ఇలా చేస్తే UPI మోసాలకు అడ్డుకట్ట పడినట్టే

First Published | Dec 21, 2024, 3:02 PM IST

UPI మోసాలు ఎంతలా పెరిగిపోతున్నాయో చూస్తున్నాం కదా.. అందుకే అలాంటి మోసాల నుంచి వినియోగదారులను రక్షించడానికి భారత్ పే షీల్డ్ అనే కొత్త సర్వీసును ప్రారంభించింది. దీని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రండి.  

ఆన్‌లైన్ మోసాలు ఎంతలా పెరిగిపోతున్నాయంటే మనకు తెలియకుండా మన అకౌంట్ మొత్తం ఖాళీ చేసేస్తున్నారు. ఓటీపీలు తెలుసుకొని, పిన్ నెంబర్లు కాపీ చేసి, ఈ మధ్య స్కానర్ ద్వారా కూడా అకౌంట్లు ఖాళీ చేసేస్తున్నారు. అందుకే భారత్ పే తన వినియోగదారులను UPI మోసాల నుంచి రక్షించడానికి షీల్డ్ అనే కొత్త సర్వీస్ ను ఇటీవలే ప్రారంభించింది. ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నందున సురక్షితమైన డిజిటల్ లావాదేవీలను చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. 

షీల్డ్ అనేది ఒక సేఫ్టీ ప్లానింగ్ టాస్క్. ఇది వినియోగదారులను మోసాల నుంచి కాపాడుతుంది. ఫిషింగ్ ప్రయత్నాలు, అనధికారిక లావాదేవీల నుండి రక్షిస్తుంది. వినియోగదారులు తమ ఫోన్‌ను పోగొట్టుకున్నప్పటికీ అందులో ఉండే డాటా ద్వారా మోసపోకుండా కాపాడుతుంది. 

వినియోగదారులు మొదటి 30 రోజులు ఈ సర్వీసును ఉచితంగా పొందవచ్చు. ట్రయల్ పీరియడ్ తర్వాత నెలకు కేవలం రూ.19 పే చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ వల్ల మీరెప్పుడైనా ఆన్ లైన్ మోసానికి గురైతే రూ.5,000 వరకు కవరేజీని అందిస్తుంది.


షీల్డ్ సర్వీస్ భారత్ పే యాప్‌లో అందుబాటులో ఉంది. దీన్ని Android, iOS పరికరాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సంబంధిత బ్యానర్‌పై క్లిక్ చేయడం ద్వారా యాప్ హోమ్ పేజీ నుండి నేరుగా షీల్డ్‌ను యాక్టివేట్ చేయవచ్చు. 

ఈ షీల్డ్ సర్వీస్ ఆన్ లైన్ మోసాలను అడ్డుకుంటుంది. ఒకవేళ వినియోగదారుడు మోసానికి గురైనట్లయితే క్లెయిమ్‌ను నేరుగా ఫైల్ చేయవచ్చు. OneAssist యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని దాని ద్వారా కంప్లయింట్ చేయవచ్చు. లేదా వారి టోల్ ఫ్రీ నంబర్ 1800-123-3330కి కాల్ చేసి జరిగిన మోసం గురించి రిపోర్ట్ చేయవచ్చు.

అయితే వినియోగదారులు మోసం జరిగిన 10 రోజులలోపు రిపోర్ట్ చేయాలి. పరిస్థితిని బట్టి UPI లావాదేవీ స్టేట్‌మెంట్, పోలీస్ రిపోర్ట్ కాపీ, FIR, క్లెయిమ్ ఫారమ్, UPI అకౌంట్ బ్లాక్ చేసినట్లు రుజువు వంటి కొన్ని డాక్యుమెంట్‌లను సమర్పించాల్సి ఉంటుంది.  ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు ప్రతి ఒక్కరికీ అత్యవసరంగా మారిపోయాయి. అందువల్ల షీల్డ్ వంటి చర్యలు భద్రతను కలిగిస్తాయి.

భారత్ పే షీల్డ్ డిజిటల్ చెల్లింపులను సురక్షితంగా మారుస్తుంది. కిరాణా సామాగ్రిని కొనుగోలు చేయడం నుండి బిల్లుల చెల్లింపుల వరకు ప్రతిదానికీ UPI యాప్‌లను ఉపయోగించే వ్యక్తుల సంఖ్య పెరుగుతున్నందున షీల్డ్ వంటి రక్షణ కల్పించే సౌకర్యాలను ఉపయోగించుకోవడం మేలు. ఇది ప్రమాదాన్ని పూర్తిగా తొలగించకపోయినా డిజిటల్ లావాదేవీలను అందరికీ సురక్షితంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. వినియోగదారులు కూడా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. తెలియని లింక్‌లను క్లిక్ చేయడం, అనవసర యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం, అపరిచితులతో ముఖ్యమైన చెల్లింపు సమాచారాన్ని షేర్ చేయడం మానుకొంటే మోసాలు జరగకుండా ఉంటాయి. 

Latest Videos

click me!