
భారీ హోమ్ లోన్ EMIలు చెల్లించడం కంటే తమ ఆర్థిక స్వేచ్ఛను కాపాడుకోవడం మంచిదని యువత భావిస్తోంది. ఆస్తి కొనుగోలు ప్లాట్‌ఫామ్ నోబ్రోకర్ (NoBroker) వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం 46 శాతం మంది అద్దెదారులు దీర్ఘకాలం అద్దె ఇంట్లోనే ఉండటమే మంచి నిర్ణయమని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. దీంతో హోమ్ లోన్ తీసుకుంటే ప్రతి నెల చెల్లించాల్సిన EMIలు కూడా భారీగా ఉంటున్నాయి. చాలా నగరాల్లో అదే ఇంటికి చెల్లించే అద్దెతో పోలిస్తే EMI రెండు రెట్లకు పైగా ఉంటుంది.
గత ఐదేళ్లలో గురుగ్రామ్‌లో EMI-టు-రెంట్ నిష్పత్తి 1.86 నుంచి 2.68కి పెరిగింది. బెంగళూరు (2.38), హైదరాబాద్ (2.47), ముంబై (2.19)లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఉదాహరణకు.. నెలకు రూ.50 వేల అద్దె ఉండే ఇంటిని కొనుగోలు చేస్తే EMI రూ.లక్షకు పైగానే ఉండే అవకాశం ఉంది. అందుకే యువత డౌన్ పేమెంట్, EMIల కోసం డబ్బు ఖర్చు చేయడం కంటే అదే మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లు, షేర్ మార్కెట్ వంటి పెట్టుబడుల్లో పెట్టడానికి మొగ్గు చూపుతోంది.
చాలా మంది యువ ఉద్యోగులు ఇల్లు కొనుగోలు చేస్తే 20 నుంచి 25 సంవత్సరాల పాటు భారీ EMIలు చెల్లించాల్సి వస్తుందని భావిస్తున్నారు. దీంతో ఉద్యోగ మార్పులు, నగర మార్పులు చేయడం కూడా కష్టమవుతుందని చెబుతున్నారు. బెంగళూరుకు చెందిన 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అభిప్రాయం ప్రకారం.. ప్రతి నెల లక్ష రూపాయలు EMIగా చెల్లించడం కంటే అదే డబ్బును పెట్టుబడిగా పెట్టడం మంచిది. అవసరమైతే ఉద్యోగం కోసం మరో నగరానికి వెళ్లే స్వేచ్ఛ కూడా ఉంటుందని ఆయన అంటున్నారు.
ఇప్పట్లో అద్దె ఇంట్లో ఉండటం అంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల కాదు. తమకు నచ్చిన జీవనశైలిని కొనసాగించేందుకు యువతే స్వచ్ఛందంగా అద్దె ఇళ్లను ఎంచుకుంటోంది. పెద్ద ఇళ్లు, గేటెడ్ కమ్యూనిటీలు, పూర్తిగా ఫర్నిష్డ్ అపార్ట్‌మెంట్లు, ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో ఉండేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. బెంగళూరులో 3BHK ఇళ్లకు డిమాండ్ సరఫరాను మించిపోయింది. అలాగే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR)లో నెలకు రూ.40 వేలకుపైగా అద్దె ఉన్న ఇళ్లకే మొత్తం డిమాండ్‌లో దాదాపు మూడో వంతు ఉందని నోబ్రోకర్ డేటా చెబుతోంది.
ప్రస్తుతం యువత తరచూ ఉద్యోగాలు మారుతోంది. హైబ్రిడ్ వర్క్ కల్చర్ పెరగడం, భవిష్యత్తులో ఏ నగరంలో స్థిరపడతామో స్పష్టత లేకపోవడం కూడా ఇల్లు కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేయడానికి కారణమవుతోంది. భవిష్యత్తు గురించి స్పష్టత వచ్చే వరకు శాశ్వత ఆస్తిలో పెట్టుబడి పెట్టకూడదని చాలా మంది భావిస్తున్నారు. దీంతో అద్దె ఇంట్లో ఉండడం వారికి మరింత సౌకర్యంగా అనిపిస్తోంది.
యువతలో పెరుగుతున్న ఈ ధోరణి దేశంలోని ప్రధాన నగరాల అద్దె మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతోంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో వార్షిక అద్దెలు 11 శాతం పెరిగాయి. చెన్నైలో 8 శాతం, బెంగళూరులో 7 శాతం పెరుగుదల నమోదైంది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో కూడా అద్దెలు సుమారు 3 శాతం పెరిగాయి.
25-34 ఏళ్ల వయస్సు ఉన్న వారిలో 53 శాతం మంది, 35-44 ఏళ్ల వయస్సు ఉన్న వారిలో 48 శాతం మంది భవిష్యత్తులో కూడా అద్దె ఇంట్లోనే ఉండాలని భావిస్తున్నట్లు నోబ్రోకర్ సర్వే తెలిపింది. అంటే, సొంత ఇల్లు అనేది ఇప్పటికీ చాలా మందికి ఒక లక్ష్యమే అయినప్పటికీ, ఆర్థిక స్వేచ్ఛ, పెట్టుబడుల ద్వారా సంపద సృష్టించడం, ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా నగరాలు మార్చుకునే సౌలభ్యం వంటి కారణాలతో యువతలో అద్దె ఇంట్లో నివసించే ధోరణి వేగంగా పెరుగుతోంది.
అయితే యువత ఆలోచనపై పలు భిన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ని రోజులు అద్దెకు ఉన్నా సొంతిల్లు లేకపోవడం జీవితంలో ఒక లోటు అని అంటున్నారు. ముఖ్యంగా జీవితం చిరమాంకంలో సొంతిల్లు లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయని పెద్దలు భావిస్తుంటారు. అందుకోసమే పేద వాడి నుంచి ధనవంతుడి వరకు ప్రతీ ఒక్కరూ తనకంటూ ఓ సొంతిల్లు కోరుకుంటారు. ఏది ఏమైనా ప్రస్తుత యువత ఆలోచన ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది.