2026లో కొన్న బంగారం ధ‌ర‌, 2030 నాటికి ఎంత కానుందో తెలుసా.? 4 ఏళ్ల‌లో ఏకంగా..

Published : Nov 08, 2026, 07:39 PM IST

Gold Price Prediction: బంగారం ధ‌ర‌ల్లో భారీగా హెచ్చుత‌గ్గులు క‌నిపిస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో బంగారం ధ‌ర‌లు భారీగా పెరిగే అవకాశం ఉందని పలు అంచనాలు వేస్తున్నారు. 2030 నాటికి బంగారం ధరలు ఎలా ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
2030 నాటికి 10 గ్రాముల బంగారం ధర ఎంత ఉండొచ్చు?

ప్రస్తుతం అంటే 2026 నవంబర్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.1.40 లక్షలుగా ఉంది. వచ్చే నాలుగేళ్లలో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని కొన్ని నివేదికలు అంచనా వేస్తున్నాయి. లెమ‌న్‌ సంస్థ 2026 అక్టోబర్ 1న ప్రచురించిన నివేదిక ప్రకారం.. 2030 నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1.62 లక్షల నుంచి రూ.2.60 లక్షల వరకు చేరవచ్చు. మరోవైపు ప్రైమ్ఎక్స్‌బీటీ నివేదిక ప్రకారం ఇదే సమయానికి భారత మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.2.11 లక్షలకు చేరే అవకాశం ఉంది. ఈ అంచనాలను పరిశీలిస్తే 2030 నాటికి బంగారం ధర రూ.2 లక్షలు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.

25
బంగారంపై పెట్టుబడి పెడితే ఎంత లాభం రావచ్చు?

2026లో బంగారం కొనుగోలు చేసి 2030 వరకు అలాగే ఉంచితే మంచి లాభం పొందే అవకాశం ఉండొచ్చని అంచనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు ప్రస్తుతం రూ.1 లక్ష విలువైన బంగారం కొనుగోలు చేశారనుకుందాం. వచ్చే నాలుగేళ్లలో బంగారం ధర 50 శాతం పెరిగితే.. 2030 నాటికి దాని విలువ రూ.1.50 లక్షలకు చేరుతుంది.

అదే ప్రస్తుతం రూ.2 లక్షల విలువైన బంగారం కొనుగోలు చేస్తే.. ధర 50 శాతం పెరిగిన పరిస్థితుల్లో దాని విలువ రూ.3 లక్షలకు చేరవచ్చు. అయితే ఇవి కేవలం అంచనాల ఆధారంగా వేసిన లెక్కలు మాత్రమే. వాస్తవంగా వచ్చే లాభం భవిష్యత్తులో బంగారం ధరలపై ఆధారపడి ఉంటుంది.

35
బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలివే

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడానికి అనేక అంశాలు కారణమవుతాయి. ముఖ్యంగా ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తున్నాయి. తమ విదేశీ నిల్వల్లో డాలర్లతో పాటు బంగారం వాటాను కూడా పెంచుకుంటున్నాయి. దీనివల్ల అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరుగుతోంది.

అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో తీసుకునే నిర్ణయాలు, డాలర్ విలువలో మార్పులు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి ఏర్పడినప్పుడు చాలామంది బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

45
రూపాయి విలువ తగ్గితే భారత్‌లో బంగారం మరింత ప్రియం

భారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులతో పాటు రూపాయి విలువ కూడా కీలకంగా ఉంటుంది. మన దేశం విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఈ కొనుగోళ్లు ప్రధానంగా డాలర్లలో జరుగుతాయి. ఒకవేళ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గితే బంగారం దిగుమతి చేసుకోవడానికి ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెద్దగా మారకపోయినా భారతదేశంలో ధర పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే రూపాయి మారకం విలువ కూడా దేశీయ బంగారం ధరలను నిర్ణయించే ముఖ్యమైన అంశంగా ఉంటుంది.

55
బంగారం కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి

2030 నాటికి బంగారం ధర రూ.2 లక్షలు దాటవచ్చనే అంచనాలు ఉన్నప్పటికీ.. ధరలు కచ్చితంగా అంతే పెరుగుతాయని చెప్పలేం. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, డాలర్ విలువ, రూపాయి మారకం రేటు వంటి అంశాల ఆధారంగా ధరల్లో మార్పులు రావచ్చు. బంగారం ధరలు తగ్గే అవకాశాన్ని కూడా విస్మరించకూడదు. అలాగే ఆభరణాల రూపంలో బంగారం కొనుగోలు చేసేవారు తరుగు, మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి. కాబట్టి కేవలం భవిష్యత్తులో ధర పెరుగుతుందనే అంచనాతోనే పెట్టుబడి పెట్టకుండా, తమ ఆర్థిక అవసరాలు, పెట్టుబడి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.

గమనిక: పైన పేర్కొన్న‌ ధరలు, భవిష్యత్తు అంచనాలు అందుబాటులో ఉన్న నివేదికల ఆధారంగా ఇచ్చినవి. ఇవి హామీతో కూడిన రాబడులు కావని గుర్తుంచుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories