Chicken Price Hike: మొక్కజొన్న, సోయాబీన్ ధరలు భారీగా పెరగడంతో పౌల్ట్రీ రంగం సంక్షోభంలో పడింది. 25 శాతం ఫారాలు మూతపడటంతో చికెన్ కిలోకు రూ. 50, గుడ్డు రూ. 4 వరకు పెరిగే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
మొక్కజొన్న, సోయాబీన్ ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న చికెన్, కోడిగుడ్ల రేట్లు
సామాన్యులకు, ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులకు త్వరలోనే గట్టి షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. దేశంలో చికెన్, కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకే పరిస్థితులు నెలకొన్నాయి. కోళ్ల దాణా తయారీలో వాడే మొక్కజొన్న, సోయాబీన్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చికెన్ ధర కిలోకు రూ. 40 నుంచి రూ. 50 వరకు, కోడిగుడ్డు ధర ఒక్కొక్కటి రూ. 3 నుంచి రూ. 4 వరకు పెరిగే ఛాన్స్ ఉందని పౌల్ట్రీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
26
ప్రభుత్వానికి పౌల్ట్రీ అసోసియేషన్ కీలక విజ్ఞప్తి
మొక్కజొన్న, సోయాబీన్ ధరల పెరుగుదల నుంచి తమను ఆదుకోవాలని ఆల్ ఇండియా పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ (AIPBA) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. బుధవారం ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, మార్కెట్లో అక్రమ నిల్వలను అరికట్టి, స్టాక్ లిమిట్ విధించాలని డిమాండ్ చేసింది.
ప్రభుత్వ గోదాముల నుంచి పౌల్ట్రీ పరిశ్రమకు రాయితీ ధరలపై సుమారు 30 లక్షల టన్నుల మొక్కజొన్నను అందించాలని కోరింది. ఇథనాల్ తయారీదారులకు ప్రభుత్వం ఇదే తరహాలో సాయం అందించిందని అసోసియేషన్ గుర్తు చేసింది.
36
50 ఏళ్లలో ఎన్నడూ లేని తీవ్ర సంక్షోభం
గత 50 ఏళ్ల చరిత్రలో పౌల్ట్రీ పరిశ్రమ ఎన్నడూ లేని అత్యంత తీవ్రమైన సంక్షోభాన్ని ఇప్పుడు ఎదుర్కొంటోందని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కోళ్ల దాణా ధరలు భారీగా పెరగడంతో రైతులకు ఉత్పత్తి ఖర్చు తడిసి మోపెడవుతోంది. పౌల్ట్రీ ఫీడ్ ధర టన్నుకు దాదాపు ₹15,000 వరకు పెరిగిందని ఏఐపీబీఏ వర్గాలు తెలిపాయి.
దీనివల్ల వ్యాపారం నడపడం చాలా కష్టంగా మారిందని, చాలా మంది రైతులు ఉత్పత్తిని తగ్గించుకోవడమో లేదా ఫారాలను మూసివేయడమో చేస్తున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
దేశంలో మొక్కజొన్న, సోయాబీన్ పంటల దిగుబడి సరిపడా ఉన్నప్పటికీ, మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి, అక్రమంగా నిల్వ చేయడం వల్లే ధరలపై ఒత్తిడి పెరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ, వ్యవసాయ గణాంకాలు కూడా రెండు పంటల ఉత్పత్తి బాగానే ఉన్నట్లు చూపిస్తున్నాయని, కాబట్టి ప్రస్తుత సంక్షోభానికి అసలు కారణం పంటల కొరత కాదని అసోసియేషన్ స్పష్టం చేసింది.
దాణా తయారు చేసే ఫ్యాక్టరీలలో ఉత్పత్తి, డిమాండ్ 15 నుంచి 20 శాతం వరకు పడిపోయాయి. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా 20 నుంచి 25 శాతం పౌల్ట్రీ ఫారాలు ఇప్పటికే మూతపడ్డాయి లేదా మూతపడే దశలో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు సహా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
56
రైతులకు భారీ నష్టాలు
దాణా ఖర్చు పెరిగిన స్థాయిలో చికెన్ ధరలు పెరగకపోవడంతో, పౌల్ట్రీ రైతులు కిలో చికెన్ అమ్మకంపై రూ. 40 నుంచి రూ. 50 వరకు నష్టపోతున్నారని ఏఐపీబీఏ పేర్కొంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య ఇంటిగ్రేటెడ్ పౌల్ట్రీ కంపెనీలు సంపాదించిన లాభాలన్నీ నవంబర్ నాటికి పూర్తిగా కరిగిపోయాయి.
దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీలు చెల్లించే ఆదాయపు పన్ను దాదాపు సున్నాకు పడిపోయే అవకాశం ఉంది.
66
జనవరి వరకు తప్పని అనిశ్చితి
మొక్కజొన్న అధిక ధరల కారణంగా ఇప్పటికే పలు ఇథనాల్ ప్లాంట్లు కూడా మూతపడ్డాయి. జనవరి నాటికి మొక్కజొన్న, సోయాబీన్ ధరల నుంచి కొంత ఉపశమనం లభించవచ్చని అసోసియేషన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ, ప్రస్తుతం మాత్రం పరిస్థితి అనిశ్చితంగానే ఉంది. ధరల పెరుగుదల, సరఫరాలో ఆటంకాలు ఇలాగే కొనసాగితే పౌల్ట్రీ, డెయిరీ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది గ్రామీణ కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని ఏఐపీబీఏ సహా పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.