జీఎస్టీ అంటే వస్తువులు, సేవల పన్ను. భారతదేశంలో వస్తువులు, సేవలపై విధించే ఒక పరోక్ష పన్ను. గతంలో ఉన్న వివిధ రకాలైన కేంద్ర, రాష్ట్ర పన్నులను ఒకే పన్ను విధానంలోకి తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం.
భారత్ లో 2017లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) అమల్లోకి వచ్చింది. 1947 తర్వాత అతిపెద్ద పన్ను సంస్కరణగా ఇది గుర్తింపు పొందింది. "ఒక దేశం, ఒక పన్ను, ఒక మార్కెట్" అనే సూత్రంపై ఇది ఆధారపడి ఉంది.
జీఎస్టీ నాలుగు స్లాబ్‌లతో అమలు అవుతోంది, అవి 5%, 12%, 18%, 28%. కొన్ని విలాసవంతమైన వస్తువులపై 28% పైన అదనపు పన్ను వసూలు చేశారు. ఉదాహరణకు, సిగరెట్లు, లగ్జరీ కార్లు, హైఎండ్ బైకులు. కానీ ఈ వ్యవస్థ క్లిష్టంగా ఉందని విమర్శలు వచ్చాయి.
ఉదాహరణకు.. ప్రీ-ప్యాకేజ్డ్ సాల్టెడ్ పాప్‌కార్న్‌పై 12% పన్ను విధిస్తుండగా, కారామెల్‌కు 18% పన్ను విధిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే సాధారణ చపాతీకి 5% పన్ను ఉంటే, పొరలు ఉన్న పరాటాకు 18% పన్ను విధించారు. ఇలా పలు విషయాల్లో జీఎస్టీ నాలుగు స్లాబ్‌ల అంశంపై విమర్శలు వచ్చాయి.