించింది. తక్కువ ధరలో లభించే ఈ స్మార్ట్ ఫీచర్ ఫోన్‌లో యూపీఐ చెల్లింపులు, వీడియో స్ట్రీమింగ్, సంగీతం వంటి సేవలను ఉపయోగించుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కూడా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడంపై జియో దృష్టి పెట్టింది. జియో ఏఐ క్లౌడ్ ద్వారా కుటుంబ సభ్యుల ఫొటోలను ముఖాల ఆధారంగా గుర్తించడం, సులభంగా ఎడిట్ చేయడం వంటి సేవలు అందిస్తోంది.

జియో తన నెట్‌వర్క్ నిర్వహణలో కూడా ఏఐని ఉపయోగిస్తోంది. జియో బ్రెయిన్ అనే సొంత ఏఐ ఇంజిన్ ద్వారా నెట్‌వర్క్‌లో సమస్యలు తలెత్తకముందే గుర్తించడం, ట్రాఫిక్‌కు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచడం, కోట్లాది యూజ‌ర్ల‌కు స్థిరమైన కనెక్షన్ అందించడం వంటి పనులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో పూర్తిస్థాయి ఏఐ ఆధారిత సంస్థగా మారడమే జియో లక్ష్యంగా పెట్టుకుంది.

55
కనిపించకుండా దేశాన్ని కలుపుతున్న జియో టెక్నాలజీ

జియో సేవలు కేవలం మొబైల్ వినియోగదారులకు మాత్రమే పరిమితం కాలేదు. దేశంలోని అనేక కీలక సంస్థలు జియో టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. భారతదేశంలోని ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 90 శాతానికి పైగా బ్యాంకులు జియో సేవల్లో కనీసం ఒక సేవను వినియోగిస్తున్నాయి. దేశంలోని 80 శాతానికి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు జియో కనెక్టివిటీ, సెన్సార్ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నాయి. దేశంలోని అనేక విమానాశ్రయాలు కూడా జియో నెట్‌వర్క్‌తో అనుసంధానమై ఉన్నాయి.

భారత్‌లో సుమారు 8 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు ఉన్నాయి. వీటిలో చాలావరకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో డిజిటల్ సేవలను ఉపయోగించడం ప్రారంభించలేదు. పెద్ద కంపెనీలకు అందించే టెక్నాలజీ సామర్థ్యాన్ని చిన్న దుకాణాలు, క్లినిక్‌లు, వర్క్‌షాప్‌లకు కూడా అందించాలనే లక్ష్యంతో జియో పనిచేస్తోంది.

దేశీయంగా టెక్నాలజీని అభివృద్ధి చేయడంపైనా జియో ప్రత్యేక దృష్టి పెట్టింది. నెట్‌వర్క్, పరికరాలు, ఆపరేటింగ్ సిస్టమ్స్, అప్లికేషన్ల వరకు అనేక రంగాల్లో సొంత టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. 2026 మార్చి నాటికి 4జీ, 5జీ, 6జీ నెట్‌వర్క్ టెక్నాలజీతో పాటు ఏఐ ఆధారిత నెట్‌వర్క్ ఆటోమేషన్‌కు సంబంధించి 6,800కు పైగా పేటెంట్ దరఖాస్తులు చేసింది.

జియో 5జీ నెట్‌వర్క్ భారతదేశంలో స్టాండలోన్ ఆర్కిటెక్చర్‌పై పనిచేసిన తొలి నెట్‌వర్క్‌గా నిలిచింది. దేశీయంగా పూర్తి స్థాయి 5జీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసిన ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన భారత్ చేరడంలో జియో పాత్ర కీలకంగా ఉంది. మొత్తంగా చూస్తే జియో గత పదేళ్లలో భారత డిజిటల్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు ఖరీదైన డేటాను చౌకగా అందుబాటులోకి తెచ్చింది. నెట్‌వర్క్ లేని ప్రాంతాలకు కనెక్టివిటీని తీసుకెళ్లింది. ఇప్పుడు ఏఐ, క్లౌడ్, కంప్యూటింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలను సామాన్యుల ఇంటి వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.

జియో ప్రయాణం కేవలం టెలికాం కంపెనీ విజయగాథ మాత్రమే కాదు. ప్రతి భారతీయుడికి డిజిటల్ ప్రపంచాన్ని చేరువ చేసే ప్రయత్నం. గత దశాబ్దం ఇంటర్నెట్ అందుబాటు గురించి అయితే.. రాబోయే దశాబ్దం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ టెక్నాలజీల ఆధారంగా ఉండబోతోందనే సంకేతాలను జియో ఇస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories