బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా పైపైకి కదులుతున్న పసిడి రేట్లు.. ఇప్పుడు ఒక్కసారిగా భారీ జంప్ చేశాయి. ఒకేరోజులోనే 10 గ్రాముల బంగారం ధర రూ.3 వేలకు పైగా పెరగడంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. మరోవైపు వెండి ధర కూడా కిలోకు ఏకంగా రూ.10 వేలు పెరిగింది.
దేశీయ బులియన్ మార్కెట్లో మంగళవారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,130కి చేరింది. సోమవారంతో పోలిస్తే ఏకంగా రూ.3,160 పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,42,200గా నమోదైంది. ఈ ధరలోనూ ఒక్కరోజులో రూ.2,900 పెరుగుదల కనిపించింది.
బంగారం మాత్రమే కాదు.. వెండి కూడా భారీగా దూసుకెళ్లింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర నిన్న రూ.2.50 లక్షలుగా ఉండగా.. మంగళవారం నాటికి రూ.2.60 లక్షలకు చేరింది. అంటే ఒక్కరోజులోనే రూ.10 వేల పెరుగుదల నమోదైంది. చెన్నైలో కిలో వెండి రూ.2.60 లక్షలు, బెంగళూరులో రూ.2.55 లక్షల వద్ద కొనసాగుతోంది.