Gold Silver Price Crash: అమెరికాలో ముదురుతున్న ద్రవ్యోల్బణం..కుదేలవుతున్న పసిడి, వెండి

Published : Nov 19, 2026, 11:01 AM IST

Gold Silver Price Crash: బంగారం, వెండి రెండో రోజు పాతాళానికి పడిపోయాయి. ఒక్కరోజులోనే తులంపై రూ.2,570 మేర కుప్పకూలగా..వెండి కిలోపై రూ.5,000 దిగొచ్చింది. ధరలు ఇప్పుడు మరింత కుదేలవుతున్నాయి. అసలు మార్కెట్లో ఏం జరుగుతోంది? పతనానికి కారణాలేంటి?

PREV
14
పసిడి ప్రియులకు మరోసారి తీపికబురు

బంగారం, వెండి కొనాలనుకునే వారికి మార్కెట్ మరోసారి తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా భారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి, వెండి ధరలు వరుసగా కుదేలవుతున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలో నమోదైన తగ్గుదల కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. తులంపై ఏకంగా రూ.2,500కు పైగా తగ్గడం విశేషం. వెండి కూడా అదే బాటలో పయనిస్తూ కిలోపై రూ.5 వేల మేర దిగొచ్చింది.

24
రూ.1,30,690కు చేరిన బంగారం

ముందుగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.2,570 తగ్గింది. దీంతో ప్రస్తుతం రూ.1,30,690 వద్ద కొనసాగుతోంది. అంటే ఒక్కరోజులోనే పది గ్రాముల పసిడిపై భారీగా ధర తగ్గిందన్నమాట. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా పడిపోయింది. 10 గ్రాములపై రూ.2,350 తగ్గడంతో ప్రస్తుతం రూ.1,19,800కు చేరింది. బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఈ తగ్గుదల కొంత ఊరటనిచ్చే అంశమే.

ఇక వెండి విషయానికి వస్తే.. ఈ లోహం ధరలోనూ తగ్గుదల కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలో కిలో వెండి ధర రూ.4 లక్షల మార్కును తాకి సంచలనం సృష్టించింది. అయితే ఆ గరిష్ఠ స్థాయుల నుంచి ఇప్పుడు భారీగా వెనక్కి వచ్చింది. తాజాగా కిలో వెండిపై మరో రూ.5,000 తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం రూ.1,80,000 వద్ద కొనసాగుతోంది.

34
అసలు బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోతున్నాయి?

ఈ ధరల పతనం వెనుక అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు కీలకంగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందనే ఆందోళనలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ధరల పెరుగుదలను నియంత్రించేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో కఠిన వైఖరి అవలంబించవచ్చనే అంచనాలు పెరిగాయి.

దీంతో అమెరికా ప్రభుత్వ బాండ్లపై రాబడులు (ట్రెజరీ ఈల్డ్స్) పెరుగుతున్నాయి. సాధారణంగా బంగారం, వెండి నుంచి పెట్టుబడిదారులకు వడ్డీ ఆదాయం లభించదు. అదే సమయంలో ప్రభుత్వ బాండ్లపై రాబడులు పెరిగితే పెట్టుబడిదారులు వాటివైపు మొగ్గు చూపుతారు. ఫలితంగా పసిడి, వెండి వంటి విలువైన లోహాలపై పెట్టుబడుల ఆకర్షణ తగ్గుతుంది. అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు దిగొస్తాయి.

వెండి ధర పతనానికి మరో కారణం పారిశ్రామిక రంగంలో డిమాండ్ తగ్గడం. ముఖ్యంగా చైనాలో సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగాల్లో మందగమనంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిశ్రమల్లో వెండిని పెద్ద మొత్తంలో ఉపయోగిస్తారు. తయారీ కార్యకలాపాలు మందగిస్తే వెండికి డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇది కూడా ధరలపై ప్రభావం చూపుతోంది.

44
ఇప్పుడు కొనాలా? ఇంకా తగ్గుతాయా?

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గినప్పటికీ.. ఇక్కడితో పతనం ఆగిపోతుందని చెప్పలేం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు, డాలర్ విలువ, అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడుల కదలికలు రానున్న రోజుల్లో ధరలను ప్రభావితం చేయనున్నాయి.

అయితే అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటే మళ్లీ ధరలు పుంజుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఆభరణాలు కొనుగోలు చేసేవారు ప్రస్తుత ధరలతో పాటు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పెట్టుబడి పెట్టాలనుకునేవారు మాత్రం మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories