భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన సీటీఐ

Published : Nov 22, 2026, 01:40 PM IST

Gold Price: అవసరం లేకపోతే కొంతకాలం పాటు బంగారం కొనుగోలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞ‌ప్తి చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. ఈ విష‌యంపై ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపింది.

PREV
14
మోదీ సూచనతో కొనుగోళ్లకు బ్రేక్.. సీటీఐ ప్రశంసలు

బంగారం కొనుగోళ్ల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ముందుచూపుతో వ్యవహరించారని సీటీఐ ఛైర్మన్ బ్రిజేశ్ గొయల్ అభిప్రాయపడ్డారు. అత్యవసరమైతే తప్ప బంగారం కొనవద్దన్న ప్రధాని సూచన సామాన్య ప్రజలతో పాటు నగల వ్యాపారులు, పెట్టుబడిదారులకు కూడా ప్రయోజనం చేకూర్చిందని పేర్కొన్నారు. ధరలు గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేయకుండా చాలామంది వెనక్కి తగ్గారని తెలిపారు. అప్పట్లో ప్రధాని సూచనను పట్టించుకోకుండా బంగారం కొనుగోలు చేసినవారు ఇప్పుడు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారని వివరించారు. ముఖ్యంగా వ్యాపార అవసరాల కోసం ముందుగానే పెద్ద మొత్తంలో బంగారం నిల్వ చేసుకునే ధోరణిని తగ్గించడంలో ఈ విజ్ఞప్తి ఉపయోగపడిందని చెప్పారు.

24
కిలో బంగారంపై రూ.65 లక్షల వరకు తగ్గుదల

సీటీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రధాని బంగారం కొనుగోళ్లపై హెచ్చరిక చేసిన సమయంలో కిలో బంగారం ధర సుమారు రూ.1.90 కోట్లుగా ఉంది. ఆ తర్వాత ధరలు క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం రూ.1.25 కోట్ల స్థాయికి చేరినట్లు సంస్థ పేర్కొంది. అంటే కిలో బంగారంపై దాదాపు రూ.65 లక్షల తగ్గుదల నమోదైంది. ఈ పరిస్థితుల్లో అధిక ధరలకు బంగారం కొనుగోలు చేయకుండా వేచి చూసినవారికి ప్రయోజనం కలిగిందని బ్రిజేశ్ గొయల్ తెలిపారు. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో ధరలు తగ్గడం మధ్యతరగతి కుటుంబాలకు కొంత ఊరటనిస్తోందని అభిప్రాయపడ్డారు.

34
బంగారం కొనుగోళ్లు తగ్గించాలన్న మోదీ విజ్ఞప్తి వెనుక కారణమిదే

గత మే నెలలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. అత్యవసర అవసరం లేకపోతే ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయకుండా ఉండాలని సూచించారు. భారత్ తన అవసరాలకు సరిపడా బంగారాన్ని దేశీయంగా ఉత్పత్తి చేయలేకపోవడంతో విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటోంది. ఇందుకోసం పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ దిగుమతుల భారం తగ్గితే దేశ ఆర్థిక పరిస్థితికి కొంత మేలు జరుగుతుందని ప్రధాని భావించారు. అప్పటికే అంతర్జాతీయ పరిణామాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు దిగుమతుల వ్యయం పెరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో అనవసరమైన బంగారం కొనుగోళ్లను నియంత్రించడం ద్వారా విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించవచ్చని ఆయన ప్రజలకు వివరించారు.

44
లాల్ బహదూర్ శాస్త్రి పిలుపును గుర్తుచేసిన ప్రధాని

బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న తన విజ్ఞప్తిని వివరిస్తూ మోదీ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి తీసుకున్న నిర్ణయాన్ని గుర్తుచేశారు. 1965లో దేశం తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్న సమయంలో శాస్త్రి ప్రజలకు వారంలో ఒకరోజు భోజనం మానేయాలని పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాల కోసం ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా ఆ విజ్ఞప్తికి స్పందించారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు బంగారం కొనుగోళ్లను కొంతకాలం తగ్గించాలని కోరినట్లు మోదీ తెలిపారు. లఖ్‌నవూలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన సూచనను పాటించిన ప్రజలు డబ్బు ఆదా చేసుకోగలిగామని చెబుతున్నారని వెల్లడించారు. అవసరం లేని కొనుగోళ్లను వాయిదా వేయడం వ్యక్తిగత ఆర్థిక పరిస్థితితో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఉపయోగపడుతుందని వివరించారు.

బంగారం దిగుమతులు 40 శాతం తగ్గుదల.. డిమాండ్‌పైనా ప్రభావం

బంగారం ధరల మార్పునకు ప్రజల కొనుగోళ్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, దిగుమతి సుంకాలు వంటి అనేక అంశాలు కారణమయ్యాయ‌ని నిపుణుల అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య భారత్ బంగారం దిగుమతుల విలువ గత ఏడాదితో పోలిస్తే సుమారు 40 శాతం తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో 41.24 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి కాగా.. ఈసారి 24.78 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం జూలై నుంచి సెప్టెంబర్ మధ్య దేశంలో బంగారం డిమాండ్ 29 శాతం తగ్గి 162 టన్నులకు చేరింది. ఆభరణాల కొనుగోళ్లలోనూ 20 శాతం క్షీణత నమోదైంది. మరోవైపు దిగుమతి సుంకాలు, అంతర్జాతీయ ధరల ఒడుదొడుకులు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. మొత్తంగా బంగారం కొనుగోళ్ల విషయంలో ప్రజలు ఆచితూచి వ్యవహరిస్తుండటం దేశీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడానికి ఒక కారణంగా కనిపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories