IRCTC: భారతదేశంలో ప్రతి రోజు లక్షల మంది ప్రయాణికులు రైళ్ల వివరాలు తెలుసుకోవడానికి, టికెట్లు బుక్ చేసుకోవడానికి IRCTC వెబ్‌సైట్ఉ పయోగిస్తుంటారు. తత్కాల్ టికెట్ బుకింగ్ టైమ్‌లో ఒకేసారి లక్షల మంది ఒకేసారి లాగిన్ అయినా సైట్ క్రాష్ అవ్వదు ఎందుకో తెలుసా?
శక్తివంతమైన ఈ-టికెటింగ్ వ్యవస్థ వెనుక ఉన్న టెక్నాలజీ
IRCTC ప్లాట్‌ఫామ్‌ను అత్యాధునిక డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించారు. క్లౌడ్ టెక్నాలజీ, హై-పర్‌ఫార్మెన్స్ సర్వర్లు, ఆధునిక సాఫ్ట్‌వేర్ వ్యవస్థలను ఉపయోగించడం వల్ల భారీ సంఖ్యలో వినియోగదారులను ఒకేసారి నిర్వహించగలుగుతోంది. ఈ మొత్తం బ్యాక్‌ఎండ్ వ్యవస్థను భారత రైల్వేలకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) నిర్వహిస్తుంది. ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందించేందుకు ఈ సంస్థ నిరంతరం టెక్నికల్ అప్డేట్స్ చేస్తోంది.
25
లోడ్ బ్యాలెన్సింగ్‌తో..
లక్షల మంది ఒకేసారి వెబ్‌సైట్‌లోకి ప్రవేశించినప్పుడు మొత్తం ట్రాఫిక్ ఒకే సర్వర్‌పై పడితే అది పనిచేయడం ఆగిపోవచ్చు. ఈ సమస్యను నివారించేందుకు IRCTC లోడ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ విధానంలో యూజర్ల నుంచి వచ్చే అభ్యర్థనలు వందల సంఖ్యలో ఉన్న వేర్వేరు సర్వర్లకు పంపిస్తారు. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఆధారిత లోడ్ బ్యాలెన్సర్లు కలిసి ప్రతి సర్వర్‌పై సమానంగా పని భారం పడేలా చూస్తాయి. దీంతో తత్కాల్ బుకింగ్, పండుగల సీజన్ వంటి అత్యధిక రద్దీ సమయాల్లో కూడా వెబ్‌సైట్ స్థిరంగా పనిచేస్తుంది.
35
క్యాషింగ్ సిస్టమ్ వల్ల సమాచారం వెంటనే అందుబాటులోకి
IRCTC వేగంగా పనిచేయడానికి మరో ముఖ్య కారణం ఇన్-మెమరీ క్యాషింగ్ టెక్నాలజీ. ప్రతి సారి డేటాబేస్‌ను సంప్రదించడం సమయం తీసుకుంటుంది. అందుకే తరచుగా అవసరమయ్యే సమాచారాన్ని ముందుగానే సర్వర్ మెమరీలో నిల్వ చేస్తారు. ఉదాహరణకు రైళ్ల మార్గాలు, టైమ్‌టేబుల్, సెర్చ్ ఫలితాలు, సీట్ల లభ్యత వివరాలు వంటి సమాచారాన్ని రెడిస్ వంటి క్యాషింగ్ సిస్టమ్‌లో కొంతకాలం భద్రపరుస్తారు. ఈ సమాచారం RAMలో ఉండటంతో కొన్ని మైక్రోసెకన్లలోనే వినియోగదారులకు అందుతుంది. దీంతో వెబ్‌సైట్ స్పందన వేగం గణనీయంగా పెరుగుతుంది.
రీడ్ రిప్లికా డేటాబేస్‌లతో ప్రధాన సర్వర్‌పై ఒత్తిడి తగ్గింపు
IRCTCలోకి వచ్చే ప్రతి యూజర్ టికెట్ బుక్ చేయడు. చాలా మంది కేవలం రైళ్లు, సీట్ల లభ్యత, సమయాలు మాత్రమే పరిశీలిస్తారు. ఈ సెర్చ్‌లన్నింటినీ ప్రధాన డేటాబేస్ నిర్వహిస్తే దానిపై అధిక ఒత్తిడి ఏర్పడుతుంది. అందుకే IRCTC రీడ్ రిప్లికా డేటాబేస్‌లు ఉపయోగిస్తుంది. ఇవి ప్రధాన డేటాబేస్ కాపీలుగా పనిచేస్తాయి. యూజర్లు చేసే సెర్చ్‌లను ఇవే నిర్వహిస్తాయి. ఫలితంగా అసలు డేటాబేస్ టికెట్ బుకింగ్ వంటి కీలక కార్యకలాపాలపై దృష్టి పెట్టగలుగుతుంది. దీంతో మొత్తం వ్యవస్థ వేగంగా, స్థిరంగా పనిచేస్తుంది.
55
డిజిటల్ వెయిటింగ్ రూమ్, ఆటో స్కేలింగ్‌తో తత్కాల్ రద్దీకి చెక్
తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో కొన్ని సెకన్లలోనే లక్షల సంఖ్యలో బుకింగ్ రిక్వెస్ట్‌లు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో డేటాబేస్ క్రాష్ కాకుండా ఉండేందుకు IRCTC Kafka వంటి మెసేజ్ క్యూ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. ఈ టెక్నాలజీ ఒక డిజిటల్ వెయిటింగ్ రూమ్ మాదిరిగా పనిచేస్తుంది. వచ్చిన బుకింగ్ అభ్యర్థనలను క్రమపద్ధతిలో క్యూలో ఉంచి, ఒక్కోటి వేగంగా ప్రాసెస్ చేస్తుంది. దీంతో వ్యవస్థపై ఒక్కసారిగా అధిక ఒత్తిడి పడదు. అదే సమయంలో హారిజాంటల్ ఆటో స్కేలింగ్ సాంకేతికత కూడా పనిచేస్తుంది. ట్రాఫిక్ అకస్మాత్తుగా పెరిగితే క్లౌడ్‌లో అదనపు సర్వర్లు వాటంతటవే యాడ్ అవుతాయి. అవసరం తగ్గినప్పుడు వాటిని తిరిగి తొలగిస్తారు. దీనివల్ల ఎంతమంది వచ్చినా సేవల్లో అంతరాయం లేకుండా ఉంటుంది.