
దేశవ్యాప్తంగా కొత్త GST 2.0 విధానం సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి అమల్లోకి వచ్చింది. దీని వల్ల ప్రతి కుటుంబం నెలవారీ ఖర్చుల్లో గణనీయమైన ఆదా చేసుకోనుంది. ఇప్పటివరకు ఉన్న 12% , 28% పన్ను స్లాబులను రద్దు చేసి, కేవలం రెండు ప్రధాన శ్లాబులను ప్రవేశపెట్టారు. అవి 5% (నిత్యావసరాలు), 18% (ప్రామాణిక వస్తువులు).
కొత్త జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చిన తర్వాత సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్ట్ వంటి నిత్యావసర వస్తువులతో పాటు, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి గృహోపకరణాల ధరలు తగ్గనున్నాయి. మరోవైపు, ఆరోగ్యం, జీవిత బీమా ప్రీమియంలపై ఉన్న 18% పన్నును పూర్తిగా తొలగించారు. అయితే, విలాసవంతమైన వస్తువులు, పొగాకు, శీతల పానీయాలపై కొత్తగా 40% పన్ను విధించడంతో వాటి ధరలు పెరుగుతాయి.
కొత్త జీఎస్టీ మార్పుల వల్ల నెలవారీ ఖర్చుల్లో సాధారణ కుటుంబాలకు గణనీయమైన ఆదా లభిస్తుంది. దేశంలోని కుటుంబాలకు ప్రత్యక్షంగానే ఎంతో ప్రయోజనం కలగనుంది. ఉదాహరణకు..
ముందుగా 12%-18% పన్ను ఉండగా, ఇప్పుడు కేవలం 5%. రూ. 2,000 విలువైన వస్తువులపై నెలకు రూ. 160 వరకు ఆదా. ఎలాగంటే.. పాత జీఎస్టీలో సబ్బులు, హెయిర్ ఆయిల్, షాంపూలు, టూత్‌పేస్ట్ వంటి వస్తువులపై 18% పన్ను ఉండేది. ప్యాక్ చేసిన బిస్కెట్లు, పాస్తా వంటివాటిపై 12% లేదా 18% పన్ను ఉండేది.
కొత్త విధానంలో ఈ వస్తువులన్నీ ఇప్పుడు 5% శ్లాబులోకి వస్తాయి. కాబట్టి నెలకు రూ.2,000 విలువైన ఈ వస్తువులు కొనే కుటుంబానికి, పన్ను భారం సగటున 13% (రూ. 260) నుంచి 5% (రూ. 100)కి తగ్గుతుంది. అంటే, నెలకు సుమారు రూ. 160 వరకు ఆదా అవుతుంది.
ప్రీమియంలపై 18% పన్ను రద్దు. రూ. 2,000 ప్రీమియం చెల్లించే కుటుంబానికి నెలకు రూ. 360 నేరుగా ఆదా అవుతుంది. ఎలాగంటే, పాత జీఎస్టీ ప్రకారం హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంలపై 18% జీఎస్టీ ఉండేది. అయితే, కొత్త జీఎస్టీ 2.0లో ఈ ప్రీమియంలపై పన్నును పూర్తిగా (0%) మినహాయించారు. అంటే ఒక కుటుంబం నెలకు రూ. 2,000 ప్రీమియం చెల్లిస్తుంటే, ఇదివరకు రూ. 360 పన్ను కట్టేవారు. ఇప్పుడు ఆ పన్ను మొత్తంగా లేదు కాబట్టి నెలకు నేరుగా రూ. 360 ఆదా అవుతుంది.
గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ పై ముందు జీఎస్టీ 28% ఉండగా, ఇప్పుడు 18%గా మార్చారు. రూ. 30,000 విలువైన ఫ్రిజ్‌పై రూ. 3,000 వరకు ఆదా అవుతుంది. ఎలాగంటే.. టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు వంటి వాటిపై పాత జీఎస్టీలో 28% పన్ను ఉండేది. జీఎస్టీ 2.0లో ఈ వస్తువులను 18% శ్లాబులోకి మార్చారు. మీరు రూ. 30,000 విలువైన ఫ్రిజ్ కొంటే, పన్ను భారం రూ. 8,400 నుంచి రూ. 5,400కి తగ్గుతుంది. అంటే, ఒకే వస్తువుపై రూ. 3,000 ఆదా అవుతుంది.
చిన్న కార్లపై ముందుగా 28% పన్ను ఉండగా, ఇప్పుడు 18%గా మార్చారు. రూ. 6 లక్షల కారుపై రూ. 60,000 వరకు తగ్గింపు పొందవచ్చు. 1200cc కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న చిన్న కార్లపై 28% పన్ను ఉండేది. కొత్త జీఎస్టీ 2.0లో వీటిని 18% శ్లాబులోకి తీసుకువచ్చారు. ఉదాహారణకు మీరు రూ. 6 లక్షల విలువైన కారుపై పన్ను రూ. 1,68,000 నుంచి రూ. 1,08,000కి తగ్గుతుంది. అంటే, కారు కొనుగోలుపై నేరుగా రూ. 60,000 ఆదా అవుతుంది.
జీఎస్టీ 2.0తో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి నెలవారీగా ఆదా ఇలా అవుతుంది:
• కిరాణా & వ్యక్తిగత సంరక్షణ వస్తువులు: రూ. 175
• హెల్త్ & లైఫ్ ఇన్సూరెన్స్: రూ. 360
• ఇతర ఖర్చులు (ఫుట్‌వేర్, స్టేషనరీ): రూ. 70
మొత్తం నెలవారీ ఆదా: సుమారు రూ. 605
అంటే, ఏ పెద్ద వస్తువు కొనకపోయినా, సంవత్సరానికి రూ. 7,200 వరకు ఆదా సాధ్యమవుతుంది. అలాగే, దీనికి ఆదాయపు పన్నులో ఇచ్చిన రాయితీలు కూడా కలిపితే, ప్రజల చేతుల్లో మిగిలే డబ్బు మరింత పెరుగుతుంది.
ఇప్పటి వరకు ఉన్న ఐదు స్లాబులు (0%, 5%, 12%, 18%, 28%) వ్యాపారులకు సమస్యలు, వివాదాలు తెచ్చాయి. అలాగే, ప్రజలకు కొన్ని భారంగా కూడా మారాయి. వాటిని తగ్గించి, పన్ను వ్యవస్థను సరళతరం చేయడమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చారు. అంతేకాకుండా, పండుగల సీజన్‌కు ముందే వినియోగాన్ని పెంచడం, ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.