కొత్తేడాదిలో బంగారం కొనే ప్లాన్‌ చేస్తున్నారా.? మీకో షాకింగ్ న్యూస్‌, తులం ఎంతకు చేరనుందంటే

First Published | Dec 31, 2024, 5:42 PM IST

బంగారం కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు, ఇదొక ఎమోషన్‌. బోనస్ వచ్చినా, నాలుగు రూపాయలు మిగిలినా వెంటనే చాలా మందికి వచ్చే ఆలోచన కొంత బంగారం కొని పక్కన పెట్టేద్దామని. మరీ ముఖ్యంగా భారతీయులను, బంగారాన్ని విడదీసి చూడలేం. అందుకే బంగారం ధర ఎంత పెరిగినా కొనుగోలు చేస్తూనే ఉంటారు. కేవలం ఆభరణానికి మాత్రమే కాకుండా, పెట్టుబడి ఆప్షన్‌గా కూడా బంగారాన్ని ఎంచుకుంటారు. 
 

ఇదిలా ఉంటే 2024లో బంగారం ధరలు ఆల్‌ టైమ్‌ రికార్డుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో తులం బంగారం ధర రూ. లక్షకు చేరుకుంటోందని చాలా మంది అంచనా వేశారు. అయితే రూ. 85 వేల మార్క్‌కు చేరుకుని ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 79,350 వద్ద కొనసాగుతోంది. అయితే ఈ తగ్గుదల కొద్ది రోజులకే పరిమితమనే వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది బంగారం ధరలు భారీగా పెరగనున్నాయని తెలుస్తోంది. 
 

భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 85 వేలకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. మరీ చెప్పాలంటే తులం బంగారం ధర రూ. 90 వేలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదుని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 


2024లో ఒకానొక సమయంలో తులం బంగారం ధర రూ. 82,400 ఆల్‌ టైమ్‌ రికార్డు స్థాయికి చేరింది. వెండి కూడా బంగారంతో పోటీ పడీ పెరిగింది. ఈ ఏడాది కిలో వెండి ధర ఏకంగా రూ. 1 లక్ష మార్క్‌ను దాటేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ ఏడాది ప్రారంభంలో బౌన్సు బంగారం ధర 2062 డాలర్లుగా ఉండేది. ఓ దశలో ఏకంగా 2790 డాలర్ల ఆల్‌టైమ్‌ స్థాయికి చేరిది. ప్రస్తుతం బంగారం ధర 2600 డాలర్ల ఎగువన ట్రేడ్‌ అవుతోంది. 
 

ఇవీ కారణాలు..

వచ్చే ఏడాదిలో బంగారం ధరలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బంగారంపై మెరుగైన రాబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయం నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తుండడం, వడ్డీ రేట్లు తగ్గింపు వంటివి బంగారం ధరలు పెరగడానికి కారణమని అంటున్నారు. వెండి సైతం వచ్చే ఏడాదిలో కిలో రూ. 1.25 లక్షలకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. ఏఐ టెక్నాలజీలో వెండి ఉపయోగం పెరుగుతున్న నేపథ్యంలో కూడా వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. 

Latest Videos

click me!