Today Gold Rate: పసిడి మార్కెట్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారుల దృష్టి అంతా ఇప్పుడు బులియన్ మార్కెట్‌పై పడింది. ఈ నేపథ్యంలో ధరలు మరింత పడిపోతాయా? ఇదే సరైన సమయమా?
పసిడి ప్రియులకు ప్రస్తుతం మంచి అవకాశం దొరికినట్టే కనిపిస్తోంది. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిస్థితులు, పెట్టుబడిదారుల వ్యూహాలు, ముడి చమురు ధరల మార్పులు ఇవన్నీ కలిపి పసిడి రేట్లపై ప్రభావం చూపుతున్నాయి.
25
4 రోజుల్లో రూ.3వేలు పతనం
గత నాలుగు రోజుల్లోనే తులం బంగారం ధర సుమారు రూ.2800 మేర తగ్గింది. తాజాగా ఏప్రిల్ 24న హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.600 మేర తగ్గి రూ.1,52,950కు చేరింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా రూ.550 మేర పడిపోయి 10 గ్రాములకు రూ.1,40,200 వద్ద నమోదైంది.
35
అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం
బంగారం ధరల పతనానికి ప్రధాన కారణాల్లో అంతర్జాతీయ ఉద్రిక్తతలు కీలకంగా మారాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. హార్ముజ్ జలసంధి అంశం కూడా ఇంధన సరఫరాపై అనిశ్చితిని పెంచింది.
ఇక ముడి చమురు ధరలు మళ్లీ పెరగడం, గరిష్ఠ స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేసుకోవడం కూడా బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతోంది. అదనంగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు తక్కువగా ఉండటం వల్ల పెట్టుబడులు ఇతర మార్గాలకు మళ్లుతున్నాయి.
మరోవైపు, రష్యా భారీగా బంగారం విక్రయిస్తున్నట్లు వస్తున్న వార్తలు కూడా మార్కెట్లో సరఫరా పెరగడానికి కారణమవుతున్నాయి. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.
55
నాలుగు సెషన్లలో క్షీణించిన కిలో వెండి
బంగారం మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా గణనీయంగా పడిపోయాయి. గత నాలుగు సెషన్లలో కిలో వెండి ధర రూ.15,000 వరకు తగ్గగా, ఒక్కరోజులోనే రూ.5,000 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,65,000 వద్ద కొనసాగుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు తగ్గడం పెట్టుబడిదారులకు ఒక అవకాశం కావచ్చు. అయితే అంతర్జాతీయ పరిస్థితులు ఇంకా అస్థిరంగా ఉండటంతో, ధరలు భవిష్యత్తులో మరింత మారే అవకాశం కూడా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.