EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి ప్ర‌త్యేక కార్డులు.. ఇక‌పై ఏటీఎమ్ నుంచే డ‌బ్బులు విత్‌డ్రా

Published : Jan 01, 2026, 12:27 PM IST

EPFO: పీఎఫ్ అమౌంట్‌ను విత్‌డ్రా చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో క్లైమ్ చేయాల‌నే విష‌యం తెలిసిందే. దీనికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అయితే ఇప్పుడీ ప్ర‌క్రియ‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేయ‌నున్నారు. ఏటీఎమ్ నుంచి పీఎఫ్ డ‌బ్బులు తీసుకునే రోజులు త్వ‌ర‌లోనే రానున్నాయి. 

PREV
15
ATM ద్వారా PF నగదు తీసుకునే అవకాశం

ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా నుంచి డబ్బు తీసుకోవాలంటే ఇప్పటివరకు పెద్ద ప్రాసెస్ ఉండేది. ఆన్‌లైన్ దరఖాస్తులు, ధృవీకరణలు, వేచిచూడాల్సిన పరిస్థితి ఎదురయ్యేది. ఈ సమస్యకు పరిష్కారంగా EPFO కీలక నిర్ణయం తీసుకుంది. 2026 నుంచి ATM ద్వారా PF నగదు తీసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయినా మీడియా కథనాల ప్రకారం ఏర్పాట్లు దాదాపు పూర్తయిన‌ట్లు తెలుస్తోంది.

25
డెబిట్ కార్డు తరహాలో పనిచేసే EPFO ప్రత్యేక కార్డు

ఈ కొత్త విధానంలో EPFO సభ్యులకు ఒక ప్రత్యేక కార్డును జారీ చేయనుంది. ఇది బ్యాంక్ డెబిట్ కార్డు తరహాలో పనిచేస్తుంది. ఈ కార్డు ఉపయోగించి ATMలో PF ఖాతా నుంచి నేరుగా నగదు తీసుకోవచ్చు. ప్రభుత్వం అంచ‌నా ప్రకారం PF డబ్బు ఉద్యోగుల సొంత సంపద. అత్యవసర సమయంలో ఆ డబ్బు అందుబాటులో ఉండాలి. ఈ దిశగా EPFO ఇప్పటికే బ్యాంకులు, RBIతో చర్చలు పూర్తిచేసింది. అవసరమైన సాంకేతిక వ్యవస్థను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.

35
కోట్లాది ఉద్యోగులకు భారీ ఊరట

ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా సంఘటిత రంగంలో పనిచేస్తున్న 7 కోట్లకుపైగా ఉద్యోగులకు లాభం కలగనుంది. EPFO గణాంకాల ప్రకారం 2014లో సభ్యుల సంఖ్య 3.3 కోట్లు మాత్రమే ఉండేది. అప్పట్లో ఫండ్ విలువ రూ.7.4 లక్షల కోట్లు. ప్రస్తుతం EPFO ఫండ్ పరిమాణం రూ.28 లక్షల కోట్లను దాటింది. ప్రతి నెలా సుమారు 7.8 కోట్ల మంది ఉద్యోగులు PFలో డబ్బు జమ చేస్తున్నారు. సభ్యుల సంఖ్య పెరగడంతో క్లెయిమ్‌ల నిర్వహణ EPFOకు సవాలుగా మారింది. ATM సదుపాయం వ‌స్తే ఉద్యోగులకు వెంటనే డబ్బు లభిస్తుంది. EPFOపై పని భారం కూడా తగ్గుతుంది.

45
ATM ఉపసంహరణ పరిమితిపై ఇంకా స్పష్టత లేదు

ATM ద్వారా PF నగదు తీసుకునే అవకాశం వచ్చినా ఒక పరిమితి మాత్రం ఉండనుంది. ఒకసారి ఎంత మొత్తం తీసుకోవచ్చు? నెలకు ఎంత వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది? అనే అంశాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఉపసంహరణ పరిమితిపై త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారు. భద్రత, ఫండ్ స్థిరత్వం అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిబంధనలు రూపొందించనున్నారు.

55
EPFO నియమాలు మరింత సులువు దిశగా

ఇటీవల కాలంలో EPFO తన నియమాలను క్రమంగా సరళం చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది. దీంతో అనారోగ్యం, వివాహం, ఇతర అత్యవసర అవసరాల కోసం డబ్బు త్వరగా తీసుకునే అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ATM ద్వారా PF ఉపసంహరణ అమలులోకి వస్తే ఉద్యోగులకు ఇది గేమ్ ఛేంజర్‌గా మారనుంది. అత్యవసర సమయంలో బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తక్షణ ఆర్థిక సహాయం అందుబాటులోకి రానుంది.

Read more Photos on
click me!

Recommended Stories