ఈ ట్రైన్‌లో ప్రయాణించాలంటే మీరు టిక్కెట్ కొనక్కరలేదు: ఫ్రీగా ఎన్నిసార్లయినా తిరగొచ్చు

First Published | Oct 16, 2024, 10:34 AM IST

ట్రైన్ ఎక్కాలంటే టిక్కెట్ కచ్చితంగా ఉండాలి కదా.. ఎక్కడికి వెళ్లాలో ఆ స్టేషన్ వరకు తప్పకుండా డబ్బులు కట్టి టిక్కెట్ కొనుక్కోవాలి. కాని ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ట్రైన్ లో మీరు ప్రయాణం చేయాలనుకుంటే టిక్కెట్ కొనక్కరలేదు. మీరు విన్నది నిజమే. టిక్కెట్ తీసుకోకుండా ఈ ట్రైన్ లో మీరు ఎన్నిసార్లయినా హాయిగా తిరిగి రావొచ్చు. ఆ రైలుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.  
 

ఇండియన్ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే సంస్థల్లో ఒకటి. ఇండిపెండెన్స్ కి ముందు వరకు భారత దేశంలో 42 రైల్వే సంస్థలు వేరువేరుగా పనిచేసేవి. 1951లో ఈ సంస్థలన్ని కలిసి భారతీయ రైల్వే ఏర్పడింది. ప్రస్తుతం దేశం నలుమూలల్లో రైల్వే సేవలు ప్రజలకు అందుతున్నాయి. ప్రతి రోజూ మొత్తం 8,702 ట్రైన్స్ ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ప్రతి రోజు సుమారు కోటి యాభై లక్షల మంది రైల్వే సేవలను వినియోగించుకుంటున్నారు. రోజురోజుకూ రైల్వే సేవలు వినియోగించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో పండుగల సీజన్‌లో టిక్కెట్లు దొరకడం కష్టంగా మారుతోంది. 
 

టికెట్ లేకుండా రైలు ప్రయాణం నేరం

ఇలాంటి పరిస్థితుల్లో కొందరు టికెట్ లేకుండానే రైళ్లలో ప్రయాణాలు చేస్తుంటారు. టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కితే చట్ట ప్రకారం నేరం. వారికి జరిమానా, అవసరమైతే జైలు శిక్ష కూడా విధిస్తారు. ఇంత కఠిన చట్టాలున్నా ఓ రైలులో మాత్రం టికెట్ లేకుండా ప్రయాణించొచ్చు. ఆ ట్రైన్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 
 


భారతదేశంలో ఉచిత రైలు ఇదే..

ఇంత పెద్ద రైల్వే వ్యవస్థలో టిక్కెట్ లేకుండా రైలు ప్రయాణం చేసే ఛాన్స్ ఉందని చాలా మందికి తెలియదు. ఈ రైలుకు టికెట్ అవసరం లేదు. టీటీఈ టికెట్ చెక్ చేయడానికి వస్తే పట్టుబడతామనే భయం కూడా అవసరం లేదు. మీరు ఈ రైలులో ఏడాది పొడవునా ఉచితంగా ప్రయాణించవచ్చు.

భాక్రా-నంగల్ రైల్వే సర్వీస్

భారతదేశంలో ఇదే ఏకైక ఉచిత రైలు. ఈ రైలు పేరు 'బాగ్రా-నంగల్'. ఈ ట్రైన్ లో మీరు ఎటువంటి ఖర్చు లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఈ రైలు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మధ్య నడుస్తుంది. ఇందులో రోజుకు 800 నుంచి 1000 మంది ప్రయాణిస్తారు.

ఈ రైలు కోచ్‌లు చెక్కతో తయారు చేశారు. ఇది డీజిల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ రైలులో మొత్తం మూడు కోచ్‌లు మాత్రమే ఉంటాయి. వీటిలో పర్యాటకుల కోసం, మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన భోగీలున్నాయి. ఈ రైలును నడపడానికి రోజూ 50 లీటర్ల డీజిల్ వినియోగిస్తారు. అందమైన కొండల మధ్య 13 కిలోమీటర్లు హాయిగా ప్రయాణం చేయొచ్చు. ఈ ట్రైన్ జర్నీ ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.

భాక్రా-నంగల్ డ్యామ్ అందాలు చూడటానికి..

ఈ రైలులో ప్రయాణించడం ద్వారా బాగ్రా-నంగల్ డ్యామ్‌ని చూడొచ్చు. అందుకే పర్యాటకులు దేశం నలుమూలల నుంచి ఇక్కడకు వస్తుంటారు. ఈ ట్రైన్ శివాలిక్ కొండల మీదుగా వెళుతుంది. సట్లెజ్ నదిని దాటుతుంది. ఆ సమయంలో కనిపించే నేచర్ అందాలు మీరు జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ అనుభూతి కోసమే జనం ఎక్కడెక్కడి నుంచో ఇక్కడకు వస్తుంటారు. దేశం నలుమూలల నుంచి వస్తున్న పర్యాటకుల కోసమే ఇండియన్ రైల్వేస్ ఉచిత రైలు సదుపాయాన్ని కల్పిస్తోంది. 
 

భాక్రా-నంగల్ రైల్వే చరిత్ర

బాగ్రా-నంగల్ రైలు సర్వీసు 1948లో ప్రారంభమైంది. బాగ్రా నంగల్ డ్యామ్ నిర్మాణం కోసం మెషీన్స్ తీసుకెళ్లడానికి, కార్మికులను రవాణా చేయడానికి ఈ రైలు సర్వీస్ ను ప్రారంభించారు. తర్వాత రోజుల్లో ఈ రైలు బాగ్రా-నంగల్ డ్యామ్‌ను సందర్శించాలనుకునే పర్యాటకుల కోసం నడిపారు. ఈ రైలులో మీరు టికెట్ తీసుకోకుండా, ఎటువంటి ఛార్జీలు చెల్లించకుండా కొండల మధ్య రైలు ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. 2011లో ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ రైలు సర్వీసును నిలిపివేయాలని భావించారు. అయితే మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. మీరు కూడా ఉచిత రైలు ప్రయాణాన్ని ఆస్వాదించేందుకు బాగ్రా నంగల్ ఒకసారి వెళ్లి రండి. అక్కడ డ్యామ్, సట్లెజ్ నది అందాలు వీక్షించి రండి. 
 

Latest Videos

click me!