
భారతదేశంలో కరెన్సీ నోట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఒక సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం మనం వాడుతున్న 50, 100, 200, 500 రూపాయల కాగితం నోట్ల స్థానంలో కొత్త ప్లాస్టిక్ అంటే పాలిమర్ నోట్లను తీసుకురావడానికి ఆర్బీఐ ప్లాన్ చేస్తోంది.
దశాబ్దం క్రితం అనుకున్న ఈ ప్రాజెక్టును మళ్లీ తెరపైకి తెచ్చింది. దీని కోసం త్వరలోనే ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించబోతున్నట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. పాట్నా, ముంబైలలో జరిగిన గత రెండు ఆర్బీఐ బోర్డు సమావేశాలలో ఈ విషయంపై సీరియస్ చర్చ నడిచింది. మార్కెట్‌లో ఎక్కువగా నలిగిపోయే రూ.10, రూ.20 నోట్లతో ఈ టెస్టింగ్ మొదలుపెట్టే ఛాన్స్ ఉంది.
చాలామంది ప్లాస్టిక్ నోట్లు అనగానే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లాగా గట్టిగా ఉంటాయేమో అనుకుంటారు. కానీ అది తప్పు. ఇవి కాటన్ పేపర్‌కు బదులుగా పాలిమర్ అనే సన్నని, ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారవుతాయి. ఇవి చాలా తేలికగా ఉంటాయి. కాగితం నోట్ల లాగే వీటిని మడతపెట్టవచ్చు, జేబులో పెట్టుకోవచ్చు.
ఈ నోట్లకు మురికి అంటదు, త్వరగా చిరగవు, నీళ్లలో నానినా పాడవవు. అందుకే ఇవి చాలా కాలం మన్నుతాయి. అంతేకాదు, వీటిలో సీ-త్రూ విండోస్, మైక్రో ఆప్టిక్ హోలోగ్రామ్స్ లాంటి అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టొచ్చు. దీనివల్ల నకిలీ నోట్లను సృష్టించడం అస్సలు సాధ్యం కాదు.
ప్రస్తుతం దేశంలో కొత్త నోట్ల ప్రింటింగ్ ఖర్చులు, పాత నోట్ల రద్దు భారం ఆర్బీఐకి విపరీతంగా పెరిగిపోయాయి. బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం.. మార్చి 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణ ఖర్చు ఏకంగా రూ.6,372.8 కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాది ఇది రూ.5,101.4 కోట్లు మాత్రమే ఉండేది.
అలాగే, మార్కెట్లో బాగా పాడైపోయిన సుమారు 23.8 బిలియన్ నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుంది. ఇందులో రూ.500, రూ.100 నోట్లే ఎక్కువ. డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నా, క్యాష్ వాడకం కూడా రికార్డ్ స్థాయిలో రూ.42.86 ట్రిలియన్లకు చేరింది. అందుకే, ఎక్కువ కాలం మన్చే ప్లాస్టిక్ నోట్లు తేవడం వల్ల ప్రింటింగ్ ఖర్చులు తగ్గుతాయని ఆర్బీఐ భావిస్తోంది.
ఇండియాలో ప్లాస్టిక్ నోట్లను టెస్ట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2012లోనే అప్పటి ప్రభుత్వం రూ.10 విలువైన 1 బిలియన్ ప్లాస్టిక్ నోట్లను దేశంలోని ఐదు నగరాల్లో (కొచ్చి, మైసూర్, జైపూర్, భువనేశ్వర్, షిమ్లా) పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెట్టింది. వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో ఇవి ఎలా పనిచేస్తాయో చూడటమే అప్పటి లక్ష్యం.
అయితే, అప్పట్లో ఏటీఎం మిషన్లు ఈ నోట్లను సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోయాయి. టెక్నికల్ సమస్యల వల్ల ఆ ప్రాజెక్ట్‌ను అప్పట్లో పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా అప్‌డేట్ అయింది. ప్లాస్టిక్ నోట్లను కూడా ఈజీగా ప్రాసెస్ చేసే ఏటీఎం సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వచ్చింది. అందుకే ఈసారి ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందని ఆర్బీఐ నమ్ముతోంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 60కి పైగా దేశాలు ప్లాస్టిక్ నోట్లను వాడుతున్నాయి. 1988లో ఆస్ట్రేలియా మొదటిసారిగా పది డాలర్ల ప్లాస్టిక్ నోటును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత కెనడా, యూకే, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, రొమేనియా, న్యూజిలాండ్, వియత్నాం వంటి దేశాలు పాలిమర్ కరెన్సీని పూర్తిగా లేదా పాక్షికంగా వాడుతున్నాయి. అయితే, ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ కరెన్సీ అయిన అమెరికన్ డాలర్ మాత్రం ఇంకా ప్లాస్టిక్‌కు మారలేదు.
ప్లాస్టిక్ నోట్లు రాగానే మార్కెట్లో ఉన్న పాత కాగితం నోట్లన్నీ వెంటనే రద్దయిపోవు. ఆర్బీఐ అన్ని నోట్లను ఒకేసారి మార్చడం లేదు. మొదట రూ.10, రూ.20 నోట్లతో ట్రయల్స్ నిర్వహిస్తుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయి, ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తేనే పెద్ద నోట్ల వైపు అడుగులు వేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది ఏటీఎంలను కొత్త నోట్లకు అనుకూలంగా అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే ప్లాస్టిక్ నోట్లను వాడుతున్న దేశాల సాంకేతిక నిపుణులతో చర్చలు జరుగుతున్నాయి. సో, పాత నోట్లు ఇప్పుడప్పుడే బ్యాన్ కావు, కాకపోతే ఫ్యూచర్‌లో మాత్రం మన జేబుల్లో ప్లాస్టిక్ నోట్లు ఉంటాయనేది ఖాయంగా కనిపిస్తోంది.