
Atal Pension Yojana : ఓ మనిషి హాయిగా జీవించాలంటే మంచి సంపాదన, మంచి ఆరోగ్యం వుండాలి. వృద్దాప్యంలో ఆ రెండు లేక చాలామంది ఇబ్బందిపడుతుంటారు. అయితే వృద్దాప్యంలో మన ఆరోగ్యం ఎలావుండాలో ఆ దేవుడే డిసైడ్ చేస్తాడు.. కానీ ఆదాయం ఎంతుండాలో మనమే నిర్ణయించుకోవచ్చు. ముందుచూపుతో వయసులో వుండగానే పొదుపుచేయడం ప్రారంభించడం ద్వారా వయసు మీదపడ్డాక మంచి రిటర్న్స్ పొందవచ్చు. ఇలా వృద్దాప్యంలో ఎవరూ ఆర్ధిక కష్టాలు పడకూడదని ముందే డబ్బులు కూడబెట్టేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకమే అటల్ పెన్షన్ యోజన.
ఏమిటీ అటల్ పెన్షన్ స్కీం :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వృద్దుల సంక్షేమంకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. వయసు మీదపడి ఏ పనీ చేయలేక, కుటుంబసభ్యుల దగ్గర ఖర్చులకు డబ్బులకోసం చేతులు చాచడానికి ఆత్మగౌరవం అడ్డొచ్చి చాలా ఇబ్బంది పడుతుంటారు. అందుకే వృద్దులకు ప్రతినెలా ప్రభుత్వమే ఆర్థికసాయం చేస్తోంది... ఇలా తెలుగు రాష్ట్రాల్లో వృద్దాప్య పెన్షన్లు అందిస్తున్నారు.
పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా వుండవు... కాబట్టి వయసులో వుండగానే భవిష్యత్ గురించి ప్లాన్ చేసుకోవడం మంచింది. సంపాదించే వయసులోనే చిన్నమొత్తం పొదుపు చేస్తే భవిష్యత్ లో అదే కొండంత అండగా మారుతుంది. ఇలా వృద్దాప్యంలో ఎలాంటి ఆర్థికకష్టాలు లేకుండా హాయిగా జీవితం సాగాలంటే వయసులో వుండగానే జాగ్రత్తపడాల్సిందే. ఇందుకోసమే నరేంద్ర మోదీ ప్రభుత్వం అద్భుతమైన అటల్ పెన్షన్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది.
రెక్కాడితేగాని డొక్కాడని పేదలకు, చాలిచాలని ఆదాయంతో జీవితాన్ని నెట్టుకొస్తున్నవారికి, కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ స్కీంలో ఎంత తొందరగా చేరితే అంతగా లాభం పొందవచ్చు... మనపై భారం తక్కువపడి భవిష్యత్ లో మంచి పెన్షన్ ను పొందవచ్చు. మొత్తంగా పేద, మద్యతరగతివారు, వేతనజీవుల కోసం మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన అద్భుత పథకం ఈ అటల్ పెన్షన్ యోజన.
అటల్ పెన్షన్ స్కీం ప్రయోజనాలు :
అటల్ పెన్షన్ యోజన్ పథకాన్ని 2025లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతినెల కొంతమొత్తంలో డబ్బులు పొదుపుచేస్తే రిటైర్మెంట్ వయసులో రూ.1000 నుండి రూ.5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. అయితే ఈ పథకంలో చేరే వయసు... ఎంత చెల్లిస్తున్నారు అనేదాన్ని బట్టి ఫించన్ ఎంత వస్తుందనేది ఆదారపడి వుంటుంది. 18 ఏళ్ళ నుండి 40 ఏళ్లలోపు వయసుండి... బ్యాంక్ ఖాతా వున్న ప్రతి ఒక్కరూ ఈ పథకంలో చేరవచ్చు.
18 ఏళ్లలోనే ఈ పథకంలో చేరేవారు ప్రతినెలా కేవలం 210 రూపాయల చెల్లిస్తే చాలు...60 ఏళ్ళ తర్వాత సదరు వ్యక్తి ప్రతినెలా రూ.5000 పెన్షన్ పొందుతాడు. అయితే వయసు పెరిగేకొద్దీ చెల్లించాల్సిన మొత్తం పెరుగుతుంది. 19 ఏళ్లకు 228, 20 ఏళ్లకు 248, 21 ఏళ్లకు 269, 22 ఏళ్లకు 292 రూపాయలు చెల్లించాలి...ఈ వయసులో ప్రారంభించి, ఇంతమొత్తంలో చెల్లిస్తే వృద్దాప్యంలో ప్రతినెలా మంచి పెన్షన్ పొందవచ్చు.
30 ఏళ్ళ తర్వాత ఈ అటల్ పెన్షన్ స్కీంలో చేరేవారు భవిష్యత్ లో మంచి పెన్షన్ కావాలంటే ఇప్పుడు ఎక్కువమొత్తం చెల్లించాల్సి వుంటుంది. 30 ఏళ్లవారు రూ.577 తో ప్రారంభిస్తే... 40 ఏళ్లవాళ్లు రూ.1454 తో ప్రారంభిస్తే 60 ఏళ్ల తర్వాత రూ.5 వేల పెన్షన్ పొందవచ్చు. ఇంతకంటే తక్కువమొత్తం చెల్లిస్తే భవిష్యత్ లో తక్కువ పెన్షన్ వస్తుంది.
అటల్ పెన్షన్ స్కీంలో ఎలా చేరాలి :
ఈ పథకంలో చేరాలనుకునేవారి వయసు 18-40 ఏళ్లలోపు వుండి తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ కలిగివుండాలి. కొన్ని బ్యాంకులు కొత్తగా అకౌంట్ తెరిచే సమయంలోనే మీ అనుమతితో ఈ స్కీంలో చేరుస్తాయి. ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ కలిగినవారు ఈ స్కీంలో ఆన్ లైన్ ద్వారా చేరవచ్చు. లేదంటే మీ దగ్గర్లోని బ్యాంకు,పోస్ట్ ఆఫీస్ ను సంప్రదించవచ్చు.
అయితే 18-40 ఏళ్ల వయసున్నా కూడా ఆదాయపన్ను చెల్లింపుదారులు అయితే ఈ పెన్షన్ స్కీం కు అనర్హులు. 2022 ఈ నిబంధనను తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. అలాగే 40 ఏళ్ళు పైబడినవారు కూడా ఈ స్కీంకు అనర్హులు.
అటల్ పెన్షన్ స్కీంలో చేరినవారు ప్రతినెలా లేదంటే ప్రతి మూడు నెలలకు ఓసారి లేదంటే ఆరు నెలలకు ఓసారి డబ్బులు చెల్లించవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ నుండి చెల్లించే మొత్తాన్ని ఆటో డెబిట్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. ఈ పథకంలో చేరిన నాటినుండి 60 ఏళ్లవరకు క్రమం తప్పకుండా చెల్లించాలి... ఆ తర్వాత మీరు పెన్షన్ పొందుతారు.
60 ఏళ్లలోపు చెల్లించే మొత్తాన్ని బట్టి రూ.1000 నుండి రూ.5000 వరకు పెన్షన్ వస్తుంది. ఇలా మరణించే వరకు పెన్షన్ పొందవచ్చు. ఆ తర్వాత మీ జీవిత భాగస్వామి పెన్షన్ పొందేందుకు అర్హురాలు అవుతారు. ఇద్దరి మరణం తర్వాత వారు 60 ఏళ్లవరకు చెల్లించిన మొత్తం నామినీకి చెందుతాయి. ఇలా అటల్ పెన్షన్ స్కీంలో పొదుపుచేసే వారు పన్ను మినహాయింపు పొందుతారు.