
బ్యాంకులు లాకర్ సౌకర్యం తీసుకువచ్చిన తర్వాత చాలా మంది తమ వద్ద ఉన్న విలువైన వస్తువులను వాటిలో దాచుకోవడం మొదలుపెట్టారు. అయితే, తాజాగా బెంగళూరులోని ఒక మహిళ తాను అకౌంట్ కలిగిన బ్యాంకు లాకర్‌లో దాచిన 145 గ్రాముల బంగారం, వజ్రాల నగలు కనపడకపోవడంతో షాక్‌కు గురయ్యారు.
బ్యాంకు అధికారులకు ఈ విషయం గురించి పదేపదే ఫిర్యాదు చేశారు. పై అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ వారి నుంచి సరైన సమాధానం రాలేదు. ఆ విషయం తమకు తెలియదని, లాకర్ ను తాము యాక్సెస్ చేయలేమని చెప్పారు. పరిహారం కోరుతూ ఫిర్యాదు చేయగా, రూల్స్ ను ప్రస్తావిస్తూ ఒక్క రూపాయి రాదనే సమాధానం రావడంతో ఆవిడ పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఘటన తర్వాత బ్యాంక్ లాకర్లలో మన సొమ్ముకు భద్రత, అందులోని సొమ్ము లేదా ఇతర వస్తువులు పోయిన పరిస్థితుల్లో బ్యాంకులు తీసుకునే బాధ్యత అంశం హాట్ టాపిక్ గా మారింది. మరి బ్యాంకు లాకర్ల విషయంలో రూల్స్ ఏం చెబుతున్నాయి?
భారతదేశంలోని బ్యాంక్ లాకర్ సేవలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూపొందించిన మార్గదర్శకాలు ప్రకారం పనిచేస్తాయి. 2021లో ఆర్బీఐ కొత్త నిబంధనలు విడుదల చేసింది.
1. బ్యాంకులు లాకర్ లోపల ఉన్న వస్తువులపై ఎలాంటి రికార్డులు నిర్వహించకూడదు.
2. లాకర్‌లో ఏమి ఉంచారో తెలుసుకోవాలన్న హక్కు బ్యాంకులకు లేదు.
3. కానీ, లాకర్‌లో వస్తువులు మిస్ కావడం లేదా దొంగతనం జరిగితే.. ఇందులో బ్యాంకు నిర్లక్ష్యం ఉంటే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
RBI ప్రకారం, బ్యాంకు నిర్లక్ష్యం వల్ల నష్టం జరిగితే, బ్యాంక్ సంవత్సర లాకర్ అద్దెకు 100 రెట్లు వరకు పరిహారం చెల్లించాలి.
ఉదాహరణకు: ఒక లాకర్ సంవత్సరం అద్దె రూ.3,000 అయితే, బ్యాంక్ అందించగలిగే గరిష్ట పరిహారం రూ.3 లక్షల వరకూ ఉంటుంది.
బ్యాంకు తప్పిదం లేదా భద్రతా లోపం లేదని తేలితే, దొంగతనం జరిగినా బ్యాంకు బాధ్యత వహించదు.
ఉదాహరణకు, కస్టమర్ తానే లాకర్ తాళం తప్పుగా ఉంచితే లేదా తాళం పోయినపుడు, బ్యాంకు బాధ్యత వుండదు. విచారణలో బ్యాంకు నిర్లక్ష్యం లేదని తేలితే మీరు లాకర్ లో దాచుకున్న నగదు అయిన, బంగారం అయినా పోతే మీకు ఒక్క రూపాయి కూడా రాదు.
1. బ్యాంకు అన్ని భద్రతా చర్యలు తీసుకున్నపప్పటికీ అగ్ని ప్రమాదం, వరదలు వంటి సహజ విపత్తుల వల్ల లాకర్ నష్టం జరిగితే పరిహారం లభించదు.
2. కానీ, అలారాలు పనిచేయకపోవడం వంటి నిర్లక్ష్యం కారణంగా నష్టం జరిగితే బ్యాంకు బాధ్యత వహిస్తుంది.
1. బ్యాంకులు లాకర్‌లో ఉన్న వస్తువులకు బీమా ఇవ్వవు.
2. కస్టమర్ కావాలనుకుంటే ప్రైవేట్ బీమా కంపెనీల నుంచి ప్రత్యేక బీమా తీసుకోవచ్చు.
3. SBI, ICICI, HDFC వంటి బ్యాంకులు బీమాతో సంబంధం లేకుండా లాకర్ సేవలకు కేవలం అద్దె వసూలు చేస్తున్నాయి.
1. SBI నియమాల ప్రకారం ఒక సంవత్సరంలో 12 సార్లు ఉచిత యాక్సెస్ ఇస్తారు.
2. ఆ తరువాత ప్రతి అదనపు సందర్శనకు రూ.100 + GST ఛార్జ్ చేస్తారు.
3. ఇది బ్యాంకుల విధానాన్ని బట్టి మారవచ్చు.
4. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు లాకర్ గదులకు సీసీటీవీలను అమర్చాలి, వాటి ఫుటేజీని కనీసం 180 రోజుల పాటు భద్రపరచాలి. అలాగే, లాకర్లు తెరిచినప్పుడు కస్టమర్‌కు ఎస్.ఎం.ఎస్. లేదా ఇమెయిల్ ద్వారా సమాచారం పంపాలి.
1. RBI 2021 నిబంధనల ప్రకారం, లాకర్ ఇచ్చే ముందు అధిక మొత్తంలో ఫిక్సుడ్ డిపాజిట్ కోరే హక్కు బ్యాంకులకు లేదు.
2. ఒక కస్టమర్‌కి లాకర్ ఇవ్వాలంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేయమని ఏ బ్యాంకూ అడగదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే బ్యాంకు ఎఫ్డీని అడగవచ్చు. వాటిలో.. కస్టమర్ లాకర్ అద్దె చెల్లించడంలో ఆలస్యం చేసినప్పుడు లేదా చెల్లించనప్పుడు.
అప్పుడు బ్యాంకు లాకర్‌ను తెరిచి, బకాయిలను వసూలు చేసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రక్రియలో అయ్యే ఖర్చులను భరించడానికి అవసరమైనంత మొత్తాన్ని మాత్రమే ఏఫ్డీగా తీసుకోవచ్చు. అయితే, ఈ మొత్తం, లాకర్ అద్దె, లాకర్‌ను తెరిచే ఖర్చులకు సరిపడా మాత్రమే ఉండాలి, అంతే కానీ పెద్ద మొత్తంలో ఉండకూడదు.
1. డబుల్ లాక్ వ్యవస్థ - ఒక తాళం కస్టమర్ వద్ద, మరో మాస్టర్ కీ బ్యాంకు వద్ద ఉంటుంది.
2. బ్యాంక్ మొత్తం భద్రతను అందించాలి కానీ లాకర్ లోపల ఏముందనేది తెలుసుకోలేదు.
3. బ్యాంకు లాకర్ అద్దె 2025 (SBI) ప్రకారం.. స్మాల్ లాకర్ కు రూ.1,000 నుంచి 3000 వరకు ఉంటుంది. మీడియం, లార్జ్ లాకర్ ధరలు కాస్త ఎక్కువగా, ప్రాంతాలను బట్టి మారుతాయి. 18% వరకు జీఎస్టీ అదనంగా ఉంటుంది. అద్దె సంవత్సరం మొత్తం ముందుగా చెల్లించాలి. ఆలస్యం అయితే ఆలస్య రుసుము విధిస్తారు.
మొత్తంగా బ్యాంకు లాకర్ రూల్స్ ప్రకారం.. బ్యాంక్ లాకర్‌లోని వస్తువులపై బాధ్యత కస్టమర్ దే అయినా, బ్యాంకు నిర్లక్ష్యం కారణంగా నష్టం జరిగితే మాత్రం పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకు మీద ఉంటుంది.
గమనిక: మీకు వివరాలు అందించిన సమయానికి మార్పులు కూడా జరిగివుండవచ్చు. కాబట్టి మరింత సమాచారం కోసం బ్యాంకు అధికారులను సంప్రదించండి.