బ్యాంకులో డబ్బులు డిపాజిట్‌ చేస్తే.. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసులు వస్తాయా.? అసలు విషయం ఏంటంటే..

First Published | Jan 6, 2025, 10:03 AM IST

బ్యాంకులో ప్రతి లావాదేవీకీ ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితిని దాటితే, ఆదాయపు పన్ను శాఖ నేరుగా ఖాతాదారులకు నోటీసులు పంపే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఆ పరిమితి ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.. 

డిజిటల్ ఇండియా కాలంలో కూడా చాలా మంది నగదు లావాదేవీలు చేయడానికి ఇష్టపడతారు. బ్యాంకులకు వెళ్లి డబ్బులు డిపాజిట్ చేసే వారు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. అయితే చిన్న చిన్న లావాదేవీలైతే ఎలాంటి సమస్య ఉండదు కానీ పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేస్తే మాత్రం సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 

బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బు జమ చేసే వ్యక్తులు ఆదాయపు పన్ను శాఖ రాడార్ కిందికి వస్తారు. ఇంతకీ ఎంత మొత్తంలో డబ్బులు జమ చేసే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

డబ్బులు డిపాజిట్ కి సంబంధించి.. 

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు జమ చేస్తే, ఆ సమాచారం ఆదాయపు పన్ను శాఖకు చేరుతుంది. ఈ పరిమితికి మించి ఎక్కువ డబ్బు జమ చేస్తే, ఆ మొత్తానికి సంబంధించి ఆదాయ వనరు ఏంటన్న ప్రశ్న ఆదాయపను పన్ను శాఖ నుంచి వస్తుంది. 


ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ లో కూడా.. 

ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు పైగా బ్యాంకు ఖాతాలో జమ చేసినప్పుడు నోటీసులు వచ్చినట్లే. ఎఫ్ డీ అకౌంట్ కి కూడా ఇది వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా ఎఫ్ డీ అకౌంట్స్ లో రూ. 10 లక్షలకు పైగా జమ చేస్తే, ఆదాయపు శాఖ ఆ మొత్తానికి సంబంధించి వివరణ కోరే అవకాశం ఉంటుంది. 

పెద్ద ఆస్తి లావాదేవీలు

ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీ చేస్తే, ఆస్తి రిజిస్ట్రార్ తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తారు. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ అడిగే అవకాశాలు ఉంటాయి. 

క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు

మీ క్రెడిట్ కార్డ్ బిల్లు రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఉండి దానిని తిరిగి చెల్లించిన సమయంలో కూడా ఆ డబ్బుకు సోర్స్ ఏంటన్న ప్రశ్నను అధికారులు అడిగే అవకాశం ఉంది.  అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డులకు రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెల్లిస్తే, ఆ డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ అడిగే అవకాశం ఉంటుంది. 

షేర్లు, మ్యూచువల్ ఫండ్స్..

షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్లు లేదా బాండ్లు కొనుగోలు చేయడానికి అధిక మొత్తంలో నగదు ఉపయోగించినా ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందుతుంది. ఒక వ్యక్తి రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీ చేస్తే, ఆ సమాచారం ఆదాయపు పన్ను శాఖకు చేరుతుంది. అలాంటప్పుడు, మీరు డబ్బును ఎక్కడి నుండి తెచ్చారో ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. 

Latest Videos

click me!