House Construction: వంద గజాల్లో కూడా చక్కగా ఇల్లు కట్టుకోవచ్చు. ఒక హాలు, రెండు గదులు, కిచెన్ ఉన్న ఒంటిని కట్టేందుకు ఎంత ఖర్చవుతుందో తెలుసా? ఇక్కడ మేము వివరంగా ఇచ్చాము.. చదివి తెలుసుకోండి.
సొంతిల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్కరి అతిపెద్ద కల. అయితే పెరుగుతున్న స్థలం ధరలు, నిర్మాణ సామగ్రి ధరలు చూసి సామాన్యుడు అడుగు ముందుకు వేయలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబాలకు 100 గజాలు అంటే సుమారు 900 చదరపు అడుగులు స్థలంలో ఒక సౌకర్యవంతమైన ఇల్లు కట్టేందుకు ఎంతో ఖర్చవుతుందో ఇక్కడ ఒక అంచనా వేసి ఇచ్చాము. 100 గజాల స్థలంలో కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా విశాలమైన రెండు బెడ్‌రూమ్‌ల సింగిల్ అంతస్తు ఇల్లు నిర్మించుకోవచ్చు. ప్రస్తుతం నిర్మాణ నాణ్యతను బట్టి చదరపు అడుగుకు సాధారణ మెటీరియల్‌తో అయితే రూ.1,100 నుండి రూ.1,200 వరకు ఖర్చవుతుంది. అదే మీరు నాణ్యమైన బి క్లాస్ మెటీరియల్ వాడితే రూ.1,300 నుండి రూ.1,600 వరకు ఖర్చవుతుంది. ఈ లెక్కన 100 గజాల స్థలంలో ఇంటిని నిర్మించడానికి సుమారు రూ.11 లక్షల నుండి రూ.14.4 లక్షల వరకు అవసరమవుతుంది.
23
ఏ మెటీరియల్ కు ఎంతవుతుంది?
ఇంటి నిర్మాణంలో అత్యంత భాగం నిర్మాణ సామగ్రికే ఖర్చువుతంది. పక్కా ప్రణాళికతో మెటీరియల్ కొంటే కాంట్రాక్టర్ల చేతిలో మోసపోకుండా మన డబ్బును ఆదా చేసుకోవచ్చు. 100 గజాల ఇంటి నిర్మాణానికి అయ్యే ప్రధాన సామగ్రి వివరాలను చూస్త ఒక అంతస్తు ఇంటి నిర్మాణానికి సుమారు 400 నుండి 450 సిమెంట్ బస్తాలు అవసరమవుతాయి. దీనికి రూ.1.7 లక్షల నుండి రూ.2.0 లక్షల వరకు ఖర్చవుతుంది. పిల్లర్లు, స్లాబ్ పటిష్టంగా ఉండడం కోసం దాదాపు 3 టన్నుల ఐరన్ అవసరం పడుతుంది. దీనిని రూ.2.2 లక్షల నుండి రూ.2.6 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇక గోడల నిర్మాణానికి 20,000 నుండి 24,000 వరకు ఇటుకలు అవసరమవుతాయి. వీటి ధర రూ.1.4 లక్షల నుండి రూ.1.8 లక్షల మధ్యలో ఉంటుంది. వీటితో పాటు కాంక్రీట్, ప్లాస్టరింగ్ కోసం వాడే ఇసుక, కంకర కోసం మరో రూ.1.2 లక్షల నుండి రూ.1.5 లక్షల వరకు కేటాయించాల్సి ఉంటుంది.
33
మేస్త్రీ, కూలీల ఖర్చు
కేవలం సామగ్రి కోసం మాత్రమే కాకుండా మేస్త్రీలు, కూలీల ఖర్చులు కూడా లెక్కించుకోవాలి. సాధారణంగా మొత్తం నిర్మాణ ఖర్చులో దాదాపు 25 శాతం వరకు కూలి (లేబర్) ఖర్చులకే సరిపోతుంది. ప్రస్తుతం 900 చదరపు అడుగుల వైశాల్యానికి కాంట్రాక్టర్లు చదరపు అడుగుకు రూ.220 నుండి రూ.260 వరకు ఛార్జ్ చేస్తున్నారు. అంటే లేబర్ చార్జీలు మొత్తం రూ.2.0 లక్షల నుండి రూ.2.3 లక్షల వరకు అవుతాయి. ఇల్లు రూపుదిద్దుకున్న తర్వాత ఫినీషింగ్ పనులైన ప్లంబింగ్, వైరింగ్, నేలపై టైల్స్ వేయడం, గోడలకు రంగులు వేయడం వంటి పనుల కోసం వేరుగా రూ.2.0 లక్షల నుండి రూ.2.4 లక్షల వరకు బడ్జెట్ సిద్ధం చేసుకోవాలి. ఈ ఖర్చులన్నింటినీ కలుపుకుంటే 100 గజాల ప్లాట్‌లో పూర్తిస్థాయిలో ఒక అందమైన సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ప్రాథమికంగా తక్కువలో తక్కువ 11 లక్షల రూపాయల నుంచి 14 లక్షల దాకా ఖర్చవుతుంది.