
జీవితంలో చాలా మందికి సొంతింటిని నిర్మించుకోవాలనే ఒక పెద్ద లక్ష్యం ఉంటుంది. మరోవైపు, పిల్లలకు మంచి చదువు ఇవ్వడం, భవిష్యత్తుకు డబ్బు దాచుకోవడం కూడా అంతే ముఖ్యమని భావిస్తుంటాడు. ముఖ్యంగా మధ్య తరగతి ఉద్యోగులకి ఈ రెండు లక్ష్యాలు ఒకేసారి నెరవేర్చడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి పరిస్థితిని తీసుకుందాం. అతనికి నెలకు రూ.50,000 జీతం వస్తోందని అనుకుందాం. ప్రస్తుతం అతని చేతిలో రూ.15 లక్షల పొదుపు ఉంది. ఇప్పుడు అతని ముందున్న ప్రశ్న ఈ డబ్బుతో ఇల్లు కొనాలా? లేక పెట్టుబడి పెట్టాలా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే రెండు మార్గాల్ని స్పష్టంగా విశ్లేషించాలి.
ప్రస్తుతం ఒక డబుల్ బెడ్ రూమ్ అపార్ట్‌మెంట్ కొనాలంటే తక్కువలో తక్కువ రూ. 40 లక్షలు పెట్టాల్సిందే. ఒకవేళ టైర్ టూ నగరాల్లో కొనుగోలు చేసినా రూ. 35 లక్షల వరకు చెల్లించాల్సిందే. ఆ ఉద్యోగి దగ్గర ఇప్పటికే రూ.15 లక్షలు ఉన్నాయని అనుకుందాం. అంటే ఇల్లు కొనాలంటే ఇంకా రూ.20 లక్షల హౌస్ లోన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ లోన్‌పై సాధారణంగా బ్యాంకులు 20 సంవత్సరాల కాలానికి EMI విధానంలో రుణం ఇస్తాయి. అలా తీసుకుంటే సుమారుగా నెలకు చెల్లించాల్సిన EMI రూ.20,000 వరకు ఉండే అవకాశం ఉంటుంది. అంటే అతని జీతం రూ.50,000 అయితే… రూ.20,000 హౌస్ లోన్ EMIకి వెళ్తే అతనికి మిగిలేది రూ. 30,000. ప్రస్తుత ఖర్చులు పెరిగిన పరిస్థితిలో రూ.30,000తో కుటుంబాన్ని నిర్వహించడం చాలా కష్టమయ్యే అవకాశం ఉంది.
ఇల్లు కొనడం ఒక పెద్ద నిర్ణయం. కానీ దానికి వచ్చే EMI ఒత్తిడిని కూడా ఆలోచించాలి. నెలకు రూ.20,000 EMI అంటే జీతంలో 40% నేరుగా లోన్‌కే వెళ్తుంది. అత్యవసర ఖర్చుల కోసం పొదుపు చేయడం కష్టమవుతుంది. పిల్లల ఉన్నత విద్య కోసం డబ్బు దాచడం కూడా కష్టమవుతుంది. మరొక విషయం ఏమిటంటే, ఉద్యోగంలో అనిశ్చితి, ఆరోగ్య సమస్యలు, ఆకస్మిక ఖర్చులు వచ్చినప్పుడు EMI చెల్లించడం చాలా ఒత్తిడిగా మారుతుంది. ఇల్లు ఉంటే భద్రత ఉంటుంది కానీ నెలనెలా డబ్బు ఒత్తిడి మాత్రం పెరుగుతుంది.
ఇప్పుడు మరో మార్గాన్ని పరిశీలిద్దాం. ఆ ఉద్యోగి దగ్గర ఉన్న రూ.15 లక్షలను పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) లో పెట్టుబడి పెట్టినట్లయితే… ఈ స్కీమ్‌లో ప్రస్తుతం సుమారుగా నెలకు రూ.10,000 వరకు వడ్డీ రావచ్చు (సుమారు అంచనా). అంటే ప్రతి నెల స్థిరమైన ఆదాయం వస్తుంది. ఆ వడ్డీని కుటుంబ ఖర్చులకు ఉపయోగించవచ్చు. లేదా ఈ రూ. 10 వేలను చిట్టీలు లేదా ఆర్డీ వంటి స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. అసలు పెట్టుబడి అలాగే సురక్షితంగా ఉంటుంది. వడ్డీ వస్తూనే ఉంటుంది. ఈ పరిస్థితిలో అతను అద్దె ఇంట్లో ఉంటూ కూడా ఆర్థికంగా కొంత స్థిరత్వాన్ని పొందవచ్చు. అదే కాకుండా భవిష్యత్తులో పిల్లల చదువుకు డబ్బు ఉపయోగించుకోవచ్చు. వారికి మంచి విద్యను అందిస్తే పిల్లల జీవితంలో స్థిరత్వం కూడా వస్తుంది. భవిష్యత్తులో మరింత పొదుపు చేసి తర్వాత ఇల్లు కొనుగోలు చేయవచ్చు
ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి ఇల్లు కొనడం తప్పు కాదు, పెట్టుబడి పెట్టడం కూడా తప్పు కాదు. కానీ పరిస్థితికి తగ్గట్టు నిర్ణయం తీసుకోవాలి. జీతం రూ.70,000 – రూ.80,000 కంటే ఎక్కువ ఉంటే ఇల్లు కొనడం మంచి నిర్ణయం అవుతుంది. EMI చెల్లించిన తర్వాత కూడా పొదుపు చేయగలిగితే, స్థిరమైన ఉద్యోగం ఉంటే అప్పుడు ఇల్లు కొనడం మంచిది.
అదే విధంగా జీతం పరిమితంగా ఉండి, కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉండం, పిల్లల చదువు ప్రధాన లక్ష్యంగా ఉంటే మాత్రం పెట్టుబడి పెట్టడం బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. మన తీసుకున్న ఉదాహరణలో చూస్తే రూ.50,000 జీతంతో రూ.20,000 EMI చాలా భారంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితిలో ముందుగా పెట్టుబడి పెట్టి ఆదాయం పెంచుకోవడం, తర్వాత ఆర్థిక స్థితి మెరుగుపడినప్పుడు ఇల్లు కొనడం మంచి నిర్ణయంగా భావించవచ్చు. మొత్తం మీద సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. కానీ ఆ కల కోసం ఆర్థిక భద్రతను కోల్పోవడం సరైన మార్గం కాదు.
ముందుగా పెట్టుబడులు పెంచి, ఆదాయ మార్గాలు పెంచుకుంటే భవిష్యత్తులో ఇల్లు కొనడం కూడా సులభం అవుతుంది, పిల్లల భవిష్యత్తు కూడా భద్రంగా ఉంటుంది. అందుకే నిర్ణయం తీసుకునే ముందు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. ఇప్పుడే ఇల్లు కొనాలా? లేక ముందుగా ఆర్థికంగా బలపడాలా? సరైన సమాధానం మీ పరిస్థితిని బట్టే ఉంటుంది.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. పెట్టుబడికి సంబంధించి ఆర్థిక నిపుణుల సూచనలు పాటించడమే మంచిది.