Gold: ఊర్లలో స్వర్ణకారుల దుకాణాల ముందు ఉండే మురికి కాలువల్లో కొందరు జల్లెడ పట్టే వ్యక్తులను చూసే ఉంటాం. ఇంతకీ వారు అలా ఎందుకు చేస్తుంటారు.? అసలు దాంట్లో వారికి ఏం లభిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా.?
చాలామంది గమనించే ఉంటారు. కొన్ని స్వర్ణకారుల దుకాణాల బయట నీటి కాలువల్లో కొందరు వ్యక్తులు జల్లెడ పట్టుకుని మట్టిని వడకడుతుంటారు. చూసేవాళ్లకు ఇది వింతగా అనిపిస్తుంది. “ఇక్కడ బంగారం ఏం ఉంటుంది?” అనే సందేహం సహజంగా వస్తుంది. కానీ ఈ దృశ్యం వెనుక ఓ నిజమైన కథ దాగి ఉంది.
25
నిజంగానే బంగారం దొరుకుతుందా?
అవును… కొన్నిసార్లు నిజంగానే బంగారం దొరుకుతుంది. అది పెద్ద ముక్కలుగా కాదు. సూక్ష్మమైన రేణువుల రూపంలో ఉంటుంది. రోజూ బంగారు ఆభరణాలు తయారు చేసే సమయంలో చిన్న చిన్న కణాలు నేలపై పడతాయి. అవి నీటితో కలిసి కాలువల్లోకి చేరతాయి. కాలక్రమంలో అవి మట్టిలో కలిసిపోతాయి. అదే మట్టిని జల్లెడతో వడకడితే బంగారు రేణువులు కనిపించే అవకాశం ఉంటుంది.
35
ఆ బంగారం ఎలా కాలువల్లోకి వస్తుంది?
స్వర్ణకారుల షాపుల్లో పాలిషింగ్, కటింగ్, గ్రైండింగ్ పనులు జరుగుతాయి. ఈ ప్రక్రియలో బంగారం తరుగులు, పొడి రూపంలో బయటకు వస్తాయి. షాపులు శుభ్రం చేసే సమయంలో ఆ ధూళి నీటితో బయటకు వెళ్లిపోతుంది. అదే నీరు కాలువల్లో చేరుతుంది. ఈ విధంగా బంగారం మెల్లగా కాలువ మట్టిలో చేరుతుంది.
ఈ పనిలో అనుభవం కీలకం. సాధారణ మట్టిని కాదు, బరువుగా ఉన్న మట్టిని మాత్రమే ఎంపిక చేస్తారు. నీటిలో మట్టిని జల్లెడలో ఊపుతూ వడకడతారు. తేలికపాటి మట్టి బయటకు వెళ్లిపోతుంది. బరువైన పదార్థాలు జల్లెడలో మిగులుతాయి. అందులో చిన్న చిన్న బంగారు కణాలు కనిపిస్తే వాటిని వేరు చేసి దాచుకుంటారు. ఇది ఓ రకమైన సహనం అవసరమైన పని.
55
ఇది లాభదాయకమా? లేక కేవలం ఆశేనా?
రోజూ ఈ పని చేసినా ప్రతి రోజూ బంగారం దొరుకుతుందనే గ్యారంటీ లేదు. కొన్ని రోజులు ఏమీ దొరకకపోవచ్చు. మరికొన్ని రోజులు మాత్రం చిన్న మొత్తంలో బంగారం చేతికి వస్తుంది. ఎక్కువగా పేద వర్గానికి చెందినవాళ్లు, అనుభవం ఉన్నవాళ్లు ఈ పనిలో ఉంటారు. ఇది పెద్ద ఆదాయం ఇచ్చే పని కాదు. అయినా ఆశతో, అనుభవంతో ఈ ప్రయత్నం చేస్తుంటారు. అయితే బంగారం ధర విపరీతంగా పెరిగిన ప్రస్తుత రోజుల్లో ఎంత దొరికినా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది.