Instant Geyser: చలి తీవ్రత ఓ రేంజ్‌లో ఉంది. దీంతో చాలా మంది గీజర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వీటిని కొనుగోలు చేసేముందు కచ్చితంగా కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..
చలి విపరీతంగా పెరిగిన సమయంలో వేడి నీటి అవసరం ప్రతి ఇంటిలో పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇన్‌స్టంట్ గీజర్‌లు త్వరగా నీటిని వేడి చేయగలగడం వల్ల ప్రజలు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. చిన్న స్థలాల్లో సులభంగా అమర్చుకోవచ్చని కూడా అనేక కుటుంబాలు వీటికి మొగ్గు చూపుతున్నాయి.
25
సామర్థ్యం చూసుకోవడం అత్యంత ముఖ్యం
ఇన్‌స్టంట్ గీజర్‌లు తక్కువ నీటికి మాత్రమే అనుకూలంగా ఉంటాయి. పెద్ద కుటుంబాల్లో నిరంతర అవసరానికి ఇవి సరిపోవు. చిన్న బాత్రూమ్‌లు, సింక్‌లు, వంటగదిలో తక్షణ అవసరాలకు మాత్రమే ఇవి సరిగ్గా పనిచేస్తాయి. మీ ఇంట్లో రోజువారీ నీటి వినియోగం ఎక్కువగా ఉంటే, పెద్ద స్టోరేజ్ గీజర్ మోడల్ మంచిదై ఉంటుంది.
35
ఇవి నిర్లక్ష్యం చేస్తే సమస్యలు తప్పవు
ఇన్‌స్టంట్ గీజర్‌లు సాధారణంగా 3000–4500 వాట్స్ పరిధిలో లభిస్తాయి. వాటేజ్ ఎంత ఎక్కువైతే నీరు అంత వేగంగా వేడి అవుతుంది. కానీ విద్యుత్ వినియోగం కూడా అధికమవుతుంది. మీ ఇంట్లో పాత వైరింగ్ ఉంటే అధిక వాటేజ్ గీజర్ వలన ట్రిప్పింగ్, షాక్ ప్రమాదం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో తక్కువ వాటేజ్ మోడల్‌ను తీసుకోవడం ఉత్తమం.
అపార్ట్‌మెంట్లు, ఎత్తైన భవనాల్లో నీటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిని తట్టుకోలేని గీజర్‌లు లీకేజీ, పేలుడు ప్రమాదాలకు దారి తీస్తాయి. అందుకే అధిక ప్రెషర్‌ని మేనేజ్ చేసే మోడల్‌ను ఎంచుకోవాలి. అదేవిధంగా, థర్మల్ కట్-ఆఫ్, ప్రెషర్ రిలీజ్ వ్యవస్థ, ఓవర్‌హీట్ ప్రొటెక్షన్ వంటి భద్రతా ఫీచర్లను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. ఈ రక్షణలు ఉన్న మోడల్ కొంచెం ఖరీదైనా భవిష్యత్తులో మీకు ప్రమాదం తగ్గిస్తుంది.
55
నిర్మాణ నాణ్యత, ఇన్‌స్టాలేషన్, వారంటీ కూడా కీలకం
స్టీల్ లేదా రాగితో తయారై ఉన్న ట్యాంకులు ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. తక్కువ ధరలో వచ్చే మోడళ్లు ప్రారంభంలో బాగానే కనిపిస్తాయి కానీ కొద్ది రోజుల్లోనే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇన్‌స్టాలేషన్‌ను అనుభవం ఉన్న టెక్నీషియన్‌తో చేయించుకోవడం చాలా ముఖ్యం. తప్పుడు ఇన్‌స్టాలేషన్ వల్ల విద్యుత్ లోపాలు, నీటి లీకేజీకి కారణం అవుతుంది. అదేవిధంగా కనీసం రెండు సంవత్సరాల వారంటీ ఉన్న మోడల్‌ను ఎంచుకుంటే భవిష్యత్తులో రిపేర్ ఖర్చుల నుంచి తప్పించుకోవచ్చు.