Gold Silver Price: బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితి నుంచి.. ఇప్పుడు ధైర్యంగా కొనే అవకాశం కనిపిస్తోంది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. వరుసగా 4 రోజులుగా పసిడి దిగొస్తోంది. మరి ఈ తగ్గుదల ఎంతవరకు? ఇప్పుడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం కొనాలనుకునేవారికి వరుసగా నాలుగో రోజు కూడా అదిరిపోయే ఊరట లభించింది. నిన్న మొన్నటి వరకు లక్షల రూపాయల ధర పలికిన పసిడి.. ఇప్పుడు క్రమంగా దిగివస్తోంది. రోజురోజుకూ ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ మొదలైన సమయంలో ఈ పరిణామం నగలు కొనాలనుకునే వారికి కాస్త ఊపిరిపీల్చుకునే అవకాశం కల్పిస్తోంది.
24
రూ.93,810కు చేరిన బంగారం
గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో తగ్గుదల కొనసాగుతోంది. తాజాగా మరోసారి రేట్లు దిగిరావడంతో తులం బంగారం ధర మరింత తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.490 తగ్గింది. దీంతో తులం పసిడి రేటు రూ.1,25,080కు చేరింది. అంటే బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ధరల పరంగా కొంత ఉపశమనం లభించినట్లే. ఇక ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాములపై రూ.450 దిగిరావడంతో ప్రస్తుతం రూ.1,14,650 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల బంగారం ధర సైతం రూ.370 తగ్గి రూ.93,810కు చేరింది. ఇలా మూడు రకాల పసిడి ధరల్లోనూ తగ్గుదల కనిపించడం విశేషం.
బంగారంతో పాటు వెండి కొనుగోలుదారులకూ ఊరట లభిస్తోంది. వెండి ధరలు కూడా దిగివస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కిలో వెండి ధర రూ.1.75 లక్షలుగా ఉంది. గతంలో భారీగా పెరిగిన వెండి ధరలు ఇప్పుడు తగ్గుతుండటంతో కొనుగోలుదారులు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు.
34
అమెరికా ఫెడ్ నిర్ణయాలతో గందరగోళం
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ తగ్గుదల వెనుక అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మళ్లీ పెంచవచ్చనే అంచనాలు బంగారం ధరలను కిందికి లాగుతున్నాయి. సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగితే బంగారం వంటి వడ్డీ ఆదాయం ఇవ్వని పెట్టుబడులపై ఆసక్తి తగ్గుతుంది. దీనికి తోడు అమెరికా డాలర్ మరింత బలపడుతోంది. డాలర్ బలపడినప్పుడు ఇతర దేశాల కరెన్సీలతో బంగారం కొనడం ఖరీదవుతుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. మరోవైపు అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరుగుతుండటం కూడా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతోంది. బంగారంలో పెట్టుబడి పెట్టడం కంటే బాండ్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆదాయం పొందవచ్చని కొందరు ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీంతో విలువైన లోహాల నుంచి పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నాయి.
ఇక స్టాక్ మార్కెట్లలో నష్టాలను భర్తీ చేసుకోవడానికి కొందరు ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న బంగారం, వెండిని విక్రయిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసొచ్చి అంతర్జాతీయ మార్కెట్లో ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఫలితంగా దేశీయ మార్కెట్లోనూ పసిడి, వెండి రేట్లు తగ్గుతున్నాయి. మొత్తానికి వరుసగా నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈ ధరల పతనం పసిడి ప్రియులకు మంచి ఊరటనిస్తోంది. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ఈ తగ్గుదలను ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే ధరలు ఇంకా తగ్గుతాయా? లేక మళ్లీ పెరుగుతాయా? అనేది అమెరికా ఫెడ్ నిర్ణయాలు, డాలర్ విలువ, అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.