
భారతీయ రైల్వేలో రోజుకు సుమారు 24 వేల నుంచి 25 వేల వరకు రైళ్లు నడుస్తాయి. వీటిలో దాదాపు 13,500 నుంచి 14,000 వరకు ప్యాసింజర్ రైళ్లు ఉంటాయి. వీటిలో సాధారణ రైళ్లు, ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, వందే భారత్, అమృత్ భారత్ వంటి రైళ్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి రోజుకు సుమారు 2 కోట్ల నుంచి 2.5 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయి. ప్రయాణికుల రైళ్లతో పాటు రోజుకు 11 వేలకుపైగా గూడ్స్ రైళ్లు కూడా నడుస్తాయి. వీటి ద్వారా బొగ్గు, సిమెంట్, ఇనుము, ఎరువులు, ధాన్యం వంటి కీలక సరుకులు దేశంలోని పరిశ్రమలు, విద్యుత్ కేంద్రాలు, మార్కెట్లకు చేరుతాయి.
భారతీయ రైల్వే వార్షిక ఆదాయం సుమారు రూ.2.74 లక్షల కోట్లు. అంటే సగటున రోజుకు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అయితే రైల్వే ఆదాయంలో ఎక్కువ భాగం ప్రయాణికుల టికెట్ల ద్వారా రాదు. గూడ్స్ రవాణానే ప్రధాన ఆదాయ వనరు. గూడ్స్ రవాణా ద్వారా వచ్చే ఆదాయం మొత్తం ఆదాయంలో సుమారు 60 నుంచి 62 శాతం వరకు ఉంటుంది. అంటే రోజుకు దాదాపు రూ.465 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇందులో బొగ్గు రవాణా ప్రధాన వాటా కలిగి ఉంటుంది. తర్వాత సిమెంట్, ఇనుము, ఎరువులు, ధాన్యం వంటి సరుకుల రవాణా ఉంటుంది. ప్రయాణికుల రైళ్ల ద్వారా రోజుకు సుమారు రూ.200 నుంచి రూ.232 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇది మొత్తం ఆదాయంలో దాదాపు 31 శాతం. మిగిలిన ఆదాయం పార్సిల్ సేవలు, ప్రకటనలు, స్క్రాప్ విక్రయాలు, లీజింగ్ వంటి ఇతర మార్గాల ద్వారా వస్తుంది.
ఇంత పెద్ద రైల్వే వ్యవస్థను నిర్వహించడానికి భారీగా ఖర్చు అవుతుంది. రోజువారీ నిర్వహణ ఖర్చు సుమారు రూ.690 నుంచి రూ.720 కోట్ల వరకు ఉంటుందని అంచనా. రైల్వేలో పనిచేస్తున్న 12 లక్షలకుపైగా ఉద్యోగుల జీతాలు పెద్ద ఖర్చుల్లో ఒకటి. ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వేతనాలపై భారీ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించే పెన్షన్లు కూడా రైల్వేకు పెద్ద ఖర్చుగా చెప్పొచ్చు. ఇవే కాకుండా రైళ్లను నడపడానికి అవసరమైన విద్యుత్, డీజిల్, ట్రాక్‌ల నిర్వహణ, రైళ్ల మరమ్మతులు, స్టేషన్ల నిర్వహణ, సిగ్నలింగ్ వ్యవస్థలు వంటి వాటిపై కూడా భారీగా ఖర్చు చేస్తుంది. ప్రస్తుతం బ్రాడ్‌గేజ్ నెట్‌వర్క్‌లో ఎక్కువ భాగం విద్యుదీకరణ పూర్తవడంతో విద్యుత్ వినియోగం మరింత కీలకంగా మారింది. భవిష్యత్తులో ఖర్చులు తగ్గించేందుకు రైల్వే సౌర విద్యుత్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై కూడా దృష్టి పెడుతోంది.
భారతీయ రైల్వే ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఆపరేటింగ్ రేషియో ఒక ముఖ్యమైన సూచిక. ఉదాహరణకు ఆపరేటింగ్ రేషియో 98.43 శాతం ఉంటే.. రైల్వే రూ.100 సంపాదించడానికి దాదాపు రూ.98.43 ఖర్చు చేస్తోందని అర్థం. అంటే ఆదాయం భారీగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా దాదాపు అదే స్థాయిలో ఉంటాయి. అందువల్ల రైల్వేను భారీ ఆదాయం వచ్చే సంస్థగా చెప్పొచ్చు కానీ.. భారీ లాభాలు ఆర్జించే వ్యాపారంగా చూడటం సరికాదు. ఆదాయంలో ఎక్కువ భాగం నిర్వహణ ఖర్చులకే వెళ్తుంది.
భారతీయ రైల్వే కేవలం వ్యాపార సంస్థగా పనిచేయదు. దేశంలోని సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో ప్రయాణ సౌకర్యం కల్పించడం కూడా దాని బాధ్యత. అందుకే కొన్ని ప్రయాణికుల రైళ్ల టికెట్ ధరలు తక్కువగా ఉంటాయి. లెక్కల ప్రకారం ఒక ప్రయాణికుడిని ఒక కిలోమీటర్ దూరం రైలులో తీసుకెళ్లడానికి రైల్వేకు సగటున రూ.1.38 ఖర్చవుతుంటే.. ప్రయాణికుడి నుంచి సగటున 73 పైసలు మాత్రమే వస్తున్నాయి. అంటే ప్రయాణికుల టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం కంటే వారికి అందించే సేవపై రైల్వే చేసే ఖర్చు ఎక్కువగా ఉంటుంది.